Last Updated:
ప్రిన్స్ ఆఫ్ కలకత్తా సౌరవ్ గంగూలీ బయోపిక్ అప్డేట్ వచ్చేసింది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. విడుదల చేసిన కాసేపట్లోనే ఈ పోస్టర్ వైరల్ అయింది.
మైదానంలో అగ్రెసివ్ కెప్టెన్సీకి మారుపేరుగా నిలిచిన మన ‘బెంగాల్ టైగర్’, ప్రిన్స్ ఆఫ్ కలకత్తా సౌరవ్ గంగూలీ బయోపిక్ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదా అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. నేడు గంగూలీ 54వ పుట్టినరోజు సందర్భంగా తాజాగా ఈ సినిమా నుంచి కీలక అప్ డేట్ బయటకొచ్చింది. ‘దాదా: ది సౌరవ్ గంగూలీ స్టోరీ’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను అధికారికంగా విడుదల చేశారు. ఈ బయోపిక్‌లో సౌరవ్ గంగూలీ పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటుడు, జాతీయ అవార్డు గ్రహీత రాజ్ కుమార్ రావు నటిస్తున్నారు.
రాజ్‌కుమార్ రావు తన సోషల్ మీడియా వేదికగా ఈ పోస్టర్‌ను షేర్ చేస్తూ గంగూలీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. క్రికెట్ అభిమానులకు గూస్బంప్స్ తెప్పించేలా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను డిజైన్ చేశారు. 2002 జూలై 13న ఇంగ్లాండ్‌లోని ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో నాట్‌వెస్ట్ ట్రోఫీ ఫైనల్ గెలిచిన ఆనందంలో గంగూలీ బాల్కనీలో తన చొక్కా విప్పి గాల్లో గిరగిరా తిప్పిన ఐకానిక్ సీన్‌ను రాజ్‌కుమార్ రావు ఈ పోస్టర్లో పునఃసృష్టించారు. ఆయన వెనుక భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడుతుండగా.. “ఆయన ఆట ఆడటమే కాదు.. ఆటనే మార్చేశాడు” అనే ట్యాగ్‌లైన్ అందరినీ ఆకట్టుకుంటోంది. వాంఖడే స్టేడియంలో ఆండ్రూ ఫ్లింటాఫ్ చేసిన పనికి, లార్డ్స్ గడ్డపై గంగూలీ ఇచ్చిన ఆ గట్టి కౌంటర్ క్రికెట్ చరిత్రలో ఒక ఎపిక్ మూమెంట్‌గా మిగిలిపోయింది.
‘దాదా’ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు పొందిన దర్శకుడు విక్రమాదిత్య మోత్వానే దర్శకత్వం వహిస్తున్నారు. లవ్ ఫిల్మ్స్ పతాకంపై లవ్ రంజన్, అంకుర్ గార్గ్ భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సౌరవ్ గంగూలీకి ఎనలేని అండగా నిలిచిన ఆయన భార్య డోనా గంగూలీ పాత్రలో యువ నటి తాన్యా మానిక్తాలా నటిస్తున్నారు. రాజ్‌కుమార్ రావు గంగూలీ బాడీ లాంగ్వేజ్‌ను, ఆయన బ్యాటింగ్ స్టైల్‌ను పట్టుకోవడానికి ప్రత్యేకంగా క్రికెట్ శిక్షణ కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రీడా నేపథ్య చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవి కానుకగా మే 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
కెప్టెన్‌గా భారత క్రికెట్ రూపురేఖలను మార్చిన ఘనత గంగూలీకే దక్కుతుంది. వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, జహీర్ ఖాన్ వంటి యువ ఆటగాళ్లను ప్రోత్సహించి ఒక బలమైన మ్యాచ్ విన్నింగ్ టీమ్‌ను తయారు చేయడమే కాకుండా, విదేశీ గడ్డపై కూడా భారత్ సిరీస్‌లు గెలవగలదు అనే నమ్మకాన్ని జట్టులో నాటాడు. వన్డే ఫార్మాట్లో 311 మ్యాచ్‌లు ఆడి 11,363 పరుగులు, 113 టెస్ట్ మ్యాచ్‌లలో 7,212 పరుగులు సాధించాడు. 2003 వన్డే ప్రపంచకప్‌లో జట్టును ఫైనల్ వరకు చేర్చిన ఆయన సేవలకు గానూ భారత ప్రభుత్వం 2004లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. 2012లో అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకున్న అనంతరం బీసీసీఐ అధ్యక్షుడిగా కూడా విజయవంతంగా తన బాధ్యతలు నిర్వర్తించాడు. క్రికెటర్‌గా, కెప్టెన్‌గా ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూసిన ఆయన జీవితం వెండితెరపై ఎలా ఆవిష్కృతం కానుందో చూడాలని క్రీడాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana













