Last Updated:
ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSFTVTDC) నూతన చైర్మన్ పి. భరత్ భూషణ్ తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSFTVTDC) నూతన చైర్మన్ పి. భరత్ భూషణ్ తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ముఖ్యమంత్రితో ఆయనకు ఇదే తొలి భేటీ. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన ఆయన, రాష్ట్రంలో సినిమా, టెలివిజన్, రంగస్థల కళల అభివృద్ధిపై పలు కీలక విషయాలను చర్చించారు.
కేంద్ర ప్రభుత్వం చేత గుర్తింపు పొందిన ‘ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (FFI)’ కు తాను వైస్ ప్రెసిడెంట్ గా కూడా వ్యవహరిస్తున్నానని, ఆ జాతీయ స్థాయి అనుభవంతో ఏపీకి ప్రత్యేక గుర్తింపు తెచ్చేలా కృషి చేస్తానని సీఎంకు వివరించారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ను సినీ పరిశ్రమకు అనుకూలమైన ప్రధాన గమ్యస్థానంగా మార్చే దిశగా తన బృందంతో కలిసి పకడ్బందీగా అడుగులు వేస్తానని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్రంలో స్టూడియోల నిర్మాణం, సింగిల్ విండో విధానం ద్వారా షూటింగ్ల అనుమతులు సులభతరం చేయడం, సినీ కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం వంటి అంశాలపై కార్పొరేషన్ అహర్నిశలు పనిచేస్తుందన్నారు.
సీఎంతో భేటీ అనంతరం భరత్ భూషణ్ మీడియాతో మాట్లాడుతూ నటసింహం నందమూరి బాలకృష్ణ 112వ చిత్రం (#NBK112) గురించి సంతోషం వ్యక్తం చేశారు. బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రారంభోత్సవం అమరావతి పరిధిలోని వెంకటపాలెం టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో జరగనుండటం ఎంతో ఆనందదాయకం అన్నారు. రాజధాని ప్రాంతంలో ఇలాంటి ఒక భారీ ప్రాజెక్టు ప్రారంభం కావడం సినీ పరిశ్రమ ఏపీ వైపు చూసేలా చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ అత్యంత వైభవంగా జరగనున్న సినీ ముహూర్తపు కార్యక్రమానికి రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి గౌరవ నారా లోకేష్, అలాగే పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి గౌరవ కందుల దుర్గేష్ ముఖ్య అతిథులుగా హాజరు కావడం విశేషమన్నారు. మంత్రుల రాకతో ఈ ఈవెంట్ కు మరింత వన్నె రానుందని ఆయన అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి భారీ చిత్రాల ప్రారంభోత్సవాలు, షూటింగ్లు, సినిమా వేడుకలు మరెన్నో జరిగేలా, పరిశ్రమకు సానుకూల వాతావరణం కల్పించేలా తమ టీం అంతా సమిష్టిగా కృషి చేస్తుందని భరత్ భూషణ్ స్పష్టం చేశారు.
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana













