Last Updated:
CJP Protest: కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ముందస్తుగా అదుపులోకి తీసుకున్న కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ముఖ్య నాయకులు అభిజీత్ దిప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను ఢిల్లీ పోలీసులు ఆదివారం విడుదల చేశారు.
శనివారం ముంబై నుంచి ఢిల్లీ చేరుకున్న ఎయిర్ ఇండియా విమానం ల్యాండ్ అయిన వెంటనే పోలీసులు వీరి ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని ఢిల్లీ కంటోన్మెంట్‌లోని ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా, న్యాయస్థానం వారి విడుదలకు ఆదేశాలు జారీ చేసింది. ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలతో అభిజీత్, సౌరవ్, అశుతోష్‌లు విడుదలయ్యారని సీజేపీ న్యాయ విభాగం అధిపతి రత్న సింగ్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ధ్రువీకరించారు.
శనివారం విమానాశ్రయంలో చోటుచేసుకున్న పరిణామాలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ముంబై నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం ఢిల్లీలో దిగగానే, మహిళా సిబ్బందితో కూడిన ఢిల్లీ పోలీసు బృందం నేరుగా విమానంలోకి ప్రవేశించి ఈ ముగ్గురు నాయకులను అదుపులోకి తీసుకునేందుకు యత్నించింది. ఆ సమయంలో తోటి ప్రయాణికుల ముందే పోలీసులతో వాగ్వాదం జరిగింది. “నేను అరెస్ట్ కావడానికే ఢిల్లీ వచ్చాను” అని అభిజీత్ దిప్కే పోలీసు అధికారులతో అనడం తాలూకు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో జంతర్ మంతర్ వద్ద సీజేపీ తలపెట్టిన నిరసనకు ఢిల్లీ పోలీసులు భద్రత, శాంతిభద్రతల దృష్ట్యా అనుమతి నిరాకరించారు. ఈ నేపథ్యంలోనే ముందస్తు అరెస్టులు చేపట్టారు.
ఈ నిరసనకు ముందే గురుగ్రామ్‌లోని తన నివాసంలో అదుపులోకి తీసుకున్న ప్రముఖ యూట్యూబర్, ఇన్‌ఫ్లుయెన్సర్ ధ్రువ్ రాఠీని సైతం ఆదివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో పోలీసులు విడుదల చేశారు. రాజధానిలో భారీ ఆందోళనలు జరగకుండా నిరోధించేందుకు పోలీసులు విస్తృత స్థాయిలో చేపట్టిన ముందస్తు చర్యల్లో భాగంగానే ఈ నిర్బంధాలు జరిగాయి.
నాయకుల నిర్బంధాలు కొనసాగినప్పటికీ, సీఈసీ రాజీనామా డిమాండ్‌పై వెనక్కి తగ్గేది లేదని సీజేపీ స్పష్టం చేసింది. ఆదివారం ఉదయం 10 గంటలకు జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన ప్రదర్శన చేపట్టాలని తమ శ్రేణులకు కొత్తగా పిలుపునిచ్చింది. ఓటర్ల జాబితాలోని అవకతవకలకు వ్యతిరేకంగా ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA), సీజేపీలు తమ మద్దతుదారులను సమీకరిస్తున్నాయి. శనివారం నగరంలో ప్రదర్శనలు జరగకుండా నిలువరించేందుకు ఢిల్లీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు 3,000 మందికి పైగా నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో అత్యధికులను ఇప్పటికే విడుదల చేసినప్పటికీ, తాజా పిలుపుతో దేశ రాజధానిలో భద్రతా బలగాలు మరోసారి అప్రమత్తమయ్యాయి.














