Last Updated:
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత పారా అథ్లెట్, మాజీ సైనికుడు సోమన్ రాణా అద్భుతం సృష్టించాడు. దేశ రక్షణలో కాలు కోల్పోయినా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా, షాట్‌పుట్ F57 విభాగంలో స్వర్ణ పతకం సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచాడు.
గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్‌కు మరో అద్భుతమైన పసిడి పతకం దక్కింది. పారా అథ్లెటిక్స్ పురుషుల షాట్‌పుట్ F57 విభాగంలో దేశానికి ప్రాతినిధ్యం వహించిన మాజీ సైనికుడు సోమన్ రాణా ఏకంగా స్వర్ణం కొల్లగొట్టి చరిత్ర సృష్టించాడు. ఫైనల్స్‌లో తన రెండో ప్రయత్నంలోనే 13.40 మీటర్ల దూరం ఇనుప గుండును విసిరి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. ఇదే ఈవెంట్లో మరో భారత క్రీడాకారుడు శుభమ్ జుయాల్ రజతం సాధించడంతో పతకాల వేదికపై డబుల్ ధమాకా కనిపించింది.
ఒకప్పుడు బాక్సింగ్ రింగ్‌లో ప్రత్యర్థులపై పంచ్‌లు విసిరిన సోమన్, దేశ రక్షణ కోసం పోరాడుతూ ఒక కాలు కోల్పోయాడు. కాలు కోల్పోయినప్పటికీ తన లక్ష్యాన్ని వదిలిపెట్టకుండా, బాక్సింగ్ పవర్‌ను షాట్పుట్పై పెట్టి ఈ అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా పట్టుదల ఉంటే గమ్యాన్ని చేరుకోవచ్చని సోమన్ తన విజయంతో ప్రపంచానికి చాటిచెప్పాడు.
న్యూస్18 హిందీ కథనం ప్రకారం.. బీహార్‌లో పుట్టిన సోమన్ రాణా, భారత సైన్యంలో గూర్ఖా రైఫిల్స్‌లో చేరి జాతీయ స్థాయి బాక్సర్‌గా ఎదిగాడు. 2006 డిసెంబర్లో జమ్మూ కాశ్మీర్ పూంచ్ సెక్టార్లో జరిగిన ఆర్మీ సెర్చ్ ఆపరేషన్‌లో పాల్గొన్నాడు. అక్కడ ప్రమాదవశాత్తూ ఒక ల్యాండ్‌మైన్‌పై కాలు వేయడంతో జరిగిన భారీ పేలుడులో అతడి కుడి కాలు మోకాలి కింద వరకు తీసేయాల్సి వచ్చింది. దీంతో క్షణాల్లోనే బాక్సింగ్ కెరీర్ ముగిసిపోయింది.
కృత్రిమ అవయవంతో కోలుకున్న తర్వాత సుమారు పదేళ్ల పాటు సైన్యంలో అడ్మినిస్ట్రేటివ్ బాధ్యతలు నిర్వహించాడు. ఇక ఆటల జీవితం ముగిసిపోయిందని భావించిన దశలో, 2017లో కల్నల్ గౌరవ్ దత్తా అతడిని పుణెలోని ఆర్మీ పారాలింపిక్ నోడ్‌కు పరిచయం చేశారు. బాక్సింగ్‌లో తాను నేర్చుకున్న శారీరక బలం, బ్యాలెన్స్ షాట్‌పుట్‌లో ఉపయోగపడుతుందని గ్రహించి పారా షాట్‌పుట్‌ను ఎంచుకున్నాడు. కూర్చుని విసిరే F57 విభాగంలో కఠోర సాధన చేశాడు.
పారా అథ్లెటిక్స్‌లోకి ప్రవేశించాక సోమన్ వెనుతిరిగి చూడలేదు. 2021 ట్యూనిస్ వరల్డ్ గ్రాండ్‌ప్రిక్స్‌లో స్వర్ణం, 2022 ఆసియా పారా గేమ్స్‌లో రజతం గెలిచాడు. టోక్యో, పారిస్ పారాలింపిక్స్‌లో తృటిలో పతకాలు చేజార్చుకున్నా.. 2025 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో 14.69 మీటర్ల అత్యుత్తమ త్రోతో కాంస్యం సాధించాడు. ఇప్పుడు 2026 కామన్వెల్త్ గేమ్స్‌లో ఏకంగా స్వర్ణం సాధించి ఎందరికో ఆదర్శంగా నిలిచాడు.
లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్, మ్యాచ్ అప్డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి
Hyderabad,Telangana














