Last Updated:
BCCI: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) పురుషుల సెలెక్షన్ కమిటీ ఛైర్మన్‌గా అజిత్ అగార్కర్ శకం దాదాపు ముగిసింది.
అక్టోబర్ 4వ తేదీతో బీసీసీఐతో ఆయనకున్న కాంట్రాక్ట్ అధికారికంగా ముగియనుండగా, అగార్కర్ స్థానంలో కొత్త సారథిని ఎంపిక చేసే ప్రక్రియ కూడా పూర్తయినట్లు స్పష్టమైంది. మంగళవారం గువాహటిలో సెలెక్షన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ కీలక భేటీకి అగార్కర్ గైర్హాజరు కావడం గమనార్హం. కొత్త ఛైర్మన్ లేదా ప్రత్యామ్నాయ సెలెక్టర్ అధికారికంగా నియమితులయ్యే వరకు బీసీసీఐ తాత్కాలిక ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో భారత మాజీ స్పిన్నర్, 40 ఏళ్ల ప్రజ్ఞాన్ ఓజా సెలెక్షన్ కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం కమిటీలో ఉన్న నలుగురు సెలెక్టర్లలో ఓజా అత్యధిక టెస్టులు (24) ఆడిన సీనియర్ కావడంతో నిబంధనల ప్రకారం ఆయనకే ఈ బాధ్యతలు దక్కాయి. ఆయన తర్వాతి స్థానాల్లో శివసుందర్ దాస్ (23 టెస్టులు), ఆర్పీ సింగ్ (14 టెస్టులు), అజయ్ రాత్రా (6 టెస్టులు) ఉన్నారు.
ఈ తాత్కాలిక బాధ్యత ఎంతకాలం కొనసాగుతుందనేది త్వరలోనే కొత్త సెలెక్టర్ ఎంపికతో తేలనుంది. ప్రస్తుతం ప్రచారంలో ఉన్నట్లు మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ కమిటీలోకి వస్తే ఆయన ఛైర్మన్ అయ్యే అవకాశం ఉంది. లేదంటే ఓజానే పూర్తిస్థాయి ఛైర్మన్‌గా కొనసాగే అవకాశాలూ లేకపోలేదు.
గువాహటి వేదికగా భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య బుధవారం రెండో వన్డే జరగనున్న నేపథ్యంలో, స్థానికుడైన బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆయన సెలెక్టర్లతో మాట్లాడి భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా ఈ భేటీకి హాజరైనట్లు తెలుస్తోంది.
ఈ సమావేశంలో న్యూజిలాండ్ పర్యటనకు సంబంధించిన భారత జట్టు ఎంపికపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. అక్టోబర్ 22 నుంచి డిసెంబర్ 1 వరకు న్యూజిలాండ్‌తో భారత్ 5 టీ20లు, 5 వన్డేలు, 2 టెస్టుల సిరీస్ ఆడనుంది. టెస్టు జట్టులో గతేడాది ఇంగ్లాండ్‌లో జరిగిన ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో ఆడిన ఆటగాళ్లకే ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నారు. అలాగే అక్టోబర్ 6 నుంచి పుదుచ్చేరిలో ఆస్ట్రేలియా-ఏ జట్టుతో జరిగే మూడు వన్డేల సిరీస్ నుంచి గాయం కారణంగా వైదొలిగిన హార్దిక్ పాండ్యా స్థానంలో మరో ఆటగాడిని ఖరారు చేశారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.
మరోవైపు సెలెక్టర్లు బుధవారం గువాహటి నుంచి తమ విధులకు బయలుదేరనున్నారు. దాస్, రాత్రా పుదుచ్చేరిలో ఇండియా-ఏ మ్యాచ్‌లను పర్యవేక్షించనుండగా, కొత్త ఛైర్మన్ ఓజా గురువారం ప్రారంభమయ్యే ఇరానీ ట్రోఫీ కోసం శ్రీనగర్ వెళ్లనున్నారు. ఆర్పీ సింగ్ టీమిండియాతో కలిసి మూడో వన్డే కోసం చండీగఢ్ ప్రయాణం కానున్నారు.














