Last Updated:
ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని, తనదైన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న రజినీకాంత్.. తాజాగా తన పాత రోజులు గుర్తు చేసుకుంటూ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి.
బస్సు కండక్టర్ నుంచి సూపర్‌స్టార్ వరకు.. రజనీకాంత్ జీవిత ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం అనే చెప్పుకోవాలి. ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని, తనదైన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆయన.. ఇప్పటికీ సాధారణ వ్యక్తిలాగే జీవించేందుకు ఇష్టపడుతుంటారు. ఎంతటి ఉన్నత స్థానానికి చేరుకున్నా గతాన్ని మర్చిపోకపోవడం, అందరితో వినయంగా వ్యవహరించడం రజనీకాంత్ ప్రత్యేకత. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు మరోసారి అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో అగ్ర కథానాయకుల్లో ఒకరిగా కొనసాగుతున్న రజనీకాంత్.. ఒకప్పుడు బెంగళూరులో బస్సు కండక్టర్‌గా పనిచేశారు. నటుడిగా మారకముందు సుమారు ఐదేళ్లపాటు ఈ ఉద్యోగంలో కొనసాగిన ఆయన, అప్పటి రోజులను ఇప్పటికీ ఎంతో ఇష్టంగా గుర్తుచేసుకుంటుంటారు. తాజాగా ‘జైలర్ 2’ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న రజనీ తన పాత జ్ఞాపకాలను అభిమానులతో పంచుకున్నారు.
ఈ కార్యక్రమంలో దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్.. రజనీకాంత్‌లోని వినయం గురించి ప్రస్తావించారు. దీనిపై స్పందించిన సూపర్‌స్టార్ తన మనసులోని మాటలను బయటపెట్టారు. నటుడిగా కొనసాగడం తనకు ఇష్టమే అయినప్పటికీ, బస్సు కండక్టర్‌గా పనిచేసిన రోజులను ఇప్పటికీ మిస్ అవుతుంటానని వెల్లడించారు. ఆ ఉద్యోగం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు.
తనను తాను ఎప్పుడూ పెద్ద స్టార్‌గా భావించలేదని రజనీకాంత్ తెలిపారు. ఇప్పటికీ తన మనసులో తాను బస్సు కండక్టర్‌గానే ఉంటానని చెప్పారు. బెంగళూరుకు తరచూ వెళ్లడానికి కూడా అప్పటి జ్ఞాపకాలే ఒక కారణమని వివరించారు. తనలాంటి సాధారణ కండక్టర్.. ఇతరులతో ఎలా ప్రవర్తిస్తారో, తాను కూడా అలాగే ఉండాలని భావిస్తానని ఆయన వ్యాఖ్యానించారు.
రజనీకాంత్ మాటలు ఆయన వ్యక్తిత్వాన్ని మరోసారి చాటిచెప్పాయి. సాధారణ ఉద్యోగం నుంచి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నటుడిగా ఎదిగినా, తన మూలాలను మర్చిపోకపోవడం అభిమానులను ఆకట్టుకుంటోంది. విజయాన్ని అందుకున్న తర్వాత కూడా వినయంగా ఉండాలనే సందేశాన్ని ఆయన తన మాటల ద్వారా అందించారు.
మరోవైపు, రజనీకాంత్ నటిస్తున్న ‘జైలర్ 2’పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ‘జైలర్’కు సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. తొలి భాగం విజయంతో రెండో భాగంపై అంచనాలు పెరిగాయి. అక్టోబరు 15 న ఈ సినిమా రిలీజ్ కానుంది. సినిమా ప్రచార కార్యక్రమాల నేపథ్యంలో రజనీకాంత్ పంచుకుంటున్న అనుభవాలు కూడా వార్తల్లో నిలుస్తున్నాయి.














