Last Updated:
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చివరి చిత్రం ‘జన నాయగన్’ విడుదలపై మరోసారి ఆసక్తికర చర్చ మొదలైంది. సెన్సార్ ప్రక్రియ దాదాపు పూర్తవడంతో జూలై 24న సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి, స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం పూర్తిగా రాజకీయాలపైనే దృష్టి సారించారు. నటుడిగా తన సినీ ప్రయాణానికి ముగింపు పలుకుతూ ఆయన నటించిన చివరి చిత్రం ‘జన నాయకన్’ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొదట ఈ సినిమాను 2026 జనవరిలో విడుదల చేయాలని చిత్రబృందం భావించినప్పటికీ, సెన్సార్ ప్రక్రియలో జాప్యం కారణంగా విడుదల వాయిదా పడింది. అయితే ఇప్పుడు ఈ సినిమా విడుదల తేదీపై మరోసారి ఆసక్తికరమైన ప్రచారం మొదలైంది.
తాజా సమాచారం ప్రకారం, ‘జన నాయగన్’ జూలై 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చుతూ కెనడాకు చెందిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ యార్క్ సినిమాస్ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచింది.
జూలై 8న ట్విటర్లో యార్క్ సినిమాస్ చేసిన పోస్టులో, “మన తలపతి విజయ్ ‘జన నాయకన్’తో మరోసారి పెద్ద తెరను షేక్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కెనడాలో యార్క్ సినిమాస్ ద్వారా జూలై 24 నుంచి సినిమా విడుదల కానుంది. టికెట్ బుకింగ్స్ కోసం సిద్ధంగా ఉండండి” అని పేర్కొంది. ఈ పోస్టు క్షణాల్లో వైరల్ కావడంతో అభిమానులు సినిమా విడుదల తేదీ ఖరారైందంటూ సంబరాలు చేసుకుంటున్నారు.
ఇదిలా ఉంటే, ఈ సినిమా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) సూచించిన మార్పులను చిత్రబృందం పూర్తిగా పూర్తి చేసినట్లు సమాచారం. ప్రస్తుతం సెన్సార్ సర్టిఫికేట్ జారీ ప్రక్రియ చివరి దశలో ఉందని, శుక్రవారం నాటికి సర్టిఫికేట్ లభించే అవకాశముందని సినీ వర్గాలు చెబుతున్నాయి. సర్టిఫికేషన్ పూర్తైన వెంటనే అధికారిక విడుదల తేదీని మేకర్స్ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
అలాగే విదేశీ డిస్ట్రిబ్యూటర్లకు జూలై 24 విడుదలకు సిద్ధంగా ఉండాలని సమాచారం అందినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే కొన్ని నివేదికల ప్రకారం, పంపిణీ ప్రణాళికలను బట్టి సినిమా జూలై 23న కూడా విడుదల కావచ్చని అంటున్నారు. అయినప్పటికీ ఈ విషయంపై నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రం రాజకీయ నేపథ్యంలో యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోంది. ఇందులో విజయ్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, ప్రకాశ్ రాజ్, మమిత బైజు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన టైటిల్ పోస్టర్, ఫస్ట్ లుక్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచాయి. ముఖ్యంగా ఇది విజయ్ నటిస్తున్న చివరి సినిమా కావడంతో అభిమానులు దీనిని ప్రత్యేకంగా భావిస్తున్నారు. రాజకీయాల్లోకి పూర్తిస్థాయిలో అడుగుపెట్టే ముందు విజయ్ అభిమానులకు అందించే చివరి కానుకగా ‘జన నాయకన్’ నిలవనుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana













