Last Updated:
Election Commission: లేని వ్యక్తుల ఓట్లు తొలగించడం.. కొత్తగా అర్హత ఉన్న వారికి ఓటు హక్కు కల్పించాలనే ప్రధాన ఆలోచనతో కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ(సర్)ప్రక్రియను చేపట్టింది. అయితే తుది జాబితాలో చాలా మంది ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయినట్లుగా వచ్చిన విమర్శలు, ఈసీపై చేస్తున్న ఆరోపణలకు దిద్దుబాటు చర్యలు చేపట్టనుంది.
Election Commission: ఓటర్ల జాబితా నుంచి పేరు గల్లంతైన వారికి మరో అవకాశం కల్పించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) పూర్తయిన ప్రాంతాల్లో ఈ డ్రైవ్ నిర్వహించాలని సూచించింది. ఓటర్ల తుది జాబితాలో చోటు దక్కని వారితో పాటు తొలిసారి ఓటు వేయబోయే యువతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని స్పష్టం చేసింది. ఓటు హక్కును ఏ ఒక్కరూ కోల్పోకూడదని ఆదిశగా చర్యలు తీసుకోవాలని సూచించింది.
లేని వ్యక్తుల ఓట్లు తొలగించడం.. కొత్తగా అర్హత ఉన్న వారికి ఓటు హక్కు కల్పించాలనే ప్రధాన ఆలోచనతో కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ(సర్)ప్రక్రియను చేపట్టింది. అయితే తుది జాబితాలో చాలా మంది ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయినట్లుగా వచ్చిన విమర్శలు, ఈసీపై చేస్తున్న ఆరోపణలకు దిద్దుబాటు చర్యలు చేపట్టనుంది. ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలో గైర్హాజరు, వేరే ప్రాంతానికి వెళ్లిపోయిన, మరణించిన, ఒకటికి మించి నమోదైన ఓటర్ల వివరాలను బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌ఓలు) సేకరించారు. ఇప్పుడు పాత ఓటర్ల జాబితాతో ప్రస్తుత జాబితాను పోల్చి.. గతంలో పేరు ఉండి ప్రస్తుతం కనిపించని వారి జాబితాను సిద్ధం చేయాలని ఈసీ సూచించింది.
ఆ తర్వాత బీఎల్‌ఓలు ఇంటింటికీ వెళ్లి ఆయా వ్యక్తుల ప్రస్తుత పరిస్థితిని తెలుసుకోవాలి. వారు అర్హులైతే ఫారం-6 ద్వారా మళ్లీ ఓటరుగా నమోదు చేసేందుకు సహకరించాలి. ప్రతి వారం కనీసం 20 నుంచి 25 మంది ఓటర్లను కలిసేలా కార్యక్రమాన్ని రూపొందించాలని ఈసీ ఆదేశించింది. దాదాపు నెల రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించింది.
ఇంటింటి పరిశీలన సందర్భంగా జాబితాలో చేరని అర్హులు, తొలిసారి ఓటు హక్కు పొందుతున్న యువతను కూడా గుర్తించాలని ఈసీ తెలిపింది. కార్మికుల నివాస ప్రాంతాలు, నిరాశ్రయులు, అణగారిన వర్గాల కోసం ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలు నిర్వహించాలని సూచించింది. బీఎల్‌ఓలు సేకరించిన వివరాలు, ఫారం-6 దరఖాస్తులు, క్షేత్రస్థాయి పరిశీలన నివేదికలను సంబంధిత ఎన్నికల నమోదు అధికారులకు (ఈఆర్‌ఓలు) అందించాలి. వాటిని పరిశీలించి చట్ట ప్రకారం నిర్ణయం తీసుకుంటారు. ఈ జాబితాలను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల బూత్ స్థాయి ప్రతినిధులతోనూ పంచుకోవాలని ఈసీ ఆదేశించింది.
ఓటరు నమోదుపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు విద్యాసంస్థలు, స్థానిక కార్యక్రమాలు, SVEEP కార్యక్రమాలు, మీడియా సమావేశాలను విస్తృతంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారులు, జిల్లా ఎన్నికల అధికారులు, ఈఆర్‌ఓలకు సూచించింది. ప్రత్యేక డ్రైవ్ పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించింది. ఓటర్ల నమోదును నిరంతర ప్రక్రియగా పేర్కొన్న ఈసీ.. అర్హత ఉన్న ఎవరైనా ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేసుకునే అవకాశం ఉందని స్పష్టం చేసింది.














