Last Updated:
Bengaluru Cyber Crime: మనీ పోగొట్టుకోవడం ఒక సమస్య అయితే.. ఇప్పుడు ఆమె పేరున ఉన్న మ్యూల్ అకౌంట్ల వల్ల ఆమె మరిన్ని చిక్కుల్లో పడుతోంది. అసలు ఈ సైబర్ మోసం ఎలా జరిగిందో తెలుసుకోండి.
ఎవరైనా ఉద్యోగం ఇస్తామని చెప్పగానే.. చాలా మంది నిరుద్యోగులు ఎట్రాక్ట్ అవుతారు. బెంగళూరులో ఓ యువతి అలాగే కనెక్ట్ అయ్యింది. అయితే.. ఆమె ఏకంగా 7లక్షల రూపాయలు పోగొట్టుకుంది. పైగా.. ఆమె పేరున ఆ సైబర్ నేరగాళ్లు 4 బ్యాంక్ అకౌంట్లను తెరిచారు. వాటిని మ్యూల్ అకౌంట్లుగా వాడుకున్నారు. అవి ఇప్పుడు ఆమెకు తలనొప్పిగా మారాయి.
ఈ కేసుకి సంబంధించిన రిపోర్ట్ బెంగళూరు ఈస్ట్ సీఈఎన్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో నమోదైంది. నిజానికి ఇది ఇప్పుడు జరిగిన కేసు కాదు. రెండేళ్లుగా ఈ తంతు సాగుతోంది. ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న ఓ యువతి.. బెటర్ ఉద్యోగం కోసం వెతకసాగింది. ఆ టైంలో సోషల్ మీడియాలో ఓ అద్భుతమైన జాబ్ ఆఫర్ కనిపించింది. కింద ఓ లింక్ ఇచ్చారు. దాన్ని క్లిక్ చేసింది. వెంటనే ముగ్గురు వ్యక్తులు ఆమెకు కనెక్ట్ అయ్యారు. వారు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫర్ ఇచ్చారు. ఆమెను ఇంటర్వ్యూ చేశారు. మీకు జాబ్ ఇస్తున్నాం అని చెప్పారు. శాలరీ కూడా లక్షల్లో ఆఫర్ చేశారు. దాంతో ఆమె.. ఇంట్లోనే ఉండి పనిచేసుకోవచ్చు.. పైగా లక్షల శాలరీ అని ఆశపడింది.
ఆ తర్వాత ఆ కేటుగాళ్లు ఆమెకు ప్రాసెసింగ్ ఫీజ్ పేరుతో.. అప్పుడప్పుడూ ఆమె నుంచి మనీని తమ బ్యాంక్ అకౌంట్లలోకి ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నారు. వారు రకరకాల ఫీజుల పేర్లు చెప్పి.. ఇలా మనీ లాక్కున్నారు. ఆమె అమాయకురాలిలా.. వారు అడిగిన ఫీజులన్నీ చెల్లించింది. అలా మొత్తం రూ.7లక్షలు కట్టింది. అయినా ఉద్యోగం రాలేదు. చిరాకొచ్చిన ఆమె.. తన డబ్బు వెనక్కి ఇవ్వాలని అడిగింది. అప్పుడు వారు మాట మార్చారు. ఆ డబ్బును స్టాక్ మార్కెట్లో పెట్టామనీ.. వాటి ద్వారా నెలకు రూ.40వేలు ఇస్తామని చెప్పారు. బ్యాంకుల్లో వడ్డీ కంటే ఎక్కువే అనుకున్న ఆమె.. సరే అంది. అలా రెండోసారి మోసపోయింది.
ఆమె పేరు మీద ఆ నేరగాళ్లు.. నాలుగు బ్యాంక్ అకౌంట్లు తెరిపించారు. ఆ అకౌంట్లను పూర్తిగా తమ కంట్రోల్‌లో పెట్టుకున్నారు. వాళ్లు ఆ అకౌంట్లలో ఏం చేస్తున్నారో ఆమెకు తెలియలేదు. అది మరో మోసం. వాళ్లు ఇతరుల్ని మోసం చెయ్యడానికీ, డబ్బు లాగడానికీ.. ఆమె అకౌంట్లను వాడుతూ వచ్చారు. అంటే వాటిని మ్యూల్ అకౌంట్లుగా వాడుతున్నారు.
ఈ విషయం తాజాగా తెలియడంతో.. ఆమె తన డబ్బు తనకు ఇచ్చేయాలని డిమాండ్ చేసింది. వారు ఇవ్వలేదు. దాంతో పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. ఐతే.. ఇప్పుడు ఆమె పేరున ఉన్న మ్యూల్ అకౌంట్ల వల్ల ఆమె చిక్కుల్లో పడుతోంది. ఆ అకౌంట్ల ద్వారా జరిగిన లావాదేవీలకు ఆమె బాధ్యత వహించే పరిస్థితి వచ్చింది. తనకు తెలియకుండానే ఆమె ఈ ఉచ్చులో చిక్కుకుంది.
సైబర్ మోసాల్లో మ్యూల్ ఖాతాల పాత్ర:
మ్యూల్ అకౌంట్లు సైబర్ నేరగాళ్లకు అత్యంత ముఖ్యమైనవి. వాటిని ఉపయోగించి ఫిషింగ్, ఇన్వెస్ట్‌మెంట్ స్కాములు, డిజిటల్ అరెస్ట్ మోసాలకు పాల్పడతారు. బాధితుల నుంచి డబ్బును లాగేందుకు ఈ అకౌంట్లను వాడతారు. వాటిలో డిపాజిట్ చెయ్యమంటారు. డిపాజిట్ చేసిన డబ్బును విత్‌డ్రా చేసుకుంటారు. బాధితులు కంప్లైంట్ ఇస్తే, సైబర్ నేరగాళ్లకు బదులుగా.. బ్యాంక్ అకౌంట్ తెరిచిన వారు బుక్కవుతారు. ఈ కేసులో బాధితురాలు బుక్కవుతుంది. కానీ సైబర్ నేరగాళ్లు తప్పించుకుంటున్నారు. అందువల్ల ఎవరైనా సరే.. తమ పేరున బ్యాంక్ అకౌంట్ తెరిచి.. దాన్ని ఇతరులు ఆపరేట్ చెయ్యాడానికి ఇవ్వకూడదు. అలా ఇస్తే.. చిక్కుల్లో పడినట్లే. ఎవరైనా అలా బుక్కైతే, వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. అలాగే.. బ్యాంక్ అకౌంట్లను క్లోజ్ చేసుకోవాలి.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana













