Last Updated:
FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచకప్ 2026లో మరో పెను సంచలనం నమోదైంది. గ్రూప్ ‘ఇ’ చివరి మ్యాచ్‌లో అండర్డాగ్స్ అయిన ఈక్వెడార్ జట్టు 2-1 తేడాతో నాలుగు సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన బలమైన జర్మనీ జట్టును ఓడించి చరిత్ర సృష్టించింది.
ఈ అద్భుత విజయంతో ఈక్వడార్ టోర్నీలో ‘రౌండ్ ఆఫ్ 32’ (నాకౌట్) దశకు అర్హత సాధించగా, ఇప్పటికే తదుపరి రౌండ్‌కు అర్హత సాధించిన జర్మనీకి ఈ ఓటమి గట్టి ఎదురుదెబ్బగా నిలిచింది.
న్యూజెర్సీ వేదికగా జరిగిన ఈ ఉత్కంఠభరిత పోరులో మ్యాచ్ ప్రారంభమైన 109 సెకన్లకే జర్మనీ ఖాతా తెరిచింది. ఫ్లోరియన్ విర్ట్జ్ అందించిన అద్భుతమైన పాస్‌ను లెరాయ్ సనే లో-ఫినిషింగ్‌తో గోల్‌గా మలిచాడు. అయితే ఈ గోల్ పట్ల ఈక్వడార్ ఆటగాళ్లు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. బిల్డ్-అప్ సమయంలో జర్మనీ ఆటగాడు అలెక్సాండర్ పావ్లోవిచ్, ఈక్వడార్‌కు చెందిన పెడ్రో విటేపై ‘హై ఫుట్’ ఫౌల్ చేశాడని, విఎఆర్ (VAR) దీన్ని తిరస్కరించడం తగదని వారు వాదించారు. అయినప్పటికీ రిఫరీ గోల్‌ను అనుమతించడంతో జర్మనీ 1-0తో ముందంజ వేసింది.
గోల్ లీడ్ లభించినప్పటికీ జర్మనీ ఆ ఆనందాన్ని ఎక్కువసేపు నిలుపుకోలేకపోయింది. కేవలం 7 నిమిషాల వ్యవధిలోనే (9వ నిమిషంలో) ఈక్వెడార్ తరఫున తొలిసారి స్టార్టింగ్ లైనప్‌లో బరిలోకి దిగిన మిడ్‌ఫీల్డర్ నిల్సన్ అంగులో మైదానాన్ని హోరెత్తించాడు. పెడ్రో విటే అందించిన పాస్‌ను అందుకుని, జర్మనీ రక్షణ శ్రేణిని చేధిస్తూ బాక్స్ వెలుపల నుండి అంగులో కొట్టిన క్లాస్ షాట్ నేరుగా లెజెండరీ గోల్‌కీపర్ మాన్యువల్ నూయర్ కాళ్ల సందు గుండా నెట్లోకి దూసుకెళ్లింది. ఈ టోర్నీలో 40 ప్రయత్నాల తర్వాత ఈక్వెడార్ నమోదు చేసిన మొదటి గోల్ ఇదే కావడం విశేషం.
సెకండ్ హాఫ్ ప్రారంభంలోనే జర్మనీకి లభించిన పెనాల్టీ నిర్ణయాన్ని విఎఆర్ (VAR) రివ్యూ ద్వారా రిఫరీ టోరి పెన్సో రద్దు చేశారు. కాయ్ హావెర్ట్జ్పై ఫౌల్ జరగడానికి ముందే లెరాయ్ సనే, పెడ్రో విటేపై ఫౌల్ చేసినట్లు రిప్లేలో తేలడంతో ఈక్వడార్ ఊపిరి పీల్చుకుంది.
మ్యాచ్ ముగియడానికి 13 నిమిషాల ముందు (77వ నిమిషంలో) అసలైన డ్రామా ఆవిష్కృతమైంది. ఈక్వడార్‌కు లభించిన కార్నర్ కిక్‌ను సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ కెవిన్ రోడ్రిగ్జ్ హెడర్ ద్వారా ముందుకు నెట్టగా, జర్మనీ కీపర్ మాన్యువల్ నూయర్ దాన్ని అందుకోవడంలో విఫలమయ్యాడు. అక్కడే పొంచి ఉన్న గొంజాల్లో ప్లాటా అత్యంత చాకచక్యంగా బంతిని నెట్ పైభాగానికి పంపి విన్నింగ్ గోల్ నమోదు చేశాడు.
ఈ విజయంతో ఈక్వడార్ గ్రూప్ ‘ఇ’ లో 4 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచినప్పటికీ, టోర్నీలోనే అత్యుత్తమ ప్రదర్శన చేసిన టాప్-8 ‘థర్డ్-ప్లేస్డ్’ జట్లలో ఒకటిగా నాకౌట్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఈక్వడార్ చరిత్రలో ప్రపంచకప్‌లో నాకౌట్ దశకు చేరుకోవడం ఇది కేవలం రెండోసారి మాత్రమే. మరోవైపు, ఓటమి పాలైనప్పటికీ మెరుగైన గోల్ డిఫరెన్స్ కారణంగా జర్మనీ గ్రూప్ టాపర్‌గానే ముగించింది.
లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్, మ్యాచ్ అప్డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి
Hyderabad,Telangana













