Crime News: యువతిపై ఆరుగురి సామూహిక అత్యాచారం.. వీడియో వైరల్ చేస్తామని బెదిరింపులు.. చివరికి! | | ACTPnews

News18


Last Updated:

ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో దారుణం జరిగింది. ముగ్గురు మైనర్లతో సహా ఆరుగురు యువకులు ఓ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడి వీడియో తీశారు. దాన్ని బయటపెడతామని బెదిరించడంతో మనస్తాపానికి గురైన బాధితురాలు ఎలుకల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది.

News18
News18

ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలో అత్యంత పాశవిక ఘటన వెలుగుచూసింది. గుర్సరాయ్ ప్రాంతంలోని ఇండి గ్రామంలో 19 ఏళ్ల యువతిపై ముగ్గురు మైనర్లతో సహా ఆరుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆదివారం నుంచే నిందితులు బాధితురాలిని వేధిస్తుండటంతో ఆమె తండ్రి నిందితుల కుటుంబ సభ్యులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ వారి ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. సోమవారం మధ్యాహ్నం ఆ యువతి పని నిమిత్తం పశువుల పాక వద్దకు వెళ్లినప్పుడు ఆరుగురు కామాంధులు ఆమెను అడ్డగించి సామూహిక అత్యాచారం చేశారు.

అంతటితో ఆగకుండా ఆ దారుణాన్ని సెల్‌ఫోన్‌లో వీడియో తీశారు. ఈ విషయం ఎవరికైనా చెబితే వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని తీవ్రంగా బెదిరించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాధితురాలు అవమాన భారంతో ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది.

కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే గుర్సరాయ్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఆరోగ్యం కాస్త కుదుటపడటంతో ఇంటికి తీసుకెళ్లారు. అయితే అర్ధరాత్రి సమయంలో ఆమె పరిస్థితి మళ్లీ విషమించింది. మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

న్యూస్18 ఇంగ్లీష్ కథనం ప్రకారం.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సుశీల్, అజయ్, గుల్లు, ఛోటూ, కృష్ణ అనే ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ఆరువ నిందితుడి కోసం గాలిస్తున్నారు. భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 70 కింద గ్యాంగ్ రేప్ కేసు నమోదు చేసినట్లు ఝాన్సీ ఎస్ఎస్పీ వికాస్ కుమార్ తెలిపారు. ప్రధాన నిందితుడు సుశీల్‌కు బాధితురాలితో గత కొంతకాలంగా పరిచయం ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

మరోవైపు ఈ దారుణ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) సుమోటోగా కేసు నమోదు చేసింది. రెండు వారాల్లోగా పూర్తి నివేదిక సమర్పించాలని ఝాన్సీ జిల్లా మేజిస్ట్రేట్, ఎస్ఎస్పీలకు నోటీసులు జారీ చేసింది. కేసు దర్యాప్తు వివరాలతో పాటు బాధితురాలి కుటుంబానికి అందించిన పరిహారం గురించి తెలియజేయాలని ఆదేశించింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports