CM Chandrababu: ‘కాశీ దేశానికి గొప్ప నాయకుడిని ఇచ్చింది’.. మోదీ పుట్టినరోజున సీఎం చంద్రబాబు ప్రశంసల జల్లు | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews

CM Chandrababu: 'కాశీ దేశానికి గొప్ప నాయకుడిని ఇచ్చింది'.. మోదీ పుట్టినరోజున సీఎం చంద్రబాబు ప్రశంసల జల్లు | ఆంధ్రప్రదేశ్ వార్తలు


Last Updated:

ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వారణాసిలో పర్యటించారు. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, యూపీ సీఎం యోగితో కలిసి కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు, హవనంలో పాల్గొన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారణాసికి వెళ్లారు. అక్కడ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి చంద్రబాబు కాశీ విశ్వనాథుడి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మోదీ ఆయురారోగ్యాలతో ఉండాలని కాంక్షిస్తూ వారణాసిలో నిర్వహించిన ప్రత్యేక హవనంలో ఈ అగ్రనేతలంతా పాలుపంచుకున్నారు.

పూజా కార్యక్రమాల అనంతరం వారణాసిలోని ప్రతిష్టాత్మక రుద్రాక్ష్ కన్వెన్షన్ సెంటర్‌లో వారణాసి-వాద్‌నగర్ సేవా సంకల్ప్ అభియాన్ (సేవాయాత్ర) కార్యక్రమం జరిగింది. రాజ్‌నాథ్ సింగ్, యోగి ఆదిత్యనాథ్, చిరాగ్ పాశ్వాన్ సైతం హాజరైన ఈ వేదికపై నుంచి సీఎం చంద్రబాబు ప్రసంగించారు. కేవలం ప్రధాని మోదీ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకే తాను వారణాసికి వచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు. మోదీ బాల్యంలో ఎన్నో కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నారని, అయితే ఆ అడ్డంకులు ఏవీ ఆయన ఎదుగుదలను అడ్డుకోలేకపోయాయని చంద్రబాబు ప్రశంసించారు.

ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన సజీవ నగరం కాశీ అని, ఈ రోజు ఒక చారిత్రాత్మక దినమని చంద్రబాబు అభివర్ణించారు. వారణాసి నగరం ప్రధాని మోదీకి కర్మభూమిగా మారిందని ఆయన కొనియాడారు. ఈ పవిత్ర గడ్డపై నుంచి మోదీ దేశానికి దిశా నిర్దేశం చేస్తున్నారని తెలిపారు. ఒక సామాన్య నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి ప్రపంచస్థాయి నాయకుడిగా ఎదగడం వెనుక అలుపెరగని కృషితో పాటు ఆయన దార్శనికత కూడా ఉందన్నారు.

వారణాసి ప్రజలు 2014, 2019, 2024 ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు మోదీని గెలిపించి పార్లమెంట్‌కు పంపారని చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. కాశీ ప్రజలు కేవలం వారణాసికి ఒక నాయకుడిని ఎన్నుకోలేదని, యావత్ దేశానికి ఒక గొప్ప నాయకుడిని అందించారని కొనియాడారు. మోదీని ఎన్నుకున్నందుకు కాశీ ప్రజలను చూసి తామంతా గర్విస్తున్నామని చెప్పారు. మోదీ అద్భుతమైన విజన్ ఉన్న నాయకుడని, భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు ఆయన ఎంతో కృషి చేస్తున్నారని, మనమంతా ఆయనకు పూర్తి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు.

కరోనా విపత్కర పరిస్థితులను మోదీ ఎదుర్కొన్న తీరును చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. కోవిడ్ సమయంలో ప్రపంచమంతా తీవ్ర భయాందోళనల్లో (పానిక్) ఉన్నప్పుడు, మోదీ ముందుండి దేశాన్ని నడిపించారని గుర్తుచేశారు. ఆయన నాయకత్వంలో దేశవ్యాప్తంగా 200 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేయడమే కాకుండా, ఇతర దేశాలకు సైతం ఉచితంగా వ్యాక్సిన్లు సరఫరా చేసి ఆదుకున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports