Last Updated:
ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ 2027 సీజన్ నుంచి తమ కొత్త హెడ్ కోచ్‌గా టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్‌ను అధికారికంగా ప్రకటించింది.
గత 18 ఏళ్లుగా చెన్నై సూపర్ కింగ్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన స్టీఫెన్ ఫ్లెమింగ్ స్థానంలో ఇప్పుడు జహీర్ ఖాన్ బాధ్యతలు చేపట్టనున్నాడు. జూలైలో ఫ్లెమింగ్ తన పదవి నుంచి తప్పుకోవడంతో సీఎస్‌కే యాజమాన్యం జహీర్‌ను ఎంపిక చేసింది. 2008లో కెప్లర్ వెసెల్స్, ఆ తర్వాత ఫ్లెమింగ్ తర్వాత చెన్నై జట్టుకు ప్రధాన కోచ్‌గా వ్యవహరించనున్న మూడో వ్యక్తి జహీర్ ఖాన్ కావడం విశేషం. ఫ్లెమింగ్ ఆధ్వర్యంలో చెన్నై ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్స్ గెలిచినా, గత మూడు సీజన్లలో జట్టు ప్రదర్శన దారుణంగా పడిపోయింది. ప్లేఆఫ్స్‌కు కూడా చేరలేకపోయిన సీఎస్‌కే పాయింట్ల పట్టికలో ఎనిమిది, పది స్థానాలకు పరిమితమైంది.
దీంతో జట్టు ప్రక్షాళనలో భాగంగా ఫ్రాంచైజీ ఈ కీలక మార్పు చేసింది. యువ ఆటగాళ్లను ప్రోత్సహించడంలో జహీర్‌కు ఉన్న అపార అనుభవం తమ జట్టును మళ్లీ విజయాల బాట పట్టిస్తుందని సీఎస్‌కే యజమాని రూపా గురునాథ్ ధీమా వ్యక్తం చేశారు.
జహీర్ ఖాన్‌కు ఐపీఎల్‌లో కోచ్‌గా, మెంటార్‌గా పనిచేసిన అపార అనుభవం ఉంది. 2018 నుంచి 2022 వరకు ముంబై ఇండియన్స్‌కు క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్‌గా సేవలందించాడు. అలాగే 2025లో లక్నో సూపర్ జెయింట్స్‌కు మెంటార్‌గా వ్యవహరించాడు. ఇన్నాళ్లు బౌలర్లకు దిశానిర్దేశం చేసిన జహీర్, ఇప్పుడు పూర్తిస్థాయి హెడ్ కోచ్‌గా చెన్నై జట్టును ఎలా నడిపిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. జట్టులో కీలక ఆటగాడైన ఎంఎస్ ధోనీతో జహీర్‌కు ఉన్న స్నేహబంధం అతనికి బాగా కలిసిరానుంది. వ్యూహాలు రచించడంలో జహీర్ దిట్ట అని, అతను తమ కుటుంబంలో చేరడం సంతోషంగా ఉందని సీఎస్‌కే సీఈవో కేఎస్ విశ్వనాథన్ పేర్కొన్నారు.
చెన్నై సూపర్ కింగ్స్ లాంటి ప్రతిష్టాత్మక జట్టులో భాగం కావడం తనకు దక్కిన గొప్ప గౌరవంగా జహీర్ ఖాన్ అభివర్ణించాడు. గతంలో మైదానంలో సీఎస్‌కేతో ఎన్నోసార్లు తలపడ్డానని, చేపాక్ స్టేడియంలో అభిమానుల సందడి అద్భుతంగా ఉంటుందని పేర్కొన్నాడు. ఐపీఎల్ 2027 వేలంలో చెన్నై జట్టుకు అవసరమైన కీలక ఆటగాళ్లను ఎంపిక చేయడమే జహీర్ ముందున్న తొలి లక్ష్యం. తన ఆధునిక వ్యూహాలతో చెన్నై టీమ్‌లో కొత్త మార్పులు తీసుకొచ్చి, మళ్లీ పాత వైభవం తీసుకువస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.














