Last Updated:
విక్టరీ వెంకటేష్ హీరోగా రాబోతున్న కొత్త సినిమా ఆదర్శ కుటుంబం. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఆయన చెప్పిన కొన్ని విషయాలు వైరల్ అవుతున్నాయి.
విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47’. ఈ చిత్రంలో ‘కేజీఎఫ్’ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. భారీ అంచనాల మధ్య అక్టోబర్ 9న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఈ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా వెంకటేష్, త్రివిక్రమ్ తదితరులు ప్రముఖ యాంకర్ సుమ కనకాలతో ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ చిట్‌చాట్ ఆద్యంతం సరదాగా సాగింది.
ఈ ఇంటర్వ్యూలో సుమ.. లెజెండరీ నిర్మాత డి. రామానాయుడు నిర్మించిన ఆల్ టైమ్ క్లాసిక్ ‘ప్రేమనగర్’ సినిమాలోని వెంకటేష్ బాల నటుడిగా ఉన్న ఫోటోను చూపించి సర్ప్రైజ్ చేశారు. ఆ ఫోటో చూడగానే పాత జ్ఞాపకాల్లోకి వెళ్లిన వెంకీ.. దాని వెనుక ఉన్న ఒక ఆసక్తికరమైన, ఫన్నీ సంఘటనను పంచుకున్నారు.
“ఒకరోజు నేను స్కూల్లో ఆడుకుంటున్న సమయంలో మా ప్రొడక్షన్ మేనేజర్ అక్కడికి వచ్చారు. ‘నాన్నగారు పిలుస్తున్నారు, సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ చేయాలట’ అని చెప్పారు. అప్పటికే మా బ్యానర్ షూటింగ్స్ చూసిన నాకు, జూనియర్ ఆర్టిస్టులకు డబ్బులు ఇస్తారనే విషయం తెలుసు. దాంతో వెంటనే ‘మరి యాక్ట్ చేస్తే నాక్కూడా డబ్బులు ఇస్తారా?’ అని అడిగాను. ఆ మేనేజర్ వెళ్లి నాన్నగారికి ఈ విషయం చెప్పగా.. ఆయన నవ్వి, నాకు వెయ్యి రూపాయలు ఇస్తానని మాటిచ్చారు. ఆ వెయ్యి రూపాయల కోసమే వెళ్లి ‘ప్రేమనగర్’ సినిమాలో కైకాల సత్యనారాయణ గారి చిన్నప్పటి పాత్రలో నటించాను” అని వెంకటేష్ నవ్వుతూ చెప్పారు. ఆయన చెప్పిన ఈ ముచ్చటతో అక్కడున్న వారంతా నవ్వుల్లో మునిగిపోయారు.
గతంలో వెంకటేష్ హీరోగా, త్రివిక్రమ్ రచయితగా వచ్చిన ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ చిత్రాలు తెలుగు సినీ చరిత్రలో ఎవర్‌గ్రీన్ బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. దశాబ్దాల తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ నటిస్తుండటంతో ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47’పై టాలీవుడ్‌లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. వింటేజ్ వెంకీ మార్క్ కామెడీ టైమింగ్, త్రివిక్రమ్ పంచ్ డైలాగ్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. అక్టోబర్ 9న ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఈ చిత్రం ఒక పండుగలా ఉండబోతోందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.














