Byju’s: అసలు ఏంటి బైజూ రవీంద్రన్ కేసు.. ఇంత వరకు ఎంత మంది అరెస్ట్ చేశారు? | | ACTPnews

News18


Last Updated:

బైజూ రవీంద్రన్ ఒకప్పుడు భారత విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన వ్యాపారవేత్తగా గుర్తింపు పొందారు. ఉపాధ్యాయుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన, 2015లో బైజూస్ లెర్నింగ్ యాప్‌ను ప్రారంభించారు.

News18
News18

ఒకప్పుడు భారత స్టార్టప్ ప్రపంచంలో సంచలనం సృష్టించిన ఎడ్టెక్ సంస్థ బైజూస్ వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్ ఇప్పుడు తీవ్రమైన న్యాయపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. సింగపూర్ కోర్టు ఆయనకు ఆరు నెలల జైలు శిక్ష విధించడం అంతర్జాతీయ వ్యాపార వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. కోర్టు ఆదేశాలను పదేపదే ఉల్లంఘించడం, ఆస్తుల వివరాలను వెల్లడించకపోవడం కారణంగా ఈ శిక్ష పడినట్లు సమాచారం. అదనంగా ఆయనపై సుమారు 90 వేల సింగపూర్ డాలర్ల జరిమానా కూడా విధించింది. వెంటనే అధికారులకు లొంగిపోవాలని కోర్టు ఆదేశించినట్లు తెలుస్తోంది.

బైజూ రవీంద్రన్ ఒకప్పుడు భారత విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన వ్యాపారవేత్తగా గుర్తింపు పొందారు. ఉపాధ్యాయుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన, 2015లో బైజూస్ లెర్నింగ్ యాప్‌ను ప్రారంభించారు. తక్కువ కాలంలోనే ఈ సంస్థ దేశంలో అత్యంత విలువైన స్టార్టప్‌లలో ఒకటిగా ఎదిగింది. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులను ఆకర్షిస్తూ కంపెనీ విలువ 22 బిలియన్ డాలర్ల వరకు చేరింది. అయితే వేగవంతమైన విస్తరణ, ఆర్థిక నిర్వహణలో లోపాలు, పాలనా సమస్యలు సంస్థ పతనానికి దారితీశాయి.

ప్రస్తుతం బైజూస్ సంస్థ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని దివాలా పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఉద్యోగుల తొలగింపులు, పెట్టుబడిదారులతో వివాదాలు, పలు దేశాల్లో న్యాయపరమైన కేసులు కంపెనీ పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చాయి. ఒకప్పుడు బిలియనీర్‌గా గుర్తింపు పొందిన బైజూ రవీంద్రన్ ఆస్తుల విలువ కూడా భారీగా తగ్గినట్లు అంతర్జాతీయ నివేదికలు సూచిస్తున్నాయి.

సింగపూర్‌లో నమోదైన తాజా కేసు వెనుక పెట్టుబడిదారుల డబ్బు రికవరీ ప్రయత్నాలే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. ఖతార్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీకి చెందిన అనుబంధ సంస్థ ఖతార్ హోల్డింగ్స్ ఈ కేసును ముందుకు తీసుకెళ్లింది. బైజూ రవీంద్రన్ తన ఆస్తుల వివరాలను వెల్లడించాలని 2024 ఏప్రిల్ నుంచి కోర్టు పలుమార్లు ఆదేశించినప్పటికీ ఆయన పూర్తిగా సహకరించలేదని కోర్టు అభిప్రాయపడింది.

ప్రత్యేకంగా సింగపూర్‌కు చెందిన బీ ఇయార్ ఇన్వెస్ట్‌కో సంస్థలో తన యాజమాన్యాన్ని నిరూపించే పత్రాలను సమర్పించడంలో విఫలమయ్యారని ఆరోపణలు ఉన్నాయి. అప్పుదారుల నుంచి ఆస్తులను దాచిపెట్టే ప్రయత్నం జరిగిందని కోర్టు భావించినట్లు తెలుస్తోంది.

ఇక అమెరికాలో కూడా బైజూ రవీంద్రన్‌పై భారీ రుణ వివాదం కొనసాగుతోంది. 1.2 బిలియన్ డాలర్ల టర్మ్ లోన్ వ్యవహారంలో అమెరికా కోర్టు ఆయనను డిఫాల్టర్‌గా ప్రకటించినట్లు సమాచారం. న్యాయ ప్రక్రియకు ఆటంకం కలిగించడం, నిధుల వినియోగంపై స్పష్టత ఇవ్వకపోవడం వంటి కారణాలతో అక్కడ కూడా భారీ మొత్తంలో చెల్లింపులు చేయాలని ఆదేశాలు వెలువడ్డాయి.

భారతదేశంలో కూడా బైజూస్‌పై విచారణలు కొనసాగుతున్నాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విదేశీ మారక చట్ట ఉల్లంఘనలపై దర్యాప్తు చేస్తోంది. ముంబై ఈఓడబ్ల్యూ నమోదుచేసిన కేసుల్లో బైజూ రవీంద్రన్, ఆయన సోదరుడు రిజు రవీంద్రన్, భార్య దివ్య గోకుల్‌నాథ్ పేర్లు ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదు. ప్రస్తుతం బైజూ కుటుంబ సభ్యులు దుబాయ్‌లో ఉన్నట్లు సమాచారం.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports