గోవింద్ (వంశీ), అప్పారావు (రవి శివతేజ) కలిసి ఓ ట్రావెల్ కంపెనీని నడుపుతుంటారు. అయితే కంపెనీ నష్టాల్లో ఉండటంతో దాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు ఓ కొత్త ప్లాన్ వేస్తారు. ఇందులో భాగంగా ఏడుగురు మహిళలను ఉచితంగా ఫ్రాన్స్ ట్రిప్‌కు తీసుకెళ్లాలని నిర్ణయించుకుంటారు. సావిత్రి (అన్నపూర్ణమ్మ), చాముండేశ్వరి (ఆమని), నయన (జినీషా అలిశెట్టి), శ్రీలత (ఝాన్సీ), తన్వి (పాయల్ రాధాకృష్ణ), విహన (రూపా శ్రీనివాస్), దివ్య (సునైనా) ఇలా ఒక్కొక్కరు ఒక్కో నేపథ్యం నుంచి వస్తారు.
తన్వికి ప్యారిస్‌లో ఉండే నిఖిల్ (పృథ్వీ)తో పెళ్లి జరగాల్సి ఉంటుంది. అయితే పెళ్లి విషయంలో ఆమెకు స్పష్టత ఉండదు. శ్రీలత మాత్రం తన అల్లుడి గురించి గొప్పగా చెబుతూ ఉంటుంది. విహన తన సోషల్ మీడియా ద్వారా పరిచయమైన బాయ్‌ఫ్రెండ్‌ను కలుసుకోవడానికి ప్యారిస్‌కు వస్తుంది. సావిత్రి తన జీవితాన్ని తనకు నచ్చినట్టుగా ఆస్వాదించాలనే ఉద్దేశంతో ఈ ట్రిప్‌కు వస్తుంది. నయన తన భర్తతో విడాకుల సమస్య కారణంగా మానసికంగా ఇబ్బందుల్లో ఉంటుంది. దివ్య మాత్రం ప్రతి విషయంలోనూ భయపడుతూ కనిపిస్తుంది.
ఇలా వీళ్లంతా ఫ్రాన్స్‌లో సరదాగా గడుపుతూ, ఒకరితో ఒకరు గొడవపడుతూ, కొత్త అనుభవాలను ఆస్వాదిస్తూ ఉంటారు. అయితే అనుకోని పరిస్థితుల్లో దివ్య కనిపించకుండా పోవడంతో కథలో అసలు మలుపు మొదలవుతుంది. ఆమె ఏమైంది? తిరిగి తన వాళ్ల దగ్గరకు చేరుతుందా? గోవింద్ అసలు వీళ్లందరినీ ఉచితంగా ఫ్రాన్స్‌కు ఎందుకు తీసుకెళ్లాడు? ఈ ట్రిప్ వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? చివరికి ఈ ఏడుగురి జీవితాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి? అన్నదే మిగతా కథ.
సినిమా ప్రారంభంలోనే గోవింద్, అప్పారావు, వారి ట్రావెల్ కంపెనీని పరిచయం చేసి కథను మొదలుపెట్టారు. ఆ తర్వాత ఏడుగురు మహిళల పాత్రలను ఒక్కొక్కటిగా పరిచయం చేస్తూ.. వారి నేపథ్యాలను చూపించి ఫ్రాన్స్ ప్రయాణం మొదలుపెడతారు. ఫస్ట్ హాఫ్‌లో కథను పెద్దగా సీరియస్‌గా తీసుకెళ్లకుండా ఎక్కువగా కామెడీ, ట్రావెల్ ఎపిసోడ్స్‌తో ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేశారు.
ఫ్రాన్స్‌కు వెళ్లిన తర్వాత ఈ ఏడుగురి మధ్య జరిగే సంఘటనలు, చిన్న చిన్న గొడవలు, అక్కడి పరిస్థితులకు వారు ఇచ్చే రియాక్షన్స్ నవ్విస్తాయి. అన్నపూర్ణమ్మ పాత్రకు సంబంధించిన కామెడీ ట్రాక్ ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. అదే సమయంలో దివ్య ఎందుకు భయపడుతుందనే విషయాన్ని కొంత ఆసక్తికరంగా చూపిస్తూ.. ఆమె తప్పిపోవడంతో ఇంటర్వెల్ బ్యాంగ్ ఇచ్చారు. దీంతో సెకండ్ హాఫ్‌లో ఏం జరుగుతుందనే ఆసక్తి ఏర్పడుతుంది.
సెకండ్ హాఫ్‌లో ప్రధానంగా ఈ ఏడుగురు మహిళల వ్యక్తిగత జీవితాలు, వారు ఎదుర్కొంటున్న సమస్యలను దర్శకుడు తెరపైకి తీసుకొచ్చారు. ప్రయాణం కొనసాగుతూనే ఒక్కొక్కరి కథను చెప్పే ప్రయత్నం చేశారు. మధ్యలో కామెడీ సన్నివేశాలు, వారి మధ్య జరిగే గొడవలు కథను ముందుకు తీసుకెళ్తాయి. అయితే ఇక్కడే సినిమాకు కొంత ఇబ్బంది ఎదురవుతుంది. మహిళల జీవితాల్లోని సమస్యలను ఎమోషనల్‌గా చూపించాలని ప్రయత్నించినా.. కొన్ని సన్నివేశాల్లో ఆ భావోద్వేగం ప్రేక్షకులకు పూర్తిగా కనెక్ట్ కాదు. కొన్ని పాత్రల ఆలోచనలు, ప్రవర్తన కూడా సందర్భానికి తగ్గట్టుగా కాకుండా కథను ముందుకు తీసుకెళ్లడం కోసమే రాసుకున్నట్టుగా అనిపిస్తాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో కొన్ని సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి.
మహిళల స్వేచ్ఛ, కుటుంబ జీవితం, వ్యక్తిగత నిర్ణయాల చుట్టూ కొన్ని భావాలను చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఈ అంశాలను మరింత సహజంగా, బలమైన సన్నివేశాలతో చూపించి ఉంటే ప్రభావం ఎక్కువగా ఉండేది. మరోవైపు మగవాళ్ల సమస్యల గురించి కూడా కొన్ని డైలాగ్స్ ద్వారా ప్రస్తావించారు. కానీ సినిమాలో ప్రధానంగా చూపించిన ఎమోషనల్ ట్రాక్‌లు ఆశించిన స్థాయిలో ప్రభావం చూపవు. అయితే క్లైమాక్స్‌కు వచ్చేసరికి సినిమా మళ్లీ గాడిలో పడుతుంది. గోవింద్ పాత్రకు సంబంధించిన ట్విస్ట్ కథను మరో కోణంలోకి తీసుకెళ్తుంది. చివర్లో కుటుంబ విలువలకు ప్రాధాన్యత ఇస్తూ ఇచ్చిన ముగింపు సినిమాకు సరైన ముగింపును అందిస్తుంది. ఇదే సినిమాను కొంతవరకు నిలబెట్టిన అంశంగా చెప్పొచ్చు.
ఈ సినిమాలో అన్నపూర్ణమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తన వయసుకు భిన్నమైన మోడ్రన్ లుక్‌లో కనిపిస్తూ.. ఫ్రాన్స్‌లో జీవితాన్ని ఎంజాయ్ చేసే మహిళగా ఆమె చేసిన కామెడీ ఆకట్టుకుంటుంది. తన పాత్రకు ఉన్న ఎనర్జీని పూర్తిగా తెరపై చూపించారు. ఆమని మినిస్టర్ భార్య పాత్రలో సహజంగా నటించారు.
యాంకర్ ఝాన్సీ తన పాత్రలో అక్కడక్కడా నవ్వించారు. క్లైమాక్స్‌కు ముందు వచ్చే కొన్ని సన్నివేశాల్లో ఎమోషన్ పండించేందుకు ప్రయత్నించారు. పాయల్ రాధాకృష్ణ, జినీషా అలిశెట్టి, రూపా శ్రీనివాస్ తమ పాత్రల పరిధిలో బాగానే నటించారు. సునైనా ఇంతకుముందు చేసిన కామెడీ పాత్రలకు భిన్నంగా భయపడుతూ, ఆందోళన చెందే పాత్రలో కనిపించారు. కొన్ని చోట్ల ఆమె నటన కాస్త ఓవర్‌గా అనిపించినా.. పాత్రకు అవసరమైన భావాలను వ్యక్తం చేశారు.
వంశీ తనదైన కామెడీ టైమింగ్‌తో నవ్వించారు. రవి శివతేజ కూడా తన పంచ్ డైలాగ్స్‌తో ఎంటర్టైన్ చేశారు. పృథ్వీ దండమూడి, మురళీధర్ గౌడ్ తదితరులు తమ పాత్రలకు తగ్గట్టుగా నటించారు.
సినిమాకు ఫ్రాన్స్ లొకేషన్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అక్కడి నగరాలు, ప్రముఖ టూరిస్ట్ స్పాట్స్‌ను సినిమాటోగ్రఫీ టీమ్ అందంగా చూపించింది. సినిమా చూస్తున్నంతసేపు ఒక ట్రావెల్ వ్లోగ్ చూస్తున్న అనుభూతి కూడా కొన్ని సందర్భాల్లో కలుగుతుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది. పాటలు పర్వాలేదనిపిస్తాయి.
ఎడిటింగ్ విషయంలో మరింత జాగ్రత్త తీసుకుని ఉంటే సినిమా మరింత కాంపాక్ట్‌గా ఉండేది. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో కథకు పెద్దగా ఉపయోగపడని కొన్ని సన్నివేశాలను తొలగించి ఉంటే పేసింగ్ మెరుగ్గా ఉండేది. పరిమిత బడ్జెట్లో ఇంతమంది నటీనటులను ఫ్రాన్స్‌కు తీసుకెళ్లి పలు లొకేషన్లలో షూటింగ్ చేయడం తెరపై కనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
‘హ్యాపీ జర్నీ’ అనేది ఏడుగురు మహిళలు ఫ్రాన్స్‌కు వెళ్లినప్పుడు ఎదురయ్యే సరదా సంఘటనలు, వారి వ్యక్తిగత జీవితాలు, భావోద్వేగాలను కలిపి చెప్పిన ట్రావెల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఫస్ట్ హాఫ్ కామెడీతో బాగానే సాగినా.. సెకండ్ హాఫ్‌లో ఎమోషనల్ కంటెంట్ పూర్తిగా వర్కౌట్ కాలేదు. అయితే క్లైమాక్స్ ట్విస్ట్, ఫ్యామిలీ ఎమోషన్ సినిమాకు కొంత బలాన్ని ఇచ్చాయి. అన్నపూర్ణమ్మ నటన, ఫ్రాన్స్ విజువల్స్, కామెడీ సన్నివేశాలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణలు. ఫ్యామిలీ ఆడియన్స్ ట్రావెల్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ లైట్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను చూడొచ్చు.
రేటింగ్: 3/5













