Drishyam 3 Review: ‘దృశ్యం 3’ మూవీ రివ్యూ.. కొత్త కథతో వచ్చిన అజయ్ దేవగణ్.. సినిమా ఎలా ఉందంటే? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

Drishyam 3 Review: 'దృశ్యం 3' మూవీ రివ్యూ.. కొత్త కథతో వచ్చిన అజయ్ దేవగణ్.. సినిమా ఎలా ఉందంటే? | తెలుగు సినిమా వార్తలు


కథ:

‘దృశ్యం 2’ తర్వాత మీరా దేశ్‌ముఖ్ (టబు) తన కొడుకు మరణానికి సంబంధించిన కేసు విషయంలో మానసికంగా తీవ్రంగా కుంగిపోతుంది. మరోవైపు ఆమె భర్త మహేష్ (రజత్ కపూర్) మాత్రం కేసును మరోసారి తెరపైకి తీసుకురావాలని నిర్ణయించుకుంటాడు. తమ కొడుకు మరణం వెనుక ఉన్న నిజాన్ని బయటకు తీసుకురావడంతో పాటు విజయ్ సాల్గాంకర్‌(అజయ్ దేవగన్)ను జైలుకు పంపాలని భావిస్తాడు.

ఈ క్రమంలో క్రైమ్ బ్రాంచ్ ఎస్.పీ. రాజ్‌వీర్ సింగ్ తోమర్ (జైదీప్ అహ్లావత్) రంగంలోకి వస్తాడు. విజయ్‌ను పట్టుకోవడానికి అతను తనదైన వ్యూహాలతో ముందుకు సాగుతాడు. మరోవైపు తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి విజయ్ కూడా ఎత్తుకు పైఎత్తులు వేస్తాడు. ఈ ఇద్దరి మధ్య జరిగే మైండ్ గేమ్, ఇన్వెస్టిగేషన్, కోర్టు పరిణామాల చుట్టూనే మిగతా కథ సాగుతుంది.

విశ్లేషణ:

‘దృశ్యం’ ఫ్రాంచైజీలో మొదటి రెండు భాగాలు మలయాళ వెర్షన్స్‌కు రీమేక్‌లుగా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి హిందీ మేకర్స్ పూర్తిగా కొత్త కథను ఎంచుకోవడం ఆసక్తిని పెంచుతుంది. ముఖ్యంగా మలయాళ వెర్షన్‌తో సంబంధం లేకుండా కథను కొనసాగించే ప్రయత్నం చేయడం ఒక సాహసమే చెప్పాలి. రెండో భాగం తర్వాత కథను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే విషయంలో దర్శకుడు అభిషేక్ పాఠక్ మంచి ఆలోచనతో ముందుకెళ్లాడు. సినిమా ప్రారంభం నుంచే కథలో ఆసక్తిని కొనసాగించే ప్రయత్నం కనిపిస్తుంది.

ఫస్టాఫ్‌లో సస్పెన్స్, పోలీస్ ఇన్వెస్టిగేషన్, కామెడీని మేళవిస్తూ కథను నడిపించారు. విజయ్ సాల్గాంకర్‌ అలియాస్ అజయ్ దేవగన్‌ను పట్టుకునేందుకు జైదీప్ అహ్లావత్ వేసే ఎత్తులు.. వాటి నుంచి బయటపడేందుకు ఆయన చేసే ప్రయత్నాలు ఆసక్తికరంగా ఉంటాయి. ముఖ్యంగా ఇంటర్వెల్‌కు ముందు వచ్చే ఇద్దరి ఫేస్ ఆఫ్ సన్నివేశం ఆకట్టుకుంటుంది. క్రైమ్, సస్పెన్స్ కథలో కామెడీని ఇంత సహజంగా కలపడం కూడా సినిమాకు ప్లస్‌గా నిలుస్తుంది. కథను ముందుకు తీసుకెళ్లడంలో ఈ హ్యూమర్ సన్నివేశాలు ఇబ్బందిగా అనిపించవు.

సెకండాఫ్‌లో కథ కోర్టు రూమ్‌కు మారుతుంది. అక్కడి నుంచి సినిమా మరింత ఆసక్తికరంగా సాగుతుంది. కోర్టు సన్నివేశాల్లో వచ్చే ట్విస్ట్‌లు, విజయ్ వేసే ప్లాన్స్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని కొనసాగిస్తాయి. అయితే ఇది ఫ్రాంచైజీలో చివరి భాగం కావడంతో.. చివరికి విజయ్ కుటుంబాన్ని కాపాడుకునే అవకాశం ఉందని ప్రేక్షకులు ముందుగానే ఊహించే అవకాశం ఉంటుంది. దీంతో క్లైమాక్స్‌లో వచ్చే ఫలితం విషయంలో పెద్దగా ఆశ్చర్యం ఉండకపోవచ్చు. అయితే ఆ ముగింపుకు కథను ఎలా తీసుకెళ్లారనేది సినిమాకు ప్రధాన బలం.

నటీనటులు:

అజయ్ దేవగన్ మరోసారి విజయ్ సాల్గాంకర్ పాత్రలో తనదైన శైలిలో నటించాడు. కుటుంబాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించే వ్యక్తిగా అతని నటన సహజంగా ఉంటుంది. ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా తనదైన శైలిలో మెప్పించాడు. జైదీప్ అహ్లావత్ సినిమాకు మరో ప్రధాన బలంగా నిలిచాడు. పోలీస్ అధికారి రాజ్‌వీర్ సింగ్ తోమర్ పాత్రలో అతని నటన ఆకట్టుకుంటుంది. అజయ్ దేవ్గన్‌తో జరిగే సన్నివేశాల్లో ఇద్దరి మధ్య పోటీ సినిమాకు మంచి ఇంపాక్ట్ తీసుకొచ్చింది. టబు తన పాత్ర పరిధిలో బాగానే నటించినప్పటికీ.. ఈసారి ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యం దక్కలేదనే ఫీలింగ్ కలుగుతుంది. ప్రకాశ్ రాజ్, శ్రియా సరన్, ఇషితా దత్తా, కమ్లేష్ సావంత్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక వర్గం:

సాంకేతికంగా సినిమా మంచి స్థాయిలో ఉంది. సుధీర్ చౌదరి సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్‌గా నిలిచింది. ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్, కోర్టు సన్నివేశాలను ఆసక్తికరంగా చూపించారు. రవి బస్రూర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సెకండాఫ్‌లో బాగా ఆకట్టుకుంటుంది. అయితే ఫస్టాఫ్‌లో కొన్ని సన్నివేశాలకు మరింత బలమైన స్కోర్ ఉంటే బాగుండేది. సందీప్ ఫ్రాన్సిస్ ఎడిటింగ్ పర్వాలేదనిపిస్తుంది. అభిషేక్ పాఠక్ రైటింగ్, డైరెక్షన్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. ఇప్పటికే రెండు భాగాలతో ఏర్పడిన అంచనాలను దృష్టిలో పెట్టుకుని.. కొత్త కథను రూపొందించడం, దాన్ని ఫ్రాంచైజీకి కనెక్ట్ చేయడం ఆసక్తికరంగా అనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్:

కొత్త కథ

అజయ్ దేవగన్ నటన

జైదీప్ అహ్లావత్ పెర్ఫార్మెన్స్

సస్పెన్స్, ఇన్వెస్టిగేషన్

కోర్టు రూమ్ సన్నివేశాలు

కామెడీ, క్రైమ్ బ్యాలెన్స్

మైనస్ పాయింట్స్:

క్లైమాక్స్‌ను ముందే ఊహించే అవకాశం

టబు పాత్రకు పరిమిత ప్రాధాన్యం

ఫస్టాఫ్‌లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అక్కడక్కడా తక్కువ ఇంపాక్ట్ ఇవ్వడం

చివరగా:

మొత్తంగా ‘దృశ్యం: ది కన్‌క్లూజన్’ ఫ్రాంచైజీని కొత్త కథతో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. మలయాళ వెర్షన్‌ను అనుసరించకుండా పూర్తిగా కొత్త కథను రూపొందించడం సినిమాకు ఆసక్తిని తీసుకొచ్చింది. అజయ్ దేవ్గన్, జైదీప్ అహ్లావత్ మధ్య మైండ్ గేమ్, సస్పెన్స్, కోర్టు సన్నివేశాలు సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి.

క్లైమాక్స్‌ను కొంతవరకు ముందే ఊహించే అవకాశం ఉన్నప్పటికీ.. అక్కడికి కథను తీసుకెళ్లిన విధానం ఆసక్తికరంగా ఉంటుంది. ‘దృశ్యం’ ఫ్రాంచైజీని ఫాలో అయ్యే ప్రేక్షకులకు, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ చిత్రం నచ్చే అంశాలు ఉన్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports