CM Revanth Reddy: పాలమూరు ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసి రూ. వేల కోట్ల కమీషన్లు కొల్లగొట్టారు: కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి ఫైర్! | తెలంగాణ వార్తలు | ACTPnews

సీఎం రేవంత్ రెడ్డి


Last Updated:

మహబూబ్‌నగర్ జిల్లాలో మీడియా సమావేశంలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను, అబద్ధాలను ఎండగట్టారు.

సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: తెలంగాణ వస్తే పాలమూరు ప్రాజెక్టులు పూర్తవుతాయని ప్రజలంతా భావిస్తే.. గత పదేళ్ల కేసీఆర్ పాలనలో ఆ నమ్మకాన్ని పూర్తిగా వమ్ము చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మహబూబ్‌నగర్ జిల్లాలో మీడియా సమావేశంలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను, అబద్ధాలను ఎండగట్టారు.

లక్షల కోట్లు ఖర్చు పెట్టినా ఎకరాకు నీరివ్వలేదు

గత పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ. 1 లక్ష 81 వేల కోట్లు ఖర్చు పెట్టిందని, అందులో లక్ష కోట్లు కేవలం ఒకే ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు కోసమే తగలేశారని రేవంత్ రెడ్డి విమర్శించారు. అత్యంత కీలకమైన, 90 టీఎంసీల నీటిని అందించే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పక్కనబెట్టారని మండిపడ్డారు. జూరాల, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, కల్వకుర్తి ప్రాజెక్టులతో పాటు పాలమూరు-రంగారెడ్డిని పూర్తి చేసుంటే.. ఈ జిల్లాలో 26 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరొచ్చేదని గుర్తుచేశారు. కానీ కేసీఆర్ పాలమూరు ఎత్తిపోతలపై కేవలం రూ. 27 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, అందులోనూ పంపులు, లిఫ్టుల కోసమే వేల కోట్లు కుమ్మరించి కాంట్రాక్టర్ల బిల్లుల ద్వారా కమీషన్లు కొల్లగొట్టారని ఆరోపించారు. ఒక్క ఎకరాకు నీరు ఇవ్వకుండా ప్రాజెక్టులను ఎక్కడిదక్కడే వదిలేసి వెళ్లారని సీఎం ఆగ్రహం వ్యక్తంచేశారు.

భూసేకరణే చేయకుండా 90 శాతం పూర్తయిందా?

“ఏ ప్రాజెక్టు పూర్తి కావాలన్నా మొట్టమొదట చేయాల్సింది భూసేకరణ. జిల్లాలో ఏ ప్రాజెక్టు తీసుకున్నా అవసరమైన భూసేకరణ జరగలేదు. భూసేకరణ పూర్తి చేయకుండానే ప్రాజెక్టులు పూర్తవుతాయని కేసీఆర్ ఎలా భావించారు? ఆయన ఆలోచన అంతా కమీషన్ల పైనే ఉంది. దీనిపై నాగం జనార్దన్ రెడ్డి ఏండ్లకేండ్లు కొట్లాడారు” అని సీఎం పేర్కొన్నారు. ప్రాజెక్టులు 90 శాతం పూర్తయ్యాయని బీఆర్ఎస్ నేతలు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని, అంచనాల్లో 50 శాతం కూడా ఖర్చు చేయకుండా 90 శాతం పనులు ఎలా పూర్తవుతాయో ఆ సైన్స్, మ్యాథ్స్ తనకు అర్థం కావడం లేదని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. తాను కేసీఆర్‌లా 80 వేల పుస్తకాలు చదవలేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

మేం 30 నెలల్లో చేసింది ఇది

సాగునీటి ప్రాజెక్టుల కోసం పదేళ్లలో కేసీఆర్ చేసిన అప్పు రూ. 84,503 కోట్లు కాగా.. తాము అధికారంలోకి వచ్చిన ఈ 30 నెలల్లో రూ. 52,120 కోట్ల అప్పులు కట్టామని సీఎం వివరించారు. ఈ 30 నెలల్లో కాంట్రాక్టర్లకు కేవలం రూ. 22 వేల కోట్లు మాత్రమే చెల్లించామని, అందులో రూ. 8 వేల కోట్లు ఒక్క పాలమూరు ప్రాజెక్టుల కోసమే ఖర్చు పెట్టామని తెలిపారు. దీన్ని బట్టే పాలమూరుపై తమకున్న చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతుందన్నారు.

బీఆర్ఎస్ పాదయాత్రలపై కౌంటర్

పాలమూరు ప్రాజెక్టులను తాము ఒక కొలిక్కి తెస్తుంటే, బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు రాజకీయ కార్యాచరణతో వస్తున్నారని సీఎం మండిపడ్డారు. “తిన్నది అరిగేలా నడిస్తే వాళ్ళు చేసిన పాపాలు కొన్నైనా పోతాయి. కాశీ వరకు నడవండి.. ఇంకా మంచిది. ప్రజలు ఛీదరించుకుంటారన్న సోయి కూడా లేకుండా వ్యవహరిస్తున్నారు” అని రేవంత్ రెడ్డి ఘాటుగా విమర్శించారు.

యుద్ధప్రాతిపదికన పనులు – రెండేళ్లలో పూర్తి

ఇప్పటికీ ప్రాజెక్టుల కోసం ఇంకా 4 వేల ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉందని, రాబోయే రెండేళ్లలో జిల్లాలో పనులన్నీ పూర్తి చేయాలని తాము కంకణం కట్టుకుని పని చేస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైనా శాంతితో అడుగులు వేస్తున్నామన్నారు. పాలమూరు జిల్లా ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకే తానే స్వయంగా పర్యటిస్తున్నానని, భూసేకరణకు ప్రజలంతా సహకరించాలని కోరారు. “ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ ఈ పనులను పూర్తి చేసుకోలేం. అలా చేయకపోతే చరిత్ర మనల్ని క్షమించదు” అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. జిల్లా ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు తాను సంపూర్ణంగా కట్టుబడి ఉన్నానని.. జిల్లా బీఆర్ఎస్ నేతలు ఏమీ చేయనక్కర్లేదని, రాబోయే రెండేళ్లు నోరు మూసుకుని ఏం మాట్లాడకుండా ఉండడమే వాళ్ళు జిల్లాకు చేసే పెద్ద సాయమని సీఎం హితవు పలికారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports