భారత్ ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన, పురోగతి చెందిన నాగరికతగా విలసిల్లిందని చంద్రబాబు గుర్తుచేశారు. అయితే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత చాలా దశాబ్దాల పాటు దేశం తన సొంత గుర్తింపు, ప్రపంచ పాత్ర విషయంలో స్పష్టత లేక వెనుకబడిందని అభిప్రాయపడ్డారు. మోదీ నాయకత్వం దేశంలో సాంస్కృతిక గర్వాన్ని, జాతీయ ఆత్మవిశ్వాసాన్ని మళ్లీ మేల్కొలిపిందన్నారు.
నేడు ప్రపంచ దేశాల ముందు భారత్ సమానత్వ హోదాలో నిలబడి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని చెప్పారు. యోగా, ప్రాణాయామం, ధ్యానం లాంటి ప్రాచీన సంప్రదాయాలను ఆధునిక సాంకేతికతతో, డిజిటల్ పరిపాలనతో మోదీ ప్రభుత్వం అనుసంధానించిందని కొనియాడారు. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు రావడం దీనికి ఒక చక్కని ఉదాహరణ అని పేర్కొన్నారు.
గడిచిన పదేళ్లలో భారతదేశం ప్రపంచంలోనే 11వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ నుండి 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడం వెనుక మోదీ పట్టుదల, సమర్థవంతమైన అమలు తీరు ఉన్నాయని చంద్రబాబు విశ్లేషించారు. డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, జన్ ధన్ ఖాతాలు, ఆధార్ అనుసంధానం, యూపీఐ, ప్రత్యక్ష నగదు బదిలీ (DBT) వంటివి చరిత్రలోనే అతిపెద్ద ఆర్థిక విప్లవానికి దారితీశాయని చెప్పారు. దళారుల బెడద లేకుండా దాదాపు 51 లక్షల కోట్ల రూపాయలు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి చేరాయని వెల్లడించారు. దేశంలో డిజిటల్ విభజనను తొలగించడం ద్వారానే ఆర్థిక అసమానతలను భారత్ అధిగమించగలిగిందని స్పష్టం చేశారు.
మోదీ హయాంలో దేశంలో భారీ సామాజిక మార్పు చోటుచేసుకుందని, కోట్ల మంది ప్రజలు బహుమితీయ పేదరికం నుండి బయటపడ్డారని ముఖ్యమంత్రి వివరించారు. ఇళ్లు, పరిశుభ్రత, ఆరోగ్య సంరక్షణ, తాగునీరు, గ్రామీణ మౌలిక వసతుల కల్పనతో ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయన్నారు. ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్’ అనే సూత్రంతోనే ఈ పురోగతి సాధ్యమైందని చెప్పారు. కరోనా మహమ్మారి, అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి వంటి సవాళ్లు ఎదురైనప్పటికీ భారత్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని గుర్తుచేశారు. జాతీయ రహదారులు, ఓడరేవులు, విమానాశ్రయాలు, రైల్వేలు, పునరుత్పాదక ఇంధనం, సెమీకండక్టర్ల తయారీ రంగాల్లో పెట్టుబడులు తక్షణ రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా దీర్ఘకాలిక దేశ నిర్మాణం కోసం చేసినవని కొనియాడారు.
కేంద్ర, రాష్ట్రాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడంలో మోదీ ప్రభుత్వం వినూత్న మార్పులు తెచ్చిందని చంద్రబాబు పేర్కొన్నారు. పోటీతత్వ, సహకార సమాఖ్య స్ఫూర్తి వల్ల రాష్ట్రాలు తమకు నచ్చిన రంగాల్లో వృద్ధి చెందడానికి అవసరమైన స్వేచ్ఛ లభించిందన్నారు. రాష్ట్రాలను కేవలం పరిపాలనా విభాగాలుగా కాకుండా దేశ ప్రగతికి ప్రధాన ఇంజిన్లుగా గుర్తిస్తున్నారని చెప్పారు. ఈ అభివృద్ధి భాగస్వామ్యం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాజధాని నిర్మాణం, పారిశ్రామికీకరణ, మౌలిక వసతులు, ఆధునిక సాంకేతిక రంగాలలో గొప్ప లబ్ధి చేకూరుతోందని వివరించారు.
సరైన సమయంలో దేశానికి మోదీ సరైన నాయకుడిగా వచ్చారనే తన నమ్మకం 12 ఏళ్ల పాలన తర్వాత మరింత బలపడిందని చంద్రబాబు వ్యాసంలో పునరుద్ఘాటించారు. చరిత్ర ఈ కాలాన్ని కేవలం ఆర్థిక వృద్ధి, రాజకీయ స్థిరత్వం కోసమే కాకుండా భారతీయులలో ఆత్మవిశ్వాసాన్ని పునరుద్ధరించినందుకు గుర్తుపెట్టుకుంటుందని అన్నారు. ఇది భారతదేశ చారిత్రక తరుణమని, దేశంలో ఒక స్వర్ణయుగం ప్రారంభమైందని ఆకాంక్షించారు. ఈ బలమైన పునాదితో 2047 నాటికి భారతదేశం ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని తప్పక చేరుకుంటుందని చంద్రబాబు నాయుడు పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు.












