Last Updated:
సికింద్రాబాద్ పరిధిలోని మొత్తం 21 రహదారులు, 3 బజార్లకు బ్రిటీష్ కాలం నాటి పేర్లను తొలగించాలని బోర్డు నిర్ణయించింది.
Hyderabad: దేశ చరిత్రలోనే ఎంతో విశిష్టమైన స్థానం కలిగి, 200 ఏళ్లకు పైగా సుదీర్ఘ చరిత్ర ఉన్న సికింద్రాబాద్ ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ (ఏఓసీ) సెంటర్ పరిధిలో కంటోన్మెంట్ బోర్డు ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దశాబ్దాలుగా కొనసాగుతున్న వలసవాద గుర్తులను తుడిచివేస్తూ సికింద్రాబాద్ పరిధిలోని మొత్తం 21 రహదారులు, 3 బజార్లకు బ్రిటీష్ కాలం నాటి పేర్లను తొలగించాలని బోర్డు నిర్ణయించింది. వాటి స్థానంలో దేశం కోసం ప్రాణాలర్పించిన భారతీయ అమరవీరులు, త్యాగధనులు, మహనీయుల పేర్లను పెట్టబోతున్నట్లు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సీఈఓ అధికారికంగా ప్రకటించారు. బుధవారం జరిగిన బోర్డు సమావేశంలో ఈ కీలక ముసాయిదాకు ఆమోదం లభించింది.
టిప్పు సుల్తాన్‌ను, ఆ తర్వాతి కాలంలో నెపోలియన్ బోనాపార్టేను ఓడించి ఇంగ్లండ్‌కు రెండుసార్లు ప్రధానమంత్రిగా పనిచేసిన డ్యూక్ ఆఫ్ వెల్లింగ్టన్ జ్ఞాపకార్థం ఉన్న ‘వెల్లింగ్టన్ రోడ్డు’ పేరును ఇకపై మార్చేశారు. కార్గిల్ యుద్ధంలో దేశ రక్షణ కోసం వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన పరమవీరచక్ర గ్రహీత కెప్టెన్ విక్రమ్ బాత్రా పేరును ఈ రోడ్డుకు పెట్టారు. ప్రస్తుతం ఈ మార్గంలో ‘విక్రమ్ బాత్రా మార్గ్’ అనే కొత్త సైన్ బోర్డును కూడా అధికారులు ఏర్పాటు చేశారు. బ్రిటీష్ పాలకుడి స్థానంలో భారతీయ అమరవీరుడి పేరు పెట్టడంపై స్థానికులు ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కొన్నేళ్ల క్రితం గల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన తెలంగాణ గర్వకారణం, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన కల్నల్ బిక్కుమళ్ల సంతోష్ బాబు పేరును కంటోన్మెంట్‌లోని ప్రముఖ ‘బర్టన్ రోడ్డు’కు పెట్టారు.
చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ నామకరణాల ప్రక్రియకు కంటోన్మెంట్ బోర్డు ఎట్టకేలకు ఆమోదం తెలపడం ద్వారా బ్రిటీష్ వలసపాలన ఆనవాళ్లకు ముగింపు పలికినట్లయిందని రక్షణ శాఖ వర్గాలు భావిస్తున్నాయి. దేశాన్ని రక్షించిన అమరవీరులకు మరియు జాతీయ నాయకులకు దక్కిన నిజమైన గౌరవం ఇదంటూ సామాజిక మాధ్యమాల (సోషల్ మీడియా) వేదికగా నెటిజన్లు కంటోన్మెంట్ బోర్డు నిర్ణయాన్ని విపరీతంగా అభినందిస్తున్నారు.
Hyderabad,Telangana













