Last Updated:
జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల పరామర్శించిన జన్యుపరమైన అరుదైన వ్యాధితో బాధపడుతున్న బాలుడు నిరంజన్ కుటుంబానికి ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించారు.
జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల పరామర్శించిన జన్యుపరమైన అరుదైన వ్యాధితో బాధపడుతున్న బాలుడు నిరంజన్ కుటుంబానికి ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించారు. హనుమకొండ నగరంలోని హనుమాన్ నగర్‌కు చెందిన పొనుగోటి రాంగోపాల చారి-మానస దంపతుల కుమారుడు నిరంజన్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న అనంతరం ఆయన ఈ సహాయం ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా బండ్ల గణేష్ స్వయంగా నిరంజన్ నివాసానికి వెళ్లి బాలుడిని, అతని కుటుంబ సభ్యులను పరామర్శించారు. నిరంజన్‌తో కొంతసేపు ఆప్యాయంగా మాట్లాడిన ఆయన, బాలుడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశ చెందవద్దని నిరంజన్‌కు, అతని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. భవిష్యత్తులో కూడా తమ వంతు సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా తన నిర్మాణ సంస్థ పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ తరఫున రూ.5 లక్షల చెక్కును నిరంజన్ కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ మొత్తాన్ని బాలుడి భవిష్యత్తు కోసం అతని పేరుపై ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని తల్లిదండ్రులకు సూచించారు. అయితే ఈ సమయంలో చోటుచేసుకున్న ఓ భావోద్వేగ ఘటన అక్కడున్న వారిని కదిలించింది. తనకు కారు కొనుక్కోవాలని ఉందని, కారులో తిరగడం తన కల అని నిరంజన్ బండ్ల గణేష్‌కు చెప్పాడు. చిన్నారి అమాయక కోరిక విన్న బండ్ల గణేష్ చలించిపోయి, అవసరమైతే ఆ డబ్బుతో కారు కొనుగోలు చేయాలని కూడా సూచించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బండ్ల గణేష్, పవన్ కళ్యాణ్ ద్వారా ఈ బాలుడి పరిస్థితి తన దృష్టికి వచ్చిందన్నారు. తనకు పవన్ కళ్యాణ్ అంటే అపారమైన గౌరవం, భక్తి ఉందని, ఆయన సేవా కార్యక్రమాలు ఎప్పుడూ తనకు స్ఫూర్తినిస్తాయని చెప్పారు. పవన్ కళ్యాణ్ నిరంజన్‌ను పరామర్శించిన తర్వాత ఈ కుటుంబానికి సహాయం చేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.
“ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండటానికి పవన్ కళ్యాణ్ కూడా ఒక కారణం. ఆయన చూపిస్తున్న సేవా దృక్పథం, మానవత్వం నాకు ఎప్పుడూ ఆదర్శం. అదే స్ఫూర్తితో ఈ చిన్నారి కోసం నా వంతు సహాయం అందించాను” అని బండ్ల గణేష్ పేర్కొన్నారు.
ఇక ప్రస్తుతం తన కుమార్తె వివాహ ఏర్పాట్లతో బిజీగా ఉన్నప్పటికీ, నిరంజన్ కుటుంబాన్ని కలుసుకుని సహాయం అందించాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా హనుమకొండకు వచ్చినట్లు తెలిపారు. అంతేకాకుండా నేడు నారా భువనేశ్వరి జన్మదినం కావడం కూడా ప్రత్యేకతగా పేర్కొన్నారు. ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ ఆర్థిక సహాయం అందించడం తనకు మరింత ఆనందాన్ని కలిగించిందని చెప్పారు.
బండ్ల గణేష్ అందించిన ఈ సహాయంతో నిరంజన్ కుటుంబానికి కొంత ఊరట లభించినట్లు స్థానికులు అభిప్రాయపడుతున్నారు. చిన్నారి ఆరోగ్యం మెరుగుపడాలని, అతని కోరికలు నెరవేరాలని పలువురు ఆకాంక్షిస్తున్నారు.
సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana












