Last Updated:
వైవిధ్యమైన కథలతో ఇప్పటితరం ఆడియన్స్ మనసు దోచేస్తున్న రాజ్ మయూర్ కొత్త సినిమా అనుమాన పక్షి. సెప్టెంబర్ 25న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
‘సినిమా బండి’, ‘కీడా కోలా’, ‘శుభం’ లాంటి వైవిధ్యమైన చిత్రాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాగ్ మయూర్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘అనుమాన పక్షి’. యూత్ సెన్సేషన్ ‘డీజే టిల్లు’ చిత్రంతో బ్లాక్బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు విమల్ కృష్ణ ఈ సినిమాను తెరకెక్కించడంతో ఇండస్ట్రీ వర్గాల్లో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. రాజీవ్ చిలక, రాజేష్ జగ్తియాని, హిరాచంద్ దండ్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 25న థియేటర్లలో విడుదలైంది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేర ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం.
కథ:
సన్నీ (రాగ్ మయూర్) ప్రతి చిన్న విషయాన్నీ తీవ్రంగా అనుమానించే యువకుడు. తన బుర్రలో మెదిలే ప్రతి అనుమానాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాడు. సన్నీ చేసిన ఒక పని వల్ల తీవ్రంగా నష్టపోయిన అనంత్ (చరిత్), కశ్మీర్ నుంచి అతనికి మెసేజ్ చేసి, తన చావుకు సన్నీయే కారణమని సూసైడ్ నోట్ రాసి చనిపోతానని బెదిరిస్తాడు. దీంతో కంగారు పడిన సన్నీ తన స్నేహితుడు వర్మ (ప్రిన్స్)తో కలిసి కశ్మీర్ వెళ్తాడు. అక్కడ కన్య (మెరిన్ ఫిలిప్)ను చూసి ప్రేమలో పడతాడు. అంతా సవ్యంగా ఉందనుకునే లోపు వర్మ అనుమానాస్పద స్థితిలో మరణిస్తాడు. అదే సమయంలో ఆ రిసార్టుకు ఆత్మలతో మాట్లాడే శక్తులున్న సుజాత (సీనియర్ నటి రాశి), ఆమె భర్త, విశాఖ పోలీస్ వాసు (అజయ్) వస్తారు. అసలు వర్మ ఎలా చనిపోయాడు? సన్నీ తన సమస్య నుంచి ఎలా బయటపడ్డాడు? అనేది మిగతా కథ.
విశ్లేషణ:
‘డీజే టిల్లు’ లాంటి ట్రెండ్ సెట్టర్ తీసిన విమల్ కృష్ణ నుంచి వచ్చిన సినిమా అంటే అంచనాలు ఉండటం సహజం. సోషల్ మీడియాలో లైక్స్, వైరల్ కంటెంట్ అనే పాయింట్ చుట్టూ అల్లిన ఈ కథను దర్శకుడు ఈ తరం ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా మలిచాడు. ప్రతి క్షణం అనుమానించే హీరో క్యారెక్టరైజేషన్ బాగుంది. ఆడియన్స్ హాయిగా నవ్వుకునే హాస్య సన్నివేశాలతో నెమ్మదిగా కథలోకి తీసుకెళ్ళాడు. ఫస్టాఫ్ లో కొంతమేర ల్యాగ్ కనిపించినా సెకండాఫ్ లో దాన్ని కవర్ చేస్తూ ఆద్యంతం విందభరితం చేశాడు.
నటీనటులు, సాంకేతిక వర్గం:
మంచి ఫామ్లో ఉన్న సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల ఈ సినిమా కోసం తన వంతు కృషి చేశాడు. రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్, రాశి, అజయ్, బ్రహ్మాజీ, ప్రిన్స్ లాంటి టాలెంటెడ్ కాస్టింగ్ వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా ఉన్నాయి. కశ్మీర్ సీన్స్ కోసం వాడిన ఏఐ విజువల్స్ కాస్త కొత్తగా అనిపించాయి.
ఓవరాల్గా చెప్పాలంటే.. ఇది నేటితరం ఇష్టపడే కామెడీ థ్రిల్లర్.
రేటింగ్ : 3














