Last Updated:
తెలుగు సినీ పరిశ్రమలో రూ.4 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన తొలి చిత్రంగా నిలిచిన మంగమ్మగారి మనవడు ద్వారా బాలయ్య కొత్త రికార్డులకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు.
నందమూరి నటసింహం, హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు చిత్తూరు జిల్లాలో ఘనంగా నిర్వహించారు. పలమనేరు, కుప్పం, కాణిపాకం తదితర ప్రాంతాల్లో అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహిస్తూ బాలయ్య బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అభిమాన సంఘాల ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ బాలయ్యపై తమ అభిమానాన్ని చాటుకున్నారు.
ఈ సందర్భంగా కాణిపాకం ఆటో సర్కిల్‌లో బాలకృష్ణ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు నరసింహ నాయుడు, జిల్లా టౌన్ ప్రెసిడెంట్ ఎల్‌బీ నాయుడు ఆధ్వర్యంలో ప్రత్యేక జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అభిమానుల మధ్య కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. బాలయ్య బాబు 66వ జన్మదినాన్ని పురస్కరించుకుని అభిమానులు భారీ ఎత్తున సంబరాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు నరసింహ నాయుడు మాట్లాడుతూ బాలకృష్ణ తెలుగు సినీ చరిత్రలో ఎన్నో అరుదైన రికార్డులను సొంతం చేసుకున్న నటుడని అన్నారు. తెలుగు సినీ పరిశ్రమలో రూ.4 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన తొలి చిత్రంగా నిలిచిన మంగమ్మగారి మనవడు ద్వారా బాలయ్య కొత్త రికార్డులకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. అంతేకాకుండా అత్యధిక సిల్వర్ జూబ్లీ చిత్రాలు కలిగిన హీరోల్లో బాలకృష్ణ అగ్రస్థానంలో నిలిచారని తెలిపారు.
మంగమ్మగారి మనవడు, ముద్దుల కృష్ణయ్య, ముద్దుల మావయ్య, సమరసింహా రెడ్డి, నరసింహా నాయుడు, సమరసింహా రెడ్డి, సింహా, వంటి చిత్రాలు తెలుగు సినీ పరిశ్రమలో సరికొత్త రికార్డులు సృష్టించాయని అన్నారు. ముఖ్యంగా లెజెండ్ సినిమా రాయలసీమ ప్రాంతంలో వెయ్యి రోజులకు పైగా ప్రదర్శితమై దక్షిణ భారత సినీ చరిత్రలో అరుదైన ఘనతను సాధించిందని పేర్కొన్నారు.
దర్శకులు కోడి రామకృష్ణ, B. గోపాల్‌లతో ఒకప్పుడు సూపర్ హిట్ కాంబినేషన్లు అందించిన బాలకృష్ణ, ప్రస్తుతం బోయపాటి శ్రీనుతో అదే విజయ పరంపరను కొనసాగిస్తున్నారని తెలిపారు. సింహా, లెజెండ్, అఖండ సినిమాల్లో ద్విపాత్రాభినయం చేసి వరుస విజయాలు అందుకున్నారని గుర్తుచేశారు. అలాగే ఐదు దశాబ్దాలకు పైగా సినీ రంగంలో నటుడిగా కొనసాగుతూ ప్రేక్షకులను అలరిస్తున్న బాలకృష్ణకు ఇటీవల వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్‌లో స్థానం లభించడం అభిమానులకు గర్వకారణమని పేర్కొన్నారు.
జిల్లా వ్యాప్తంగా జరిగిన ఈ వేడుకల్లో అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని బాలయ్య బాబు దీర్ఘాయుష్షుతో, ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కాణిపాకం ప్రాంతం మొత్తం నందమూరి అభిమానుల నినాదాలతో మారుమోగిపోయింది.
సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana












