Mega Fan Last Wish: మెగా బ్రదర్స్ కోసం జీవితాన్ని త్యాగం చేసిన వీరాభిమాని.. ఇప్పుడెలా ఉన్నాడో..? ఏం కోరుతున్నాడో చూడండి | ట్రెండింగ్ | ACTPnews

Mega


Last Updated:

Mega Fan Last Wish: నాడు అన్నయ్య చిరంజీవిపెళ్లి త్యాగం చేశాడు. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కల్యాణ్‌ రాక కోసం చివరి క్షణం వరకు ఎదురుచూస్తున్నాడు. ప్రజారాజ్యం, జనసేన కోసం అవిశ్రాంతంగా పని చేసిన వీరాభిమాని పరిస్థితి ఎలా ఉందో చూడండి.

+

Mega Fan Last Wish

Mega Fans Last Wish: గుండెలో అభిమానం ఉంటే తమకు నచ్చిన వాళ్ల కోసం ఏమైనా చేయడానికి రెడీగా ఉంటారు కొందరు ఫ్యాన్స్. అదే సినిమా హీరోలకు అయితే వేరే చెప్పనక్కర్లేదు. అది కూడా మెగా హీరోల అభిమాని అయితే వేరే లెవెల్ ఉంటుంది వాళ్ల అభిమానం. అయితే నాడు అన్నయ్య చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెడితే జెండా మోసిన ఓ అభిమాని ఆయన సీఎం అయ్యే వరకు పెళ్లి చేసుకోనని కంకణం కట్టుకున్నాడు. అంతే కాదు ప్రస్తుతం జనసేన పార్టీ గుర్తుతో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కల్యాణ్‌ని ఆ పదవిలో చూసేందుకు జనసైనికుడిగా రెట్టింపు ఉత్సాహంతో పని చేశాడు ఓ అభిమాని. సీన్ కట్ చేస్తే ప్రస్తుతం అతను ఏం చేస్తున్నాడో..? అతని పరిస్థితి ఎలా ఉందో..? తన అభిమాన నటుడి నుంచి ఈ చిరు అభిమాని ఆశిస్తున్నది ఏంటో తెలియాలంటే కాకినాడ జిల్లాకు చెందిన ఠాగూర్ స్టోరీ పూర్తిగా చూడాల్సిందే.

ఫ్యాన్స్ ఇలా కూడా ఉంటారా..

కాకినాడ జిల్లాకు చెందిన ఠాగూర్ అనే ఓ జనసైనికుడు మెగా కుటుంబానికి కరుడుగట్టిన అభిమాని. కుల, మతాలకు అతీతంగా చిరంజీవి సీఎం అయితే చాలు, పవన్ కళ్యాణ్ ఉన్నత స్థానంలో ఉంటే చాలు అని ఆశపడిన నిస్వార్ధ అభిమాని ఠాగూర్. నాడు చిరంజీవి రక్తదాన కేంద్రం ప్రారంభించిన నాటి నుండి ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన సమయంలో ఎంతో సేవ చేశాడు, ఎన్నో సార్లు రక్తదానం చేశాడు. జిల్లాలోని కొలిమేరు గ్రామానికి చెందిన ఠాగూర్‌కి మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కల్యాణ్ అంటే ఎంత అభిమానమూ మాటల్లో వర్ణించలేనిది. నాడు ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన టైమ్‌లో చిరు సీఎం అయ్యే వరకు తాను పెళ్లి చేసుకోనని ప్రకటించి దానికే కట్టుబడి బ్రహ్మచారిగా మిగిలిపోయాడు అంటే ఠాగూర్‌కి చిరంజీవి అంటే ఎంత అభిమానమో అర్దం చేసుకోవచ్చు.

ఠాగూర్ అంటే ఇతనే..

చిరంజీవి మాత్రమే కాదు ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ అంటే కూడా అంతే అభిమానం. అందుకే పవన్ కల్యాణ్ జనసేన పార్టీ పెట్టడంతో నూతన ఉత్సాహంతో మా అన్నయ్య తమ్ముడిని రాజకీయాల్లోకి పంపాడని సంబరపడిపోయి జనసేన కోసం విస్తృతంగా పని చేశాడు. వార్డు మెంబర్ నుండి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్ధుల వరకు జనసేన నేతల్ని గెలిపించడానికి , భారీ మెజార్టీ రావడానికి తన వంతు సాయం చేశాడు ఈ వీరాభిమాని. తాను అనుకున్నట్లుగా చిరంజీవి సీఎం కాకపోయినా ఆయన సోదరుడు పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారనే సంతోషంతో గడిపేస్తున్న ఠాగూర్‌కి ఊహించని పరిస్థితి ఎదురైంది. రోజులన్ని ఒకేలా ఉండవని కాలం ఆడే ఆటలో మనిషి ఓ పావు మాత్రమేనని ఠాగూర్‌ని చూస్తే అర్ధమవుతుంది.

మెగాభిమానికి తీరని కష్టం..

ఠాగూర్ స్వగ్రామంలో అతని ఇంటికి వెళ్లి చూసిన లోకల్18 రిపోర్టర్‌కి ఈ మెగాభిమాని దుస్థితి కన్నీరు తెప్పిస్తోంది. ఇప్పటి వరకు అతని ఆరోగ్యం బాగానే ఉన్నప్పటికి షుగర్, కిడ్నీ సంబంధిత సమస్యలతో గత కొద్దిరోజులుగా మంచానికే పరిమితం అయ్యాడు. ఇంకా రోజులు లెక్కబెట్టుకుంటున్న మెగా అభిమాని దాతల సహాయ సహకారాల కోసం ఎదురుచూడటం లేదు. తాను పూర్తిగా ఆరోగ్యంగా కోలుకొని మళ్లీ రాజకీయాల్లో తిరగాలని ఆశ పడటం లేదు. కేవలం ఒక్కసారి తనను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకెళ్లమని మాత్రమే వేడుకుంటున్నాడు. ఇదే విషయాన్ని తన కుటుంబ సభ్యులతో పదే పదే చెప్పి ప్రస్తుతం నిస్సహాయస్థితిలో మంచానికే పరిమితం అయ్యాడు ఠాగూర్.

చివరి కోరిక ఇదే..

ప్రస్తుతం షుగర్ ఎక్కువ కావడంతో ఠాగూర్ కాలు చివరి భాగం కట్ చేసి తొలగించారు. వారానికి, నెలకు తప్పని సరిగా డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి. మాట్లాడేందుకు మాటలు రావడం లేదు. 2 రోజులుగా హెల్త్ కండీషన్ అంతంత మాత్రంగా ఉండటంతో కుటుంబ సభ్యులు ఠాగూర్‌ని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెగా అభిమానికి వచ్చిన కష్టం ఏమిటి..? ఆ కుటుంబం ఏం కోరుకుంటుందో తెలుసుకునే ప్రయత్నం చేసింది లోకల్18. ఠాగూర్ స్వగ్రామం కొల్లిమెర వెళ్లి చూడటంతో మెగాభిమాని తల్లి మతిస్థిమితం లేకపోవడంతో ఠాగూర్ ఎక్కడున్నారమ్మ అని అడిగితే బయట చెట్టు దగ్గర ఉన్నాడు అంటూ పిచ్చిమాటలు చెప్పడం అందర్ని కన్నీరు పెట్టిస్తోంది.

బంగారం వస్తాడా..

ఇక ఠాగూర్ సోదరుడు వికలాంగుడు. తన అన్నను పెళ్లి చేసుకోమని గతంలో ఎన్నిసార్లు చెప్పినా చిరు సీఎం అయితేనే చేసుకుంటానని చెప్పానని మాటమీద నిలబడి ఒంటరిగా మిగిలిపోయాడని సోదరుడు ఆవేదన వ్యక్తం చేశాడు. మెగా బ్రదర్స్ కోసం కాగడాలా వెలుగు పంచిన ఈ వీరాభిమాని చివరగా అడుతున్న కోరిక ఏమిటంటే ఒక్కసారి పవన్ కళ్యాణ్ చూసి చనిపోతానని చెప్పాడంటూ కుటుంబ సభ్యులు కన్నీరుపెట్టుకొని తెలిపారు. పవన్ కల్యాణ్ కనీసం ఈ చివరి కోరిక తీరిస్తే బాగుంటుందని ఠాగూర్ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అన్నదమ్ముల పార్టీ కోసం ఇంతలా శ్రమించిన ఓ వీరాభిమాని ధీనగాధ నిజంగా పవన్ కల్యాణ్ వరకు వెళ్లిందా? ఒకవేళ వెళ్లకపోతే లోకల్18 ద్వారా అయినా ఈ సమాచారం డిప్యూటీ సీఎం లేదా మెగాస్టార్ చిరంజీవి వరకు చేరాలని ఆ అభిమాని చివరి కోరిక తీరిస్తే బాగుంటుందని ఆశిస్తున్నాం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports