Last Updated:
Asian Games 2026: 2026 ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్ల పతకాల వేట అప్రతిహతంగా సాగుతోంది. పోటీల పదో రోజున భారత షూటర్లు తమ తుపాకులకు పనిచెప్పి అద్భుతమైన విజయాన్ని నమోదు చేశారు.
ప్రస్తుత సీజన్లో భారత శిబిరంలో నెలకొన్న వ్యక్తిగత విభాగపు స్వర్ణ పతక లోటును భర్తీ చేస్తూ స్టార్ షూటర్ నీరూ దండా చరిత్ర సృష్టించారు. మహిళల ట్రాప్ షూటింగ్ వ్యక్తిగత విభాగంలో తిరుగులేని ప్రదర్శనతో అగ్రస్థానంలో నిలిచిన ఆమె, బంగారు పతకాన్ని ముద్దాడారు. ఈ విజయంతో 2026 ఆసియా క్రీడల్లో భారత్‌కు ఐదో స్వర్ణ పతకం లభించినట్లయింది.
లక్ష్యాన్ని గురిచూసి కొట్టడంలో అద్భుత నైపుణ్యాన్ని కనబరిచిన నీరూ దండా ఫైనల్స్‌లో ప్రత్యర్థులపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. అంతకుముందు జరిగిన మహిళల ట్రాప్ షూటింగ్ టీమ్ ఈవెంట్లోనూ నీరూ రజత పతకం సాధించిన భారత జట్టులో సభ్యురాలిగా ఉన్నారు. ఆషిమా అహ్లావత్, మనీషా కీర్‌లతో కూడిన భారత త్రయం అద్భుత సమన్వయంతో రజతాన్ని కైవసం చేసుకోగా, వ్యక్తిగత విభాగంలో నీరూ ఏకంగా స్వర్ణాన్ని సాధించి తన పతక స్థాయిని పెంచుకున్నారు.
ఈ క్రీడల్లో అంతకుముందు భారత్ సాధించిన నాలుగు స్వర్ణాలు కూడా జట్టు విభాగాల్లోనే వచ్చాయి. మహిళల క్రికెట్ ఫైనల్ పోరులో హర్మన్‌ప్రీత్ సేన సాధించిన చారిత్రక విజయం దేశానికి తొలి పసిడిని అందించగా, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో సురుచి సింగ్, కమల్జీత్ జంట రెండో బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. ఇక సంప్రదాయ క్రీడ కబడ్డీలో పురుషుల, మహిళల జట్లు రెండూ ఎదురులేని ఆధిపత్యంతో బంగారు పతకాలను భారత్ ఖాతాలో చేర్చాయి.
ఇప్పటివరకు వచ్చిన పసిడి పతకాలన్నీ టీమ్ ఈవెంట్స్‌లోనే కావడం గమనార్హం. అయితే నీరూ దండా సాధించిన ఈ విజయంతో వ్యక్తిగత విభాగంలోనూ భారత్‌కు స్వర్ణ బోణీ పడింది. ఈ విజయంతో పతకాల పట్టికలో భారత స్థానం మరింత మెరుగైంది. భారత్ ఒక స్థానం ముందుకు ఎగబాకి ప్రస్తుతం 11వ స్థానానికి చేరుకుంది. భారత్ ఖాతాలో ఇప్పటివరకు 5 స్వర్ణాలు, 21 రజతాలు, 21 కాంస్య పతకాలు కలిపి మొత్తం 47 పతకాలు చేరాయి. వ్యక్తిగత విభాగంలో చారిత్రక స్వర్ణం అందించిన నీరూ దండాపై దేశవ్యాప్తంగా క్రీడా వర్గాల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.














