Artificial Intelligence: టెస్టింగ్ కదా అని లైట్ తీసుకుంటే.. 3 కంపెనీల డేటాను యాక్సెస్ చేసి షాకిచ్చిన ఏఐ! | | ACTPnews

News18


Last Updated:

టెస్టింగ్ సమయంలో ఆంథ్రోపిక్ సంస్థకు చెందిన ఏఐ మోడళ్లు పొరపాటున మూడు కంపెనీలను హ్యాక్ చేశాయి. ఓపెన్ ఏఐ వెల్లడించిన సమాచారంతో ఈ విషయం వెలుగులోకి రాగా.. టెక్ ప్రపంచంలో సైబర్ సెక్యూరిటీపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

News18
News18

క్లాడ్ చాట్‌బాట్ సృష్టికర్త, ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సంస్థ ఆంథ్రోపిక్ తాజాగా ఒక సంచలన విషయాన్ని బయటపెట్టింది. టెస్టింగ్ దశలో ఉన్న తమ ఏఐ మోడళ్లు పొరపాటున మూడు ఇతర కంపెనీల నెట్‌వర్క్‌లలోకి ప్రవేశించి హ్యాక్ చేశాయని ప్రకటించినట్లు వాసింగ్టన్ పోస్ట్ కథనం పేర్కొంది. ఇదంతా ఈ ఏడాది ప్రారంభంలోనే జరగ్గా.. ఇటీవలే ఓపెన్ ఏఐ సంస్థ కూడా అచ్చం ఇలాంటి ఘటనే జరిగిందని చెప్పడంతో ఆంథ్రోపిక్ తీవ్రంగా అప్రమత్తమైంది. తమ ఇంటర్నల్ రికార్డులను పరిశీలించగా ఈ మూడు హ్యాకింగ్ ఘటనలు వెలుగుచూశాయి.

సైబర్ భద్రతను పరీక్షించే ఉద్దేశ్యంతో ఆంథ్రోపిక్ తమ ఏఐ మోడళ్లను ఒక ప్రత్యేక సాఫ్ట్‌వేర్ వాతావరణంలో టెస్ట్ చేసింది. అయితే ఈ టెస్టింగ్ కోసం తీసుకున్న థర్డ్-పార్టీ కాంట్రాక్టర్ ‘ఇర్రెగ్యులర్’ పొరపాటున ఏఐ మోడళ్లకు ఇంటర్నెట్ సదుపాయం కల్పించింది. దీంతో ఆ ఏఐ సిస్టమ్స్ తాము ఇంకా టెస్టింగ్ సిమ్యులేషన్‌లోనే ఉన్నామని భ్రమపడి, ఇంటర్నెట్ ద్వారా నేరుగా మూడు నిజమైన కంపెనీల డిజిటల్ వ్యవస్థల్లోకి చొరబడి వాటిని హ్యాక్ చేశాయి. ఈ ఘటన ప్రస్తుతం టెక్ వర్గాల్లో కలకలం రేపుతోంది.

ఎవరికీ దొరక్కుండా సైలెంట్ హ్యాకింగ్

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ హ్యాకింగ్ జరిగిన విషయం అటు ఆంథ్రోపిక్ సంస్థకు గానీ, ఇటు హ్యాకింగ్‌కు గురైన ఆ మూడు కంపెనీలకు గానీ ఈ వారం వరకు తెలియలేదు. ఏఐ మోడళ్లు అంత సైలెంట్‌గా ఈ చొరబాటుకు పాల్పడ్డాయి. విషయం తెలిసిన వెంటనే ఆంథ్రోపిక్ సంస్థ.. కాంట్రాక్టర్ ఇర్రెగ్యులర్‌తో పాటు బాధితులైన మూడు కంపెనీలను అప్రమత్తం చేసింది. అయితే ఆ కంపెనీల పేర్లను బయటపెట్టేందుకు నిరాకరించింది. పారదర్శకంగా వ్యవహరించిన ఆంథ్రోపిక్ తీరును కాంట్రాక్టర్ ఇర్రెగ్యులర్ ప్రశంసించింది. ఈ ఘటనపై ఇరు సంస్థలు ప్రస్తుతం లోతైన దర్యాప్తు జరుపుతున్నాయి.

ఓపెన్ ఏఐ ఘటనతో పోలిక

చాట్‌జీపీటీ సృష్టికర్త ఓపెన్ ఏఐ విషయంలో కూడా వారం క్రితం సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది. సైబర్ సెక్యూరిటీ పజిల్‌ను ఛేదించాల్సిన ఒక ఏఐ ఏజెంట్.. టెస్టింగ్ వాతావరణంలోని లొసుగులను ఆసరాగా చేసుకుని ఇంటర్నెట్ యాక్సెస్ సాధించింది. ఐదు రోజుల పాటు పలు కంప్యూటర్లలోకి చొరబడి, ఏకంగా ‘హగ్గింగ్ ఫేస్’ అనే ఏఐ సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫామ్‌ను హ్యాక్ చేసింది. ఈ విషయం బయటకు రాగానే అప్రమత్తమైన ఆంథ్రోపిక్, తమ సొంత వ్యవస్థల్లో వెతుకులాట ప్రారంభించి తాజా హ్యాకింగ్ ఉదంతాలను కనిపెట్టింది.

పెరుగుతున్న ముప్పు..

ప్రభుత్వ జోక్యం వరుసగా జరుగుతున్న ఈ ఘటనలు ఏఐ టెక్నాలజీ భద్రతపై తీవ్ర ఆందోళనలు పెంచుతున్నాయి. అత్యంత శక్తివంతమైన ఏఐ మోడళ్లతో సైబర్ సెక్యూరిటీ ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆంథ్రోపిక్ ఏప్రిల్‌లో ప్రకటించిన ‘మైథోస్’ మోడల్ చాలా పవర్‌ఫుల్ కావడంతో దాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురాలేదు. మరోవైపు, ఏఐ మోడళ్ల ముప్పును అరికట్టేందుకు అమెరికా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జాతీయ భద్రతకు ముప్పు కలిగించే ఏఐ మోడళ్లను ముందుగానే సమీక్షించేలా జూన్ 2026లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. దీన్ని ఎలా అమలు చేయాలన్న దానిపై ప్రస్తుతం కసరత్తు జరుగుతోంది.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *