Last Updated:
ఆసియా క్రీడల్లో భారత మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ సుచికా తరియాల్ సంచలనం సృష్టించింది. 20వ ఏషియన్ గేమ్స్‌లో తొలిసారిగా ప్రవేశపెట్టిన ఎంఎంఏ (మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్) క్రీడలో దేశానికి తొలి కాంస్య పతకం అందించి చరిత్ర పుటల్లోకెక్కింది.
జపాన్ వేదికగా జరుగుతున్న 20వ ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు అదరగొడుతున్నారు. మహిళల 60 కిలోల మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ (ఎంఎంఏ) విభాగంలో స్టార్ ఫైటర్ సుచికా తరియాల్ అద్భుత ప్రదర్శనతో కాంస్య పతకం కైవసం చేసుకుంది. సింగపూర్‌కు చెందిన హుయ్ హూన్ టియోతో జరిగిన సెమీఫైనల్ పోరు డ్రాగా ముగియడంతో, నిబంధనల ప్రకారం బరువు తక్కువగా ఉన్న సింగపూర్ ఫైటర్‌ను విజేతగా ప్రకటించారు. దీంతో సుచికా కాంస్యంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆసియా క్రీడల్లో ఎంఎంఏ క్రీడను ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి కాగా, అరంగేట్రంలోనే దేశానికి తొలి పతకం అందించిన అథ్లెట్‌గా సుచికా సరికొత్త చరిత్ర లిఖించింది.
హర్యానాలోని రోహ్తక్ జిల్లా కిలోయ్ గ్రామానికి చెందిన 36 ఏళ్ల సుచికా గతంలో 2024 జియు-జిట్సు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో జూడోలో, 2022 ఆసియా క్రీడల్లో కురాష్ ఫైటర్‌గా కూడా ఆమె దేశానికి ప్రాతినిధ్యం వహించింది.
India’s first Asian Games medal in MMA!
Congratulations to Suchika Tariyal on winning the Bronze Medal in the Women’s Traditional-60 kg category at the #AsianGames2026.With MMA making its debut at the Asian Games, Suchika has etched her name in history as India’s first Asian… pic.twitter.com/XabQkYk84I
— Kiren Rijiju (@KirenRijiju) September 21, 2026
సెమీఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత పతకం రంగు మారడంతో సుచికా కన్నీరుమున్నీరుగా విలపించింది. పోరాటంలో తాను వంద శాతం శ్రమించానని, ఈ మ్యాచ్‌లో తానే గెలిచానని భావించినట్లు మ్యాచ్ అనంతరం ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అయితే రిఫరీ నిర్ణయం తనకు ఏమాత్రం న్యాయంగా అనిపించలేదని, ఫైనల్ ఫలితాన్ని తాను అంగీకరించలేకపోతున్నానని సుచికా కన్నీళ్లు పెట్టుకుంది. పాయింట్ల పట్టిక బోర్డుపై కనిపించగానే సుచికా తీవ్ర నిరాశకు గురైంది. రిఫరీ విజేత చేతిని పైకెత్తేందుకు పిలిచినా ఆమె దూరంగానే ఉండిపోయింది. సింగపూర్ ఫైటర్ చేయి పైకెత్తగానే సుచికా మోకాళ్లపై కుప్పకూలిపోయింది. కోచ్‌లు ఆమెను ఓదార్చాల్సి వచ్చింది. ఆ తర్వాత కాస్త స్థిమితపడి జాతీయ జెండా కప్పుకుని మైదానంలో గౌరవ వందనం చేసింది.
మ్యాచ్ ఆరంభంలో సింగపూర్ క్రీడాకారిణి టియోకు అనుకూలంగా తీర్పు వచ్చింది. అయితే ఈ నిర్ణయాన్ని భారత బృందం సవాల్ చేసింది. వెయ్యి డాలర్ల ఫీజు చెల్లించి మళ్లీ రివ్యూ కోరడంతో మరో ముగ్గురు కొత్త జడ్జీలను ప్యానెల్లో చేర్చారు. ఆరుగురు జడ్జీలు పరిశీలించిన తర్వాత మ్యాచ్‌ను డ్రాగా ప్రకటించారు. ఇక్కడే ఇంటర్నేషనల్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఫెడరేషన్ (IMMAF) నిబంధనలు కీలకంగా మారాయి. మ్యాచ్ డ్రా అయినప్పుడు ఉదయం తీసుకున్న బరువును పరిగణనలోకి తీసుకుని విజేతను నిర్ణయిస్తారు. సింగపూర్ ఫైటర్ బరువు సుచికా కంటే 700 గ్రాములు తక్కువగా ఉండటంతో ఆమెను విజేతగా ప్రకటించి ఫైనల్‌కు పంపించారు. నిబంధనలే సుచికాకు ఫైనల్ అవకాశాన్ని దూరం చేశాయి.
చిన్న వయసులోనే వీధి వేధింపులు ఎదుర్కొన్న సుచికా, తనను తాను రక్షించుకునేందుకు 12 ఏళ్ల వయసులో కాంబాట్ స్పోర్ట్స్ (పోరాట క్రీడలు) వైపు అడుగులేసింది. అప్పటినుంచి ఎన్నో ఆటంకాలను ఎదుర్కొని మల్టీ-డిసిప్లినరీ ఫైటర్‌గా ఎదిగింది. ఎన్ని క్రీడలు మారినా పతకం సాధించాలన్న ఆమె కసి మాత్రం తగ్గలేదు. బంగారు పతకం తృటిలో చేజారినప్పటికీ, ఎంఎంఏ విభాగంలో భారత కీర్తి పతాకాన్ని ఆసియా వేదికపై రెపరెపలాడించిన తొలి అథ్లెట్‌గా సుచికా ఎప్పటికీ నిలిచిపోతుంది. ఇప్పుడు సాధించిన ఈ కాంస్య పతకం రాబోయే తరాలకు, ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలనుకునే ఎంతోమంది యువతులకు పెద్ద స్ఫూర్తిగా నిలుస్తుందని క్రీడా పండితులు ప్రశంసిస్తున్నారు.














