Last Updated:
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో 90ల కాలంలోని సూపర్ హిట్ సాంగ్ నేటికీ ట్రెండ్ అవుతోంది. ఈ పాటను రాజేంద్ర ప్రసాద్ మిస్ చేసుకోగా.. బాబు మోహన్ మాత్రం విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో 90ల కాలంలో క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లకు, సూపర్ హిట్ మ్యూజికల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన అగ్ర దర్శకుడు ఎస్.వి. కృష్ణా రెడ్డి. ‘రాజేంద్రుడు-గజేంద్రుడు’, ‘యమలీల’, ‘శుభలగ్నం’, ‘ఘటోత్కచుడు’ వంటి ఎన్నో అద్భుతమైన చిత్రాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేకమైన శకాన్ని సృష్టించుకున్నారాయన. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ స్టార్ డైరెక్టర్, తన కెరీర్ ఆరంభ దశలో ఎదురైన సవాళ్లను, ముఖ్యంగా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్‌తో పనిచేసినప్పటి కొన్ని చేదు, తీపి అనుభవాలను పంచుకున్నారు.
తాను ఎప్పుడూ ఇండస్ట్రీలో ‘జీరోలను హీరోలు చేయాలి’ అనే పట్టుదలతోనే పనిచేశానని, తన ప్రతి సినిమా ప్రేక్షకులను అలరిస్తూ ఒక అద్భుతాన్ని సృష్టించాలనే సంకల్పంతో ముందుకు సాగానని కృష్ణా రెడ్డి పేర్కొన్నారు. తనకు చిన్న, పెద్ద అనే బేధాలు ఉండవని, కేవలం కథ, నూతనత్వం, ప్రేక్షకులకు క్వాలిటీ సినిమా అందించడమే తన ప్రథమ ప్రాధాన్యత అని వివరించారు. రాజేంద్ర ప్రసాద్‌తో తన ప్రయాణం గురించి మాట్లాడుతూ, ఆయన తనకు దర్శకుడిగా తొలి రోజుల్లో అవకాశం ఇవ్వడం తన అదృష్టమని, ఆ కృతజ్ఞత ఎప్పటికీ ఉంటుందని తెలిపారు. అయితే, తాను ఎదుగుతున్న దశలో రాజేంద్ర ప్రసాద్ తనను ఒక చిన్నవాడిగా, కొత్తవాడిగా మాత్రమే చూశారని, తన ఆలోచనా విధానాన్ని, దర్శకత్వ ప్రతిభను తక్కువ అంచనా వేశారని కృష్ణా రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
1993లో విడుదలైన అద్భుతమైన హాస్య రసాత్మక చిత్రం ‘మాయలోడు’ నిర్మాణ సమయంలో జరిగిన ఒక ఆసక్తికరమైన సంఘటను ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసుకున్నారు. రాజేంద్ర ప్రసాద్, సౌందర్య జంటగా నటించిన ఈ సినిమాలో ‘చినుకు చినుకు అందెలతో’ అనే సాంగ్ ఈరోజుకీ ఒక ఎవర్‌గ్రీన్ మెలోడీ. అయితే ఈ పాట చిత్రీకరణ సమయంలో పెద్ద చిక్కే వచ్చి పడింది.
ఈ సాంగ్ షూటింగ్ కోసం రాజేంద్ర ప్రసాద్ డేట్లు అడ్జస్ట్ చేయలేకపోయారు. హీరోయిన్ సౌందర్య డేట్లు ఇచ్చి సెట్స్‌పై ఉన్నప్పటికీ, తాను మాత్రం సహకరించలేనని రాజేంద్ర ప్రసాద్ సెప్పినట్లు ఎస్.వి. కృష్ణా రెడ్డి తెలిపారు. దీంతో ఆయన కథలో చిన్న మార్పు చేసి, హీరో స్థానంలో హాస్యనటుడు బాబు మోహన్‌ను తీసుకున్నారు. బాబు మోహన్‌ను సంప్రదించి, స్టార్ హీరోయిన్ సౌందర్య పక్కన ఆ పాటలో నటించమని కోరగా ఆయన సంతోషంగా అంగీకరించారట. “నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలను, ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది” అనే దృఢ సంకల్పంతో ఆ పాటను బాబు మోహన్, సౌందర్యలపై వినూత్నంగా చిత్రీకరించారు.
చివరకు కృష్ణా రెడ్డి నమ్మకమే నిజమైంది. ‘మాయలోడు’ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. రాజేంద్ర ప్రసాద్ కాకుండా బాబు మోహన్ చేసిన ఆ వినూత్నమైన పాట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుని ప్రజాదరణ పొందింది. కమర్షియల్‌గానే కాకుండా విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రానికి గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ‘ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా’ ప్రతిష్టాత్మక నంది అవార్డు దక్కింది. నాటి ఇండస్ట్రీ విశేషాలపై ఎస్.వి. కృష్ణా రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana
May 29, 2026 10:49 AM IST













