Last Updated:
సోషల్ మీడియాలో, ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో తనదైన గ్లామర్‌తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న యంగ్ హీరోయిన్ రాశి సింగ్ గాసిప్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
ప్రసన్నవదనం సినిమాతో వెండితెరపై, ‘3 రోజెస్’ సీజన్ 2 వెబ్ సిరీస్‌తో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై బ్యాక్ టు బ్యాక్ విజయాలను తన ఖాతాలో వేసుకున్న యంగ్ హీరోయిన్ రాశి సింగ్.. తాజాగా ‘గాసిప్’ అనే సందేశాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సోషల్ మీడియాలో, ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో తనదైన గ్లామర్‌తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న రాశి సింగ్, ఈ సినిమాలో గ్లామర్ కంటే నటనకు ఎక్కువ ఆస్కారం ఉన్న పాత్రలో కనిపించి మెప్పించారు. నేడు అనగా జూన్ 26న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రాన్ని వైభవ్ సినీ స్కల్ప్ట్ స్టూడియోస్ బ్యానర్‌పై యతి నిర్మించగా, వైభవ్ కౌండిన్య దర్శకత్వం వహించారు. ఈ మూవీలో మహేష్ యడవల్లి హీరోగా నటించారు.
నేటి సమాజంలో ఆధారాల్లేని పుకార్లు (గాసిప్స్) ఒక యువతి జీవితాన్ని, ఆమె కుటుంబ పరువును ఎలా ఛిద్రం చేస్తాయనే సున్నితమైన అంశం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ప్రకాశం (రవి వర్మ) తన చెల్లెలిని రమేష్ (విజయ్ ఆదిరాజు)కు ఇచ్చి వివాహం చేస్తాడు. కానీ, దురదృష్టవశాత్తూ ఆమె ప్రసవ సమయంలో మరణిస్తుంది. ఆ తర్వాత, మేనకోడలు అజంతా (రాశి సింగ్)ను పెద్ద కూతురిలా ప్రాణంగా చూసుకుంటాడు ప్రకాశం. మరోవైపు తండ్రి రమేష్.. తన కూతురిని సమాజానికి ఆదర్శంగా నిలిచేలా, అత్యంత క్రమశిక్షణతో పెంచుతానని శపథం చేస్తాడు.
అంతా సజావుగా సాగుతున్న తరుణంలో అజంతా గురించి కొన్ని తప్పుడు పుకార్లు వ్యాపిస్తాయి. ఇంట్లో చెప్పకుండా స్నేహితులతో కలిసి ఓ రాత్రి పార్టీకి వెళ్లిన అజంతా జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? తాను ప్రేమించిన తేజ (మహేష్ యడవల్లి)కు ఎందుకు దూరం కావాల్సి వచ్చింది? ఈ విపత్కర పరిస్థితుల్లో ఆమెను పెళ్లి చేసుకుంటానని వచ్చిన ప్రవీన్ (గురు చరణ్) అసలు ఎవరు? అనే ఆసక్తికర అంశాలతో దర్శకుడు సినిమాను ఉత్కంఠభరితంగా నడిపించారు.
టాలీవుడ్లో ప్రస్తుతం కంటెంట్ బేస్డ్ సినిమాలకు, మెసేజ్ ఓరియెంటెడ్ కథలకు మంచి ఆదరణ దక్కుతున్న నేపథ్యంలో, ‘గాసిప్’ చిత్రం కూడా అదే కోవలో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అజంతా పాత్రలో రాశి సింగ్ నటన సినిమాకు హైలైట్‌గా నిలిచింది. ఒక చిన్న పుకారు వల్ల మానసిక క్షోభకు గురయ్యే యువతిగా ఆమె తన కెరీర్లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. రవి వర్మ, విజయ్ ఆదిరాజు తమ పాత్రల పరిధి మేర అద్భుతంగా నటించి భావోద్వేగాలను పండించారు. కమెడియన్ 30 ఇయర్స్ పృథ్వీ తనదైన శైలిలో నవ్విస్తూనే, మంచి సందేశాన్ని అందించారు.
తొలి సినిమాతోనే దర్శకుడు వైభవ్ కౌండిన్య ఒక సున్నితమైన సామాజిక అంశాన్ని ఎంచుకుని సక్సెస్ అయ్యారు. ఆయన రాసుకున్న కథ, సంభాషణలు ప్రేక్షకులను ఆలోచింపజేస్తాయి. సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలకు మరింత బలాన్నిచ్చాయి. నిర్మాణ విలువలు ఇంకాస్త మెరుగ్గా ఉండి, సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలను మరింత బలంగా రాసుకుని ఉంటే సినిమా స్థాయి వేరేలా ఉండేది.
మహిళల వ్యక్తిగత జీవితాలపై గాసిప్స్ సృష్టించడం ఎంత ప్రమాదకరమో, అది వారి జీవితాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో కళ్లకు కట్టినట్లు చూపించిన చిత్రం ‘గాసిప్’. భావోద్వేగాలు, బలమైన సామాజిక సందేశం ఉన్న ఈ చిత్రాన్ని కుటుంబ సమేతంగా చూడొచ్చు.
రేటింగ్: 2.75
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana
Jun 26, 2026 12:08 PM IST













