Last Updated:
హారర్, థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో కూడిన ఓ ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. అదే ‘పోలీస్ కంప్లైంట్’. వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా విశేషాలు ఇప్పుడు చూద్దాం..
టాలీవుడ్ వెండితెరపై సరికొత్త ప్రయోగాలు, వైవిధ్యమైన కథాంశాలతో వచ్చే చిత్రాలకు ప్రేక్షకులు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఆ కోవలోనే ఇప్పుడు హారర్, థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో కూడిన ఓ ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. అదే ‘పోలీస్ కంప్లైంట్’. ‘ఎంఎస్‌కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్’ బ్యానర్‌పై బాలకృష్ణ మహారాణా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రానికి సంజీవ్ మేగోటి దర్శకత్వం వహించారు. వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్ర పోషించింది. ఈ సినిమా జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్ల వేగాన్ని పెంచింది. తాజాగా హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఈ చిత్ర ట్రైలర్, రెండు ప్రత్యేక గీతాల లాంచ్ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుక సినీ ప్రముఖులు, అభిమానుల సమక్షంలో కోలాహలంగా సాగింది. ఈ వేడుకలో ఒక ప్రత్యేకమైన, భావోద్వేగ భరితమైన ఘట్టం చోటుచేసుకుంది. టాలీవుడ్ లెజెండ్, సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ జయంతిని పురస్కరించుకుని ‘పోలీస్ కంప్లైంట్’ చిత్ర యూనిట్ సభ్యులు వేదికపై కేక్ కట్ చేసి ఆయనకు ఘన నివాళులర్పించారు.
సూపర్ స్టార్ కృష్ణ నటించిన పలు సూపర్ హిట్ చిత్రాల టైటిళ్లను గుర్తు చేస్తూ ఈ సినిమాలో ఒక ప్రత్యేక గీతాన్ని కంపోజ్ చేయడం విశేషం. ఈ పాటను కృష్ణ వీరాభిమానుల చేతుల మీదుగా లాంచ్ చేయించారు. కృష్ణపై ఉన్న అభిమానాన్ని చాటుకునేలా సాగే ఈ పాటలో ఆయన వీరాభిమాని, నటుడు కృష్ణసాయి, నటి ప్రీతి సుందర్ కలిసి డ్యాన్స్ చేసి మెప్పించారు. ఈ గీతానికి దర్శకుడు సంజీవ్ మేగోటి స్వయంగా సాహిత్యం (లిరిక్స్), సంగీతం అందించడం విశేషం.
ఈ చిత్రంలోని “నువ్వుట్టా సూత్తా ఉంటే” అనే మరో మాస్ మసాలా గీతాన్ని తెలంగాణ డీఐజీ రమణారెడ్డి అఫీషియల్‌గా రిలీజ్ చేసి చిత్ర యూనిట్‌కు బెస్ట్ విషెస్ తెలిపారు. ఈ స్పెషల్ మాస్ సాంగ్ లో ప్రముఖ నటి కృతి వర్మ తన గ్లామర్, ఎనర్జిటిక్ స్టెప్పులతో అలరించింది. విడుదలైన రెండు పాటలతో పాటు సినిమా ట్రైలర్ కూడా ప్రేక్షకుల్లో అంచనాలను పెంచుతోంది.
చిత్ర దర్శకుడు సంజీవ్ మేగోటి ఈ సందర్భంగా మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. కృష్ణ గారితో అనుబంధం గురించి చెప్పారు. “గతంలో నాకు సూపర్ స్టార్ కృష్ణ గారితో కలిసి వర్క్ చేసే గొప్ప అవకాశం దక్కింది. నాలుగు పేజీల సుదీర్ఘమైన డైలాగ్‌ను కూడా సింగిల్ టేక్‌లో ఒకే శ్వాసలో చెప్పేయగల మహానటుడు ఆయన. అలాంటి గొప్ప వ్యక్తి బర్త్ డే రోజున మా సినిమా ట్రైలర్ రావడం నాకు గర్వంగా ఉంది.” అని ఎమోషనల్ అయ్యారు.
“ఈ సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా, అత్యున్నత సాంకేతిక విలువులతో నిర్మించాం. పరిశ్రమకు చెందిన దాదాపు 52 మంది సీనియర్ ఆర్టిస్టులతో కేవలం 45 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేయడం ఒక రికార్డు. ‘చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ’ అనే సరికొత్త పాయింట్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఇందులో హారర్, యాక్షన్, కామెడీ, రొమాన్స్ అన్ని సమపాళ్లలో కుదిరాయి. ప్రతి ఒక్కరినీ ఈ చిత్రం థ్రిల్ చేస్తుంది” అని నమ్మకం వ్యక్తం చేశారు.
సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana











