Tirumala: తప్పిపోయిన 9 ఏళ్ల చిన్నారి.. కేవలం 2 గంటల్లో గుర్తించిన తిరుమల పోలీసులు..! Missing Child Tirumala. | | ACTPnews

News18


Last Updated:

తిరుమలలో తప్పిపోయిన 9 ఏళ్ల అనుషాను పోలీసులు 2 గంటల్లో గుర్తించి కుటుంబానికి అప్పగించారు. తిరుపతి ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు పోలీసులను అభినందించారు.

News18
News18

శ్రీవారి దర్శనానికి వచ్చిన ఓ కుటుంబానికి కాసేపు తీవ్ర ఆందోళన కలిగించిన ఘటన తిరుమలలో చోటుచేసుకుంది. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం కిష్టారం గ్రామానికి చెందిన నరసింహులు, లడ్డమ్మ దంపతులు తమ తొమ్మిదేళ్ల కుమార్తె అనుషామితో కలిసి తిరుమలకు వచ్చి వెంకటాద్రి నిలయం (PAC-5)లో బస చేశారు. అయితే శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల నుంచి 2.30 గంటల మధ్య చిన్నారి కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. వెంటనే తిరుమల పోలీసులకు సమాచారం అందించారు.

ఫిర్యాదు అందుకున్న వెంటనే తిరుమల డీఎస్పీ పర్యవేక్షణలో పోలీసులు అప్రమత్తమయ్యారు. కమాండ్ కంట్రోల్ సెంటర్, ట్రాఫిక్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ సిబ్బంది, బీట్ పోలీసులు, టీటీడీ విజిలెన్స్ సిబ్బంది సమన్వయంతో ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టారు. తిరుమలలోని పలు ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ చిన్నారి కోసం విస్తృతంగా గాలించారు.

పోలీసుల వేగవంతమైన చర్యలు ఫలించాయి. సమాచారం అందిన కేవలం రెండు గంటల్లోపే చిన్నారిని సురక్షితంగా గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కుమార్తె క్షేమంగా తిరిగి రావడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. తమ బిడ్డను సురక్షితంగా గుర్తించి అప్పగించిన తిరుమల పోలీసులకు, టీటీడీ విజిలెన్స్ సిబ్బందికి వారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ అభినందించారు.

ఈ ఘటనపై స్పందించిన తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఐపీఎస్, గాలింపు చర్యల్లో సమర్థవంతంగా పనిచేసిన తిరుమల పోలీసులు, ట్రాఫిక్ విభాగం, కమాండ్ కంట్రోల్ సెంటర్, టీటీడీ విజిలెన్స్ అధికారులను అభినందించారు. భక్తుల భద్రత విషయంలో అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయడం వల్లే చిన్నారిని తక్కువ సమయంలో గుర్తించగలిగామని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా భక్తులకు ఎస్పీ కీలక సూచనలు చేశారు. చిన్నపిల్లలు, వృద్ధులు, మానసిక పరిస్థితి సరిగా లేని వ్యక్తులతో తిరుమలకు వచ్చే భక్తులు వారి పేరు, చిరునామా, కుటుంబ సభ్యుల మొబైల్ నంబర్లు ఉన్న గుర్తింపు కార్డులు లేదా చీటీలు వెంట ఉంచాలని సూచించారు. రద్దీ ప్రాంతాల్లో చిన్నారులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒంటరిగా వదిలివేయొద్దని, ఎవరైనా తప్పిపోయిన వెంటనే సమీప పోలీసు సిబ్బందికి సమాచారం ఇవ్వాలని లేదా అత్యవసర సేవల కోసం డయల్ 112కు ఫోన్ చేయాలని విజ్ఞప్తి చేశారు. భక్తుల భద్రత కోసం తిరుమల పోలీసులు, టీటీడీ విజిలెన్స్ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారని, భక్తులు కూడా తగిన జాగ్రత్తలు పాటిస్తే ఇలాంటి ఘటనలను నివారించవచ్చని ఎస్పీ తెలిపారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports