Last Updated:
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వద్ద ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా సుదీర్ఘకాలం పనిచేసి, దర్శకత్వ మెళకువలు నేర్చుకున్న మంగా శ్రీనివాస్ మెగాఫోన్ పట్టిన తొలి చిత్రం ‘చకోర’ (Chakkora). శ్రవణ్, మలైకా టి. వాసుపల్ జంటగా నటించిన ఈ ఫీల్ గుడ్ లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వద్ద ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా సుదీర్ఘకాలం పనిచేసి, దర్శకత్వ మెళకువలు నేర్చుకున్న మంగా శ్రీనివాస్ మెగాఫోన్ పట్టిన తొలి చిత్రం ‘చకోర’ (Chakkora). శ్రవణ్, మలైకా టి. వాసుపల్ జంటగా నటించిన ఈ ఫీల్ గుడ్ లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ నేడు (అక్టోబర్ 9, 2026) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. డా. చింతాడ హేమారావు నిర్మించిన ఈ కవితాత్మక చిత్రాన్ని శ్రీలక్ష్మీ పిక్చర్స్ పతాకంపై బాపిరాజు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ‘లూనార్ లవ్ బర్డ్’ అనే ట్యాగ్‌లైన్‌తో స్వచ్ఛమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రం, నేటి యువతను, కుటుంబ ప్రేక్షకులను ఏ మేర ఆకట్టుకుంది అనేది ఇప్పుడు చూద్దాం.
‘చకోర’ పక్షికి ఓ ప్రత్యేకత ఉంది.. అది కేవలం వెన్నెలను మాత్రమే ఆస్వాదిస్తూ జీవిస్తుందని పురాణాలు చెబుతాయి. ఈ కవితాత్మకమైన అంశాన్నే దర్శకుడు మంగా శ్రీనివాస్ తన కథకు ఆత్మగా మలుచుకున్నారు. చిన్నప్పటి నుంచి తల్లి చూపించే చందమామ కథలు వింటూ పెరిగిన ఓ యువకుడు, తన జీవితంలో ప్రేమను, తాను చేరుకోవాల్సిన గమ్యాన్ని ఆ చకోర పక్షి తరహాలోనే ఎంత స్వచ్ఛంగా ఆరాధించాడు? ఆ ప్రయాణంలో అతనికి ఎదురైన సవాళ్లు ఏమిటి? అనే ఇతివృత్తంతో ఈ కథను తీర్చిదిద్దారు. ఇద్దరు స్నేహితుల మధ్య జరిగే సంభాషణతో ప్రారంభమయ్యే ఈ చిత్రం, ఆ తర్వాత భావోద్వేగాల ప్రయాణంగా మారుతుంది. తన ప్రాణంగా భావించిన అమ్మాయి అనుకోకుండా దూరమవ్వడం, ఆమెను దక్కించుకోవడానికి హీరో చేసే పోరాటం, అతడి అచంచలమైన విశ్వాసం ఈ సినిమాకు మూలస్తంభాలు.
నూతన నటీనటులైనప్పటికీ శ్రవణ్, మలైకా తమ పాత్రల్లో అద్భుతంగా ఒదిగిపోయారు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో శ్రవణ్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సీనియర్ నటులు సుమన్, ఎల్.బి. శ్రీరామ్ తమ సుదీర్ఘ అనుభవంతో సినిమాకు నిండుదనాన్ని తీసుకురాగా, బ్రహ్మాజీ, ఇంద్రజ తమ పరిధి మేరకు ఉత్తమ ప్రదర్శన కనబరిచారు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. ప్రిన్స్ హెన్రీ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం కథలోని ఫీల్‌ను ఎలివేట్ చేశాయి. రుప్ప గోపీకృష్ణ సినిమాటోగ్రఫీ ప్రతి ఫ్రేమ్‌ను ఒక అందమైన దృశ్యకావ్యంలా ఆహ్లాదకరంగా చూపించింది. సీనియర్ ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్ తన కత్తెరకు మరింత పదును పెట్టి ఉంటే సెకండాఫ్‌లో నెమ్మదించిన కథనం మరింత ఆసక్తికరంగా మారేది.
నేడు ఉదయం ఆటల నుంచే సినిమాకు పాజిటివ్ మౌత్ టాక్ వస్తోంది. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాలు, తల్లికొడుకుల మధ్య వచ్చే మదర్ సెంటిమెంట్ సీన్స్ కంటతడి పెట్టిస్తాయని థియేటర్ల వద్ద ప్రేక్షకులు చెబుతున్నారు. పూరి జగన్నాథ్ స్కూల్ నుంచి వచ్చినప్పటికీ, కమర్షియల్ మాస్ మసాలాకు భిన్నంగా ఒక స్వచ్ఛమైన ప్రేమకావ్యాన్ని తెరకెక్కించడంలో దర్శకుడు సఫలమయ్యారు. కొన్ని చోట్ల స్క్రీన్‌ప్లే కాస్త నెమ్మదించినా, స్వచ్ఛమైన ప్రేమకథలను, భావోద్వేగాలను ఇష్టపడే వారికి ‘చకోర’ ఒక మంచి అనుభూతి ఇస్తుంది.
రేటింగ్ : 2.75














