Last Updated:
Team India: శ్రీలంకతో జరగబోయే కీలకమైన రెండు టెస్టుల సిరీస్‌కు ముందు టీమ్ఇండియాకు భారీ ఉపశమనం లభించింది.
భారత సీనియర్ ఫాస్ట్ బౌలర్, పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా సంపూర్ణ ఫిట్నెస్ సాధించాడని బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (COE) స్పష్టం చేసింది. దీంతో అతడు రాబోయే లంక సిరీస్‌లో బరిలోకి దిగేందుకు మార్గం సుగమమైంది. ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్ సందర్భంగా బుమ్రా దెబ్బతగలడంతో గాయపడిన సంగతి తెలిసిందే. ఈ గాయం కారణంగా లార్డ్స్‌లో జరిగిన మూడో వన్డేకు అతడు దూరం కావాల్సి వచ్చింది. అనంతరం లంక సిరీస్‌కు ఎంపిక చేసినప్పటికీ, అతడి ఫిట్నెస్ ఆధారంగానే తుది నిర్ణయం తీసుకుంటామని బోర్డు పేర్కొంది. తాజాగా సీఓఈ నిర్వహించిన ఫిట్నెస్ పరీక్షల్లో బుమ్రా నెగ్గాడు.
“జస్ప్రీత్ బుమ్రా తన గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. సీఓఈ నిర్దేశించిన అన్ని ఫిట్నెస్ పరీక్షలను విజయవంతంగా పూర్తి చేశాడు. భారత జట్టు ప్రణాళికల్లో బుమ్రా అత్యంత కీలకమైన ఆటగాడు కాబట్టి, అతడు రెండు టెస్టుల్లోనూ అందుబాటులో ఉంటాడని భావిస్తున్నాం” అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక బీసీసీఐ సీనియర్ అధికారి ‘పిటిఐ’ వార్తా సంస్థకు వెల్లడించారు.
భారత్-శ్రీలంక మధ్య రెండు టెస్టుల సిరీస్ ఆగస్టు 15 నుంచి గాలే వేదికగా ప్రారంభం కానుంది. అనంతరం రెండో టెస్టు మ్యాచ్ ఆగస్టు 23 నుంచి కొలంబోలో జరగనుంది.
ప్రస్తుత ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్ రేసులో నిలవాలంటే టీమ్ఇండియా మిగిలి ఉన్న 9 టెస్టుల్లో కనీసం 7 మ్యాచ్‌ల్లో తప్పక గెలవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రాబోయే న్యూజిలాండ్ పర్యటన కంటే ముందే, శ్రీలంకను వారి సొంత గడ్డపై 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేయడం భారత జట్టుకు అత్యంత కీలకంగా మారింది.
ఒకవైపు బుమ్రా రాక ఉపశమనం అందించినప్పటికీ, పలువురు కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా జట్టుకు దూరం కావడం ఆందోళన కలిగిస్తోంది. హ్యామ్‌స్ట్రింగ్ గాయంతో హర్షిత్ రాణా, క్వాడ్రిసెప్స్ గాయంతో నితీష్ కుమార్‌రెడ్డి ఇప్పటికే సిరీస్‌కు దూరమయ్యారు.
అలాగే హ్యామ్‌స్ట్రింగ్ సమస్యతో ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ మొదటి టెస్టుకు అందుబాటులో ఉండటం లేదు. వెన్నునొప్పితో పేసర్ ఆకాశ్ దీప్ సుదీర్ఘకాలంగా జట్టుకు దూరంగా ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో బుమ్రా తిరిగి రావడం భారత పేస్ దళానికి కొండంత కొండంత అండగా మారనుంది.
లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్, మ్యాచ్ అప్డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి
Hyderabad,Telangana
Aug 02, 2026 12:36 PM IST














