Last Updated:
నటుడు, నిర్మాత జాకీ భగ్నానీ పేరుతో డేటింగ్ యాప్‌లో ప్రొఫైల్ ఉందంటూ సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది. ఈ వార్తల మధ్య గతంలో ఆయన చేసిన ‘సిట్యుయేషన్‌షిప్’ వ్యాఖ్యలు మరోసారి వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. అయితే ఈసారి ఆయన సినీ ప్రాజెక్టుల వల్ల కాకుండా, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ వార్త కారణంగా నెట్టింట చర్చనీయాంశంగా నిలిచారు. వివాహం చేసుకుని కుటుంబ జీవితాన్ని కొనసాగిస్తున్న జాకీ భగ్నానీ, ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ భర్త అయినప్పటికీ, ఆయన ఓ ప్రత్యేక డేటింగ్ యాప్‌లో ఖాతా కలిగి ఉన్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఇటీవల ఓ రెడ్డిట్ యూజర్ షేర్ చేసిన స్క్రీన్ షాట్ ఈ చర్చకు కారణమైంది. ఓ యూట్యూబర్ వీడియో నుంచి తీసుకున్నట్లు చెప్పబడుతున్న ఆ స్క్రీన్‌షాట్‌లో, ‘Jackky’ అనే పేరుతో ఓ ప్రొఫైల్ కనిపించింది. ఆ ప్రొఫైల్ బయోలో “Actor/Peoducer” అని ఉండగా, లొకేషన్‌గా లండన్, యునైటెడ్ కింగ్డమ్ అని ఉంది. ఈ స్క్రీన్‌షాట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొందరు నెటిజన్లు “Producer” అనే పదాన్ని తప్పుగా “Peoducer” అని రాయడం గమనించి, ఈ ప్రొఫైల్ నిజమా కాదా అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం జాకీ భగ్నానీ నిజంగా ఆ డేటింగ్ యాప్‌లో ఉన్నారా లేదా అనే విషయంపై ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు. అయినప్పటికీ ఈ అంశం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది. ఇక ఈ సందర్భంగా ‘రాయా (Raya)’ అనే యాప్ గురించి మరోసారి చర్చ మొదలైంది. సాధారణ డేటింగ్ యాప్‌లకు భిన్నంగా, రాయా ఒక ప్రత్యేక సభ్యత్వ ఆధారిత ప్లాట్‌ఫారమ్. ఇందులో చేరాలంటే ముందుగా దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం ఆ దరఖాస్తులను పరిశీలించి ఎంపికైన వారికి మాత్రమే సభ్యత్వం కల్పిస్తారు. డేటింగ్‌తో పాటు నెట్వర్కింగ్, స్నేహ సంబంధాల కోసం కూడా ఈ యాప్‌ను ఉపయోగిస్తారు. అందుకే ఈ ప్లాట్‌ఫారమ్ సెలబ్రిటీలు, ప్రముఖ వ్యక్తుల మధ్య ప్రత్యేక గుర్తింపు పొందింది.
ఇదిలా ఉండగా, జాకీ భగ్నానీ పేరు గతంలో కూడా వ్యక్తిగత వ్యాఖ్యల కారణంగా వార్తల్లో నిలిచింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “రకుల్, నేను వివాహం చేసుకున్నాం. అయినప్పటికీ మేమిద్దరం ఒక విధంగా ‘సిట్యుయేషన్‌షిప్’లో ఉన్నట్లే భావిస్తాం. మేము ఒకరికొకరు పూర్తిగా కట్టుబడి ఉన్నాం. కానీ ముఖ్యంగా నేను ఏ విషయమైనా ఆమెతో స్వేచ్ఛగా మాట్లాడగలగడం మా బంధం ప్రత్యేకత” అని వ్యాఖ్యానించారు.
అయితే జాకీ చేసిన ఈ వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర విమర్శలకు దారితీశాయి. దీంతో రకుల్ ప్రీత్ సింగ్ స్పందిస్తూ, ఆయన మాటలను సందర్భం నుంచి విడదీసి ప్రచారం చేశారని స్పష్టం చేశారు. “గంటసేపు జరిగిన సంభాషణలోని ఒక వాక్యాన్ని మాత్రమే తీసుకుని వార్తగా మార్చడం విచారకరం. సందర్భం, భావం రెండూ చాలా ముఖ్యమైనవి. క్లిక్‌బైట్ కోసం కథనాలను మార్చడం సరైన పద్ధతి కాదు” అంటూ ఆమె తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో పేర్కొన్నారు.
ప్రస్తుతం జాకీ భగ్నానీ పేరుతో వైరల్ అవుతున్న ఈ డేటింగ్ యాప్ ప్రొఫైల్ నిజమా, కాదా అనే విషయంపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే అధికారికంగా ఎలాంటి నిర్ధారణ రాకపోవడంతో, దీనిని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ప్రచారంగా మాత్రమే పరిగణిస్తున్నారు.
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana













