2024 సంవత్సరంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ద్వారా సర్టిఫికేట్ పొందిన చిత్రాలకు సంబంధించి ఇవ్వనున్న 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతలను జూలై 3న ప్రకటించాలని ముందుగా నిర్ణయించారు. కానీ తాజా సమాచారం ప్రకారం, ఈ ప్రకటనను ఈ నెలాఖరుకు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. అయితే, ఖచ్చితమైన తేదీని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా అవార్డుల ఫలితాలను కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ తమ అధికారిక యూట్యూబ్, ఎక్స్ (ట్విట్టర్) వేదికల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఈ అవార్డుల ప్రకటనను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం ఉంటుంది.
భారతీయ సినిమాకు సంబంధించిన అత్యుత్తమ చిత్రాలు, నటన, దర్శకత్వం, సాంకేతిక నైపుణ్యాలను గుర్తించి సత్కరించే ఈ అవార్డులకు ఈసారి ఎంపిక ప్రక్రియను ప్రముఖ దర్శకుడు జయరాజ్ నేతృత్వంలోని 11 మంది సభ్యులతో కూడిన జ్యూరీ నిర్వహించింది. జయరాజ్ ఇప్పటికే 2012లో కూడా జాతీయ అవార్డుల జ్యూరీ సభ్యుడిగా పనిచేశారు.
జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రత్యేకత ఏమిటంటే, అవార్డుల నామినేషన్లను ముందుగానే ప్రకటించరు. అయితే, విమర్శకుల ప్రశంసలు, బాక్సాఫీస్ విజయాల ఆధారంగా పలు భాషల చిత్రాలు బలమైన పోటీదారులుగా నిలిచాయి.
ఈసారి కూడా మలయాళ సినిమా తన ఆధిపత్యాన్ని కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ‘బ్రమయుగం’, ‘మంజుమ్మెల్ బాయ్స్’, ‘కిష్కింధ కాండం’ చిత్రాలు జాతీయ స్థాయిలో భారీ చర్చకు దారితీశాయి. ఈ సినిమాలు పలు విభాగాల్లో అవార్డులు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇక హిందీ చిత్ర పరిశ్రమ నుంచి ‘ఆర్టికల్ 370’, ‘శ్రీకాంత్’, ‘చందు ఛాంపియన్’ చిత్రాలు బలమైన పోటీదారులుగా నిలిచాయి. అదే విధంగా తమిళ చిత్ర పరిశ్రమ నుంచి ‘మహారాజా’, ‘మేయళగన్’, ‘అమరన్’ చిత్రాలు కూడా జాతీయ అవార్డుల రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
తెలుగు సినీ అభిమానులకు అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, టాలీవుడ్ నుంచి ‘కల్కి 2898 ఏడీ’, ‘లక్కీ భాస్కర్’, ‘దేవర: పార్ట్ 1’, పుష్ప-2 చిత్రాలు జాతీయ అవార్డుల పోటీలో ప్రధానంగా నిలిచాయి. ఈ చిత్రాల్లోని నటన, సాంకేతిక విలువలు, కథా ప్రదర్శన జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు పొందాయి.
మరోవైపు ఉత్తమ నటుడు, ఉత్తమ నటి విభాగాల్లో పోటీ తీవ్రంగా ఉండనుంది. ముఖ్యంగా మమ్ముట్టి, శివకార్తికేయన్, విజయ్ సేతుపతి, కార్తీ, సాయి పల్లవి వంటి ప్రముఖ నటీనటుల పేర్లు ఈసారి జాతీయ అవార్డుల ప్రధాన పోటీదారులుగా వినిపిస్తున్నాయి.
అయితే, జాతీయ అవార్డుల ఫలితాలు వాయిదా పడటంతో సినీ అభిమానుల్లో కొంత నిరాశ నెలకొంది. అయినప్పటికీ, ఈ నెలలోనే ఫలితాలు ప్రకటించనున్నట్లు సమాచారం రావడంతో అందరి చూపు ఇప్పుడు అధికారిక ప్రకటనపై నిలిచింది. ఈసారి జాతీయ అవార్డులను ఏ చిత్రాలు, ఏ నటీనటులు సొంతం చేసుకుంటారో చూడాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.












