Last Updated:
ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానం పురస్కరించుకొని టి ఎన్ ఎస్ ఎఫ్, తెలుగు యువత ఆధ్వర్యంలో తిరుపతి నుంచి వారణాసి వరకు సేవా సంకల్ప బైక్ యాత్ర ప్రారంభమైంది. 2500 కిమీ మేర సాగే ఈ యాత్రకు ఎం వి ప్రణవ్ గోపాల్ నేతృత్వం వహిస్తున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని టీడీపీ అనుబంధ సంస్థలైన టీఎన్‌ఎస్‌ఎఫ్, తెలుగు యువత ఆధ్వర్యంలో సేవా సంకల్ప యాత్ర ప్రారంభమైంది. తిరుపతి నుంచి వారణాసి వరకు సుమారు 2,500 కిలోమీటర్ల మేర 25 మంది యువత బైక్ యాత్ర చేపట్టారు. తిరుపతి అలిపిరి గరుడ సర్కిల్ వద్ద టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, తిరుపతి టీడీపీ ఇన్‌చార్జ్ జేబీ శ్రీనివాసులు, ఇతర కూటమి నాయకులు పాల్గొని యాత్రను ప్రారంభించారు.
టీడీపీ జాతీయ వర్కింగ్ అధ్యక్షులు, మంత్రి నారా లోకేష్ సూచనలతో ఈ యాత్రను నిర్వహిస్తున్నట్లు వీఎంఆర్‌డీఏ చైర్మన్, టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి. ప్రణవ్ గోపాల్ తెలిపారు. సెప్టెంబర్ 30న ప్రారంభమైన ఈ యాత్ర అక్టోబర్ 8న వారణాసికి చేరుకుంటుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ మీదుగా బైక్ యాత్ర సాగనుంది.
యాత్రలో భాగంగా మార్గమధ్యంలో పలు ప్రముఖ ఆలయాలను దర్శించనున్నట్లు ప్రణవ్ గోపాల్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్ల ప్రస్థానం సందర్భంగా ఈ సేవా సంకల్ప యాత్ర చేపట్టినట్లు పేర్కొన్నారు. దేశ అభివృద్ధి, సుపరిపాలన, ఆర్థిక ప్రగతి, మౌలిక వసతుల విస్తరణలో ప్రధాని చేస్తున్న కృషి కొనసాగాలని ఆకాంక్షించారు.
తిరుపతి నుంచి బయల్దేరిన బైక్ యాత్ర కాళహస్తికి చేరుకోగా.. స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి యాత్రలో పాల్గొన్న యువతకు ఘన స్వాగతం పలికారు. అనంతరం శ్రీకాళహస్తీశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి యాత్ర ముందుకు సాగి కావలికి చేరుకుంది.
ఇక గురువారం సాయంత్రానికి బైక్ యాత్ర విజయవాడకు చేరుకుంటుందని నిర్వాహకులు తెలిపారు. అనంతరం తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మీదుగా ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి యాత్ర కొనసాగనుంది. మొత్తం 2,500 కిలోమీటర్ల ప్రయాణాన్ని పూర్తి చేసి అక్టోబర్ 8న కాశీ చేరుకోవాలని నిర్వాహకులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
25 మంది యువతతో సాగుతున్న ఈ యాత్రకు వీఎంఆర్‌డీఏ చైర్మన్, టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి. ప్రణవ్ గోపాల్ నేతృత్వం వహిస్తున్నారు. తిరుపతిలో ప్రారంభమైన యాత్రకు టీడీపీ, కూటమి నాయకులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. మార్గమధ్యంలోని పలు ప్రాంతాల్లో యాత్రకు స్వాగత కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.














