Dipika Damerla: డిబేట్ హీట్ తర్వాత బాలీవుడ్ బీట్.. మేయర్ ఎన్నికల ప్రచారంలో తెలుగు మహిళ జోష్! | | ACTPnews

దీపికా దామెర్ల


Last Updated:

Dipika Damerla: విదేశీ గడ్డపై తెలుగు మహిళలు రాజకీయాల్లోనూ తమ సత్తా చాటుతూ కీలక పదవులకు పోటీ పడుతున్నారు.

దీపికా దామెర్ల
దీపికా దామెర్ల

కెనడాలోని ప్రముఖ నగరమైన మిస్సిస్సౌగా (Mississauga) మేయర్ పదవి ఎన్నికల బరిలో భారత సంతతికి చెందిన తెలుగు మహిళ దీపికా దామెర్ల నిలిచారు. స్థానిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆమె ఎంచుకున్న సరికొత్త శైలి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. సాధారణంగా కనిపించే రాజకీయ ప్రసంగాలకు భిన్నంగా, బాలీవుడ్ సూపర్ హిట్ పాటను పేరడీ చేస్తూ ఆమె చేసిన ప్రచారం నెటిజన్లను, స్థానిక పౌరులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

వైరల్‌గా మారిన పాట ప్రచారం

ఎన్నికల నేపథ్యంలో నిర్వహించిన మేయర్ డిబేట్ వాడివేడిగా సాగింది. ఈ క్రమంలో డిబేట్ ముగిసిన తర్వాత కాస్త ఉపశమనం కోసం అంటూ దీపిక తన సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియోను పంచుకున్నారు. బాలీవుడ్ ఎవర్‌గ్రీన్ సాంగ్ ‘క్యా హువా తేరా వాదా’ పాటలోని పదాలను స్థానిక సమస్యలకు అనుగుణంగా మార్చి ఆమె స్వయంగా ఆలపించారు. “ఇది నా మాట.. నా ప్రమాణం.. నా కోరిక.. నేను మిస్సిస్సౌగా మేయర్ అయిన రోజు నుంచి నగరంలో ఆస్తి పన్నులు పెరగవు” అంటూ ఆమె సరదాగా పాడుతూ ప్రజలకు హామీ ఇచ్చారు. గతంలో న్యూయార్క్ నగర ఎన్నికల్లో జోరాన్ మమ్దానీ సినిమాటిక్ తరహాలో ప్రచారం చేసి గుర్తింపు పొందగా, ఇప్పుడు దీపిక కూడా అదే పంథాను అనుసరించి అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు.

సికింద్రాబాద్ నుంచి కెనడా రాజకీయాల వరకు

దీపికా దామెర్ల మూలాలు తెలంగాణలో ఉన్నాయి. ఆమె సికింద్రాబాద్‌లో జన్మించారు. ఆమె తండ్రి భారత సైన్యంలో అధికారిగా దేశానికి సేవలందించారు. భారతదేశంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న అనంతరం 1991లో ఆమె కెనడాకు వలస వెళ్లారు. అక్కడ ప్రముఖ యూనివర్సిటీ ఆఫ్ టొరంటో పరిధిలోని ప్రఖ్యాత ‘రొట్మాన్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్’ నుంచి ఎంబీఏ (MBA) పట్టా పొందారు.

ఉన్నత విద్య అనంతరం కెనడాలోని అగ్రశ్రేణి బ్యాంకులలో కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత టీవీ జర్నలిస్టుగా కూడా మీడియా రంగంలో తన ప్రతిభను చాటుకున్నారు. ప్రజాసేవపై ఆసక్తితో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆమె, 2018లో మిస్సిస్సౌగాలోని ఏడో వార్డు నుంచి కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. ఆ సమయంలో ఒంటారియో ప్రావిన్స్ అసోసియేట్ ఆరోగ్య, దీర్ఘకాలిక సంరక్షణ శాఖలో కీలక బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి ప్రజల మన్ననలు పొందారు. ఇప్పుడు ఏకంగా నగర మేయర్ పదవికే పోటీ పడుతుండటంతో ప్రవాస భారతీయులు, తెలుగు ప్రజలు ఆమెకు మద్దతు తెలుపుతున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *