గుప్తనిధుల పేరుతో భారీ మోసాలు.. అంతా నకిలీవే
హైదరాబాద్: ఇళ్ల కింద గుప్త నిధులు ఉన్నాయంటూ అమాయకులను మోసం చేస్తున్న ముఠాను హైదరాబాద్ కమిషనర్ టాస్క్ఫోర్స్ షామ్షాబాద్ జోన్, రాజేంద్రనగర్ పోలీసులు పట్టుకున్నారు. నిందితులు మహ్మద్ మునావర్ అలియాస్ మున్నా (36), సయ్యద్ అలీ అష్రఫ్ (40), మహ్మద్ హాజీ (25), మహ్మద్ సల్మాన్ (29)గా గుర్తించారు. వీరి నుంచి రెండు కార్లు, ఆటో, రెండు బైక్లు, నాలుగు సెల్ఫోన్లు, 25 నకిలీ బంగారు నాణేలు, 6 కిలోల బొగ్గు, 4 కిలోల మట్టి, పూజా సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. బొగ్గును బంగారంగా మారుస్తామని చెప్పి మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. 11 మందిని మోసం చేసి సుమారు రూ.కోటి కొల్లగొట్టినట్లు, రాజేంద్రనగర్ పీఎస్లో క్రైం నంబర్ 916/2026 కింద కేసు నమోదైనట్లు వెల్లడించారు. ప్రజలు గుప్తనిధుల పేరుతో మోసాలకు గురికావద్దని పోలీసులు హెచ్చరించారు.













