Last Updated:
నటి తేజస్వి మడివాడ కష్టసమయాల ప్రయాణం పంచుకుంది, చిన్న వయస్సులో తల్లి మరణం, తండ్రి మద్యం వ్యసనం, అనాథ శరణాలయం సహాయం, సినిమాలు, Bigg Boss ద్వారా ఎదిగిన కథ తెలిపింది
తెలుగు సినీ పరిశ్రమలో తన అందం, నటన, చలాకీతనంతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటీమణుల్లో తేజస్వి మడివాడ ఒకరు. 1991 జూలై 3న హైదరాబాద్‌లో జన్మించిన తేజస్వి, సినిమాల్లోకి రాకముందు డ్యాన్సర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. చిన్నప్పటి నుంచే నృత్యంపై ఆసక్తి ఉండటంతో పలు కార్యక్రమాల్లో పాల్గొని తన ప్రతిభను చాటుకుంది.
తేజస్వి మొదటగా పలు తెలుగు సినిమాల్లో డ్యాన్సర్‌గా కనిపించింది. అనంతరం నటిగా అవకాశాలు అందిపుచ్చుకుని సినీ రంగంలో అడుగుపెట్టింది. 2013లో విడుదలైన “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” సినిమాలో చిన్న పాత్రతో ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత “హార్ట్ అటాక్”, “ఐస్‌క్రీమ్”, “మళ్లీ మళ్లీ ఇది రాని రోజు”, “కేరింత”, “శ్రీమంతుడు” వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు పొందింది.
సినిమాలతో పాటు టెలివిజన్ రంగంలో కూడా తేజస్వి తన సత్తా చాటింది. ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 2 లో పాల్గొని మరింత పాపులారిటీ సంపాదించింది. ఈ షో ద్వారా ఆమె వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.
అయితే స్క్రీన్‌పై కనిపించే అంత ఆనందంగా తన జీవితం లేదంటూ చిన్నప్పటి నుంచి ఎన్నో చేదు అనుభవాలు ఎదుర్కొందని తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. అయితే ఆమె తల్లిదండ్రులు సాంప్రదాయబద్ధంగా కాకుండా, ఒకరినొకరు ఇష్టపడి ఇల్లు వదిలి వచ్చి వివాహం చేసుకున్నారు. ఆమె తండ్రి పారామిలిటరీ దళాలలో (CISF) పని చేయగా, ఆమె తల్లి చాలా చిన్న వయస్సులోనే, అంటే కేవలం 15-16 సంవత్సరాల వయస్సులోనే గర్భవతి అయిందట.
ఆ తర్వాత ఆమె తల్లికి మూడు సార్లు గర్భస్రావం కావడంతో తేజస్వి నెలలు నిండకుండానేగా జన్మించింది. అయితే, ఆమెకు 6-7 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు తన తల్లికి ‘రొమ్ము క్యాన్సర్’తో చనిపోయింది. 11 ఏళ్ల వయస్సులోనే వంట చేయడం, ఇల్లు శుభ్రం చేయడం వంటి పనులన్నీ తనే చూసుకునేది. భార్య చనిపోయిన బాధలో ఆమె తండ్రి మద్యానికి బానిసయ్యాడు. దానితో ఇంట్లో వాతావరణం చాలా భయానకంగా ఉండేది. ప్రతిరోజూ తండ్రిని చూడాలంటేనే ఆమె భయపడేదట. చిన్నప్పటి నుంచే ఎవరిపైనా ఆధారపడకుండా బతకడం నేర్చుకుంది. 18 ఏళ్లు రాగానే ఇల్లు వదిలి వెళ్ళిపోవాలని అప్పుడే నిర్ణయించుకుంది.
18 ఏళ్లు నిండగానే ఆమె ఇల్లు వదిలి వచ్చేసింది. చదువుకుంటూ డ్యాన్స్ క్లాసులు చెప్తూ డబ్బులు సంపాదించడం ప్రారంభించింది. ఆ సమయంలో ‘వీ కేర్’ (We Care) అనే అనాథ శరణాలయం ఆమెకు రెండున్నర సంవత్సరాల పాటు ఆశ్రయం ఇచ్చి, చదువుకు సాయం చేసింది. ఆ తర్వాత ఆమె డ్యాన్స్ చేస్తూ వారికి ఆ డబ్బును తిరిగి చెల్లించింది.
ఆ తర్వాత అనుకోకుండా ఆమెకు సినిమాల్లో అవకాశం వచ్చింది. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో నటించింది. ఆ తర్వాత సమంతను కలవడం, నటనపై మరింత పట్టు సాధించడం జరిగింది. జీవితం ఆమెకు చాలా చిన్న వయస్సులోనే అన్ని బాధ్యతలను నేర్పించింది. అందుకే, ఇప్పుడు ఆమె చిన్నపిల్లలా సరదాగా ఉంటూ, తన జీవితాన్ని పూర్తిగా ఆస్వాదిస్తోందని చెప్పుకొచ్చింది.
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana













