Last Updated:
ఖర్జూరా సాగును తెలంగాణలో పండించొచ్చా? ఎంత ఖర్చు వస్తుంది? మార్కెటింగ్ ఎలా చేయాలి? పూర్తి వివరాలు తెలుసుకోండి.
ఎడారి ప్రాంతాల్లో పండే ఖర్జూరాన్ని మన నేలలపై పండించడం సాధ్యమేనా? ఈ ప్రశ్న అడిగితే చాలామంది ‘అసాధ్యం’ అనే సమాధానం ఇస్తారు. కానీ, ఓ రైతు తన సంకల్పంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. తెలంగాణ గడ్డపై ఖర్జూరాన్ని విజయవంతంగా పండిస్తున్నారు. ఎవరూ ఊహించని విధంగా ఖర్జూరం సాగు చేస్తున్నారు.ఆ రైతు పేరు అన్నే సత్యనారాయణ. హైదరాబాద్లో ఉంటారు. ఆయన ఖర్జూరాని ఎలా పండిస్తున్నారు? కష్టనష్టాలు ఏంటి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. న్యూస్18 ప్రతినిధి మస్తాన్ వలీతో ఫోన్ కాల్లో సత్యనారాయణ ఖర్జూరా సాగుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.
రామాయంపేట సమీపంలో సత్యనారాయణకు 13 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఎవరూ సాహసించని విధంగా ఆ పొలంలో ఖర్జూరం సాగు చేయాలని ఆయన నిర్ణయించుకున్నాడు. 2019లో లండన్ నుంచి కార్గో విమానంలో 280 టిష్యూ కల్చర్ మొక్కలను దిగుమతి చేసుకున్నాడు. ఒక్కో మొక్కకు రూ.5 వేలు ఖర్చు చేశాడు. సరైన నిపుణుల సలహాలు లేకపోవడంతో తొలి ఏడాది 40 మొక్కలు చనిపోయాయి. అయినా ఆయన వెనక్కి తగ్గలేదు. పట్టుదలతో సాగు కొనసాగించగా, 2022 నాటికి మొక్కలు పూతకు వచ్చాయి. తొలి దిగుబడి ఆయనలో కొండంత ఆత్మవిశ్వాసాన్ని నింపింది. దీంతో 2023లో ఇరాన్ నుంచి మరో 800 మొక్కలను తెప్పించాడు. ప్రస్తుతం ఆయన పొలంలో వెయ్యికి పైగా ఎలైట్, బర్హీ రకాల ఖర్జూర చెట్లు ఉన్నాయి. మొత్తంగా 1,000 చెట్లను కలిగి ఉన్నారు.

సాధారణంగా ఈ పంట చేతికి రావడానికి ఐదేళ్లు పడుతుంది. సత్యనారాయణ కేవలం మొక్కల కోసమే రూ.50 లక్షల పెట్టుబడి పెట్టాడు. తర్వాత నాటు,పర్యవేక్షణ కోసం ఇంకో రూ.50 లక్షలు ఖర్చు అయ్యింది. ఐదేళ్ల నిరీక్షణ తర్వాత ఈ ఏడాది భారీ స్థాయిలో దిగుబడి ఆశిస్తున్నాడు. ఇప్పటికి కేవలం 5 టన్నుల ఖర్జూరాలు వచ్చాయి. వీటిని మార్కెట్లో విక్రయిస్తే రూ.8 లక్షల దాకా వచ్చింది. అయితే ఈసారి చెట్టుకు 100 కేజీల ఖర్జూరా రావొచ్చని అంచనా వేశారు. అంటే ఏకంగా రూ.1.5 కోట్ల నుంచి రూ.2 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నాడు. హైదరాబాద్లో ఈ పండ్లకు భారీ డిమాండ్ ఉండటంతో పలు మార్ట్ల నిర్వాహకులు కాంట్రాక్ట్ కోసం ఆయనను సంప్రదిస్తున్నారు. ఈ పంట ప్రత్యేకత ఏమిటంటే, ఒక్కసారి నాటితే 80 ఏళ్ల పాటు నిరంతరంగా ఫలాలు ఇస్తూనే ఉంటుంది. చెట్టు వయసు పెరిగేకొద్దీ దిగుబడి కూడా పెరుగుతూనే ఉంటుంది.

దక్షిణ భారతదేశ నేలలకు, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి ‘బర్హీ’ రకం ఖర్జూరం అద్భుతంగా సరిపోతుందని సత్యనారాయణ చెబుతున్నాడు. రాజస్థాన్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో పండే ఖర్జూరం కన్నా మన దగ్గర పండేవి ఎంతో తీయగా ఉంటాయని స్పష్టం చేశాడు. వరితో పోలిస్తే ఇది అత్యుత్తమ ప్రత్యామ్నాయ పంట. ఒక ఎకరం వరికి వాడే నీటితో పది ఎకరాల ఖర్జూరాన్ని సాగు చేయవచ్చని ఆయన వివరించాడు.

వడగళ్ల వానలు, కరువు పరిస్థితులను కూడా ఈ మొక్కలు సమర్థవంతంగా తట్టుకుంటాయి. అయితే ఖర్జూర సాగు అనేది చిన్న రైతులకు కాకుండా ఎక్కువ పొలం ఉన్న రైతులకు సరిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎందుకంటే వీటి పర్యవేక్షణ అనేది చాలా కష్టంగా ఉంటుంది. అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే సాగు చేయాలనే నిర్ణయానికి రావాలి. లేదంటే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.
ప్రస్తుతం ఒక్కో మొక్క ధర రూ 5,000 వరకు పడుతోంది. ఇంతటి అద్భుతమైన, లాభదాయకమైన పంట సాగుకు ముందుకు వచ్చే రైతులకు ప్రభుత్వం 50 శాతం సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహించాలని ఆయన కోరుతున్నాడు. సత్యనారాయణ సాధించిన విజయానికి గుర్తింపుగా, ఉద్యానవన శాఖ ఇతర రైతులను ఆయన పొలానికి తీసుకెళ్లి ప్రత్యేక అవగాహన కల్పిస్తోంది. ఎడారి పంటను తెలంగాణలో పండించి లాభాలు గడిస్తున్న ఈ రైతు కృషి నిజంగా ఎందరికో ఆదర్శం.
Hyderabad,Telangana














