క్రిస్టోఫర్ లక్సన్ ప్రకారం, భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి. న్యూజిలాండ్ ఆర్థికాభివృద్ధికి భారత్ కీలక భాగస్వామిగా మారుతోందని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో 2026 ఏప్రిల్‌లో కుదిరిన న్యూజిలాండ్–భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (Free Trade Agreement-FTA) రెండు దేశాల సంబంధాలను కొత్త స్థాయికి తీసుకెళ్తుందని తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా న్యూజిలాండ్‌లో ఉద్యోగాల కల్పన, ఎగుమతుల పెరుగుదల, ఆర్థికాభివృద్ధికి ఊతం లభిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
ప్రధాని మోదీ జూలై 10న ఆక్లాండ్‌కు చేరుకోనుండగా, మరుసటి రోజు పర్యటన ముగించుకుని తిరిగి భారత్‌కు బయలుదేరనున్నారు. ఈ పర్యటనలో ఇరు దేశాల నేతలు వాణిజ్యం, పెట్టుబడులు, సముద్ర భద్రత, విద్య, సాంకేతికత, పర్యాటకం, క్రీడలు, అంతర్జాతీయ అంశాలతో పాటు పలు కీలక రంగాల్లో సహకారాన్ని విస్తరించే అంశాలపై చర్చించనున్నారు.
ఈ పర్యటన రెండు దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలపరుస్తుందని లక్సన్ పేర్కొన్నారు. న్యూజిలాండ్-భారత్ భాగస్వామ్యం ఇరు దేశాల ప్రజలకు ఆర్థికాభివృద్ధి, భద్రత, కొత్త అవకాశాలను అందిస్తుందని, ప్రధాని మోదీకి స్వాగతం పలకడం ఆనందంగా ఉందని ఆయన వెల్లడించారు.
స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమలులోకి రావడం ద్వారా 140 కోట్ల జనాభా కలిగిన భారత మార్కెట్లో న్యూజిలాండ్ వస్తువులు, సేవలకు విస్తృత అవకాశాలు లభిస్తాయని లక్సన్ తెలిపారు. దీంతో ఎగుమతులు పెరిగి, స్థానిక పరిశ్రమలకు ఆదాయం, ఉపాధి అవకాశాలు, వేతనాల పెరుగుదలకు దోహదం చేస్తుందని చెప్పారు. మరోవైపు, భారత్‌కు అధిక ఆదాయం కలిగిన పసిఫిక్ మార్కెట్లో మరింత బలమైన ప్రవేశం లభిస్తుందని, ఇండో-పసిఫిక్ ఆర్థిక వ్యూహానికి ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు కూడా క్రమంగా విస్తరిస్తున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ద్వైపాక్షిక వస్తు వాణిజ్యం 1.3 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకోగా, 2024లో వస్తువులు, సేవల కలిపిన మొత్తం వాణిజ్యం సుమారు 2.4 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇందులో ప్రయాణ సేవలు, సమాచార సాంకేతికత (IT), వ్యాపార సేవల ఆధారంగా సేవల రంగం ఒక్కటే 1.24 బిలియన్ డాలర్ల విలువ సాధించింది.
ఈ పర్యటనకు ముందు ప్రధాని మోదీ జూన్ 29న ముగిసిన మూడు రోజుల సీషెల్స్ పర్యటనలో పాల్గొన్నారు. ఆ పర్యటనలో భారతదేశం-సీషెల్స్ మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని విస్తరించడం, హిందూ మహాసముద్ర ప్రాంతంలో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. పర్యటన అనంతరం ఎక్స్‌లో స్పందించిన మోదీ, సీషెల్స్ పర్యటన ద్వారా రెండు దేశాల స్నేహబంధం మరింత బలపడేలా కీలక నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. గత 50 ఏళ్లుగా విశ్వాసం, పరస్పర అభివృద్ధితో కొనసాగుతున్న భారత్-సీషెల్స్ సంబంధాలు, రాబోయే 50 ఏళ్లలో ఆవిష్కరణలు, సుస్థిర అభివృద్ధి, ఉమ్మడి శ్రేయస్సు దిశగా ముందుకు సాగుతాయని పేర్కొన్నారు.
2026 ఏప్రిల్‌లో కుదిరిన న్యూజిలాండ్-భారత్ ఎఫ్‌టీఏ వాణిజ్యం, పెట్టుబడులు, ప్రజల మధ్య సంబంధాలను మరింత విస్తరించే కీలక ఒప్పందంగా భావిస్తున్నారు. ఇందులో మార్కెట్ యాక్సెస్, వ్యవసాయ ఉత్పాదకత, పెట్టుబడులు, నైపుణ్యాల మార్పిడి, క్రీడలు, పర్యాటకం, విద్యా రంగాల్లో సహకారానికి అవకాశం కల్పించారు. ఈ ఒప్పందం తయారీ రంగం, రైతులు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (MSMEs), మహిళా పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు, నైపుణ్యం కలిగిన ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుస్తుందని అంచనా వేస్తున్నారు.
ఇదిలా ఉండగా, న్యూజిలాండ్ వాణిజ్య, పెట్టుబడుల మంత్రి టాడ్ మెక్‌క్లే (Todd McClay) కూడా గతంలో ఈ ఎఫ్టీఏతో ద్వైపాక్షిక వాణిజ్యం మరింత పెరుగుతుందని తెలిపారు. భారత మార్కెట్ ద్వారా నాణ్యమైన వస్తువులు, సేవలు న్యూజిలాండ్ వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు. అలాగే, వచ్చే 15 ఏళ్లలో భారత్‌లో 20 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో న్యూజిలాండ్ ప్రభుత్వం పనిచేస్తోంది. దీనికి మద్దతుగా పెట్టుబడి అనుమతులను వేగవంతం చేసేందుకు ప్రత్యేక “సింగిల్ డెస్క్” వ్యవస్థను ఏర్పాటు చేయడానికి భారత ప్రభుత్వం అంగీకరించింది.












