Last Updated:
సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానంలో మహిళా ఫ్లైట్ అటెండెంట్‌ను వేధించిన భారతీయుడు ఆకాశ్ తివారీకి సింగపూర్ కోర్టు ఆరు నెలల జైలు, పరిహారంగా 1270 డాలర్లు విధించింది
సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఓ మహిళా క్యాబిన్ సిబ్బందిని వేధించి, అసభ్యంగా ప్రవర్తించిన కేసులో 35 ఏళ్ల భారతీయుడు ఆకాశ్ తివారీకి సింగపూర్ కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. అదనంగా బాధితురాలికి పరిహారంగా 1,270 సింగపూర్ డాలర్లు (సుమారు 982.25 అమెరికన్ డాలర్లు) చెల్లించాలని కూడా ఆదేశించింది.
ఈ ఘటన ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగినట్లు సమాచారం. ఆకాశ్ తివారీ తన నలుగురు స్నేహితులతో కలిసి బ్యాంకాక్ నుంచి సింగపూర్ వెళ్తున్న సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానంలో ప్రయాణిస్తున్నాడు.
కోర్టు పత్రాల ప్రకారం, విమానం టేకాఫ్‌కు ముందు ప్రయాణికుల భోజన అభిరుచులను తెలుసుకునేందుకు వచ్చిన మహిళా ఫ్లైట్ అటెండెంట్ దగ్గరకు వెళ్లిన సమయంలో తివారీ తన చేతులను చాపి ఆమె కాలికి తగిలేలా చేశాడు. ప్రయాణం మొత్తం ఆ మహిళా సిబ్బంది వారి సీట్ల పక్కగా వెళ్లిన ప్రతిసారి తివారీతో పాటు అతని స్నేహితులు నవ్వుతూ ఆమెను అసౌకర్యానికి గురి చేసినట్లు పేర్కొన్నారు.
ఈ విషయాన్ని బాధితురాలు చీఫ్ స్టీవర్డెస్‌కు తెలియజేయడంతో ఆమెను మరో విభాగంలో విధులు నిర్వహించేలా మార్చారు. అయినప్పటికీ వేధింపులు ఆగలేదు. తర్వాత ట్రేలను సేకరించేందుకు ఆ మహిళ తిరిగి వారి వద్దకు వెళ్లినప్పుడు, తివారీ తన మోచేతిని ఆమె వీపుకు తగిలేలా చేశాడని ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆమె మరోసారి ఫిర్యాదు చేసింది. దీని అనంతరం సీనియర్ సహోద్యోగితో కలిసి ఫ్లైట్ అటెండెంట్ తివారీని నిలదీయగా, అతను ఎలాంటి తప్పు చేయలేదని నిరాకరించాడు. అయితే బాధితురాలు పలుమార్లు తనను తాకవద్దని హెచ్చరించినప్పటికీ, అతను ఆరోపణలను తేలికగా తీసుకుంటూ చిరునవ్వు చిందించాడని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
అంతటితో ఆగకుండా, విమానం ల్యాండింగ్‌కు సిద్ధమవుతున్న సమయంలో తివారీ ఆ మహిళా సిబ్బందిని అనుసరిస్తూ విమానంలోని గ్యాలీ ప్రాంతంలోకి వెళ్లాడు. అది చాలా ఇరుకైన ప్రదేశం కావడంతో అతను ఆమెకు అత్యంత సమీపంలో నిలబడ్డాడు. పలుమార్లు దూరంగా ఉండాలని హెచ్చరించినా పట్టించుకోకపోవడంతో, చివరకు ఆమెను మూలకు నెట్టిన పరిస్థితి ఏర్పడింది. దీంతో భయాందోళనకు గురైన ఫ్లైట్ అటెండెంట్ అతనిపై గట్టిగా అరవాల్సి వచ్చింది.
మరోవైపు, తివారీ మోచేతితో ఆమె వీపును తాకిన ఘటన సమయంలో, అతని స్నేహితుడు జయ్ శంకర్ “ఒక బీర్ తాగుతూ ఈ ‘షో’ను చూస్తాను” అని వ్యాఖ్యానించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ ఘటనను వెంటనే విమాన కెప్టెన్‌కు నివేదించారు. విమానం సింగపూర్ చాంగీ విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత విమానాశ్రయ అధికారులు పోలీసు దర్యాప్తు ప్రారంభించారు. చివరగా, సోమవారం జరిగిన విచారణలో ఆకాశ్ తివారీ తనపై ఉన్న అసభ్య ప్రవర్తన (Molestation) మరియు వేధింపుల (Harassment) ఆరోపణలను అంగీకరించడంతో సింగపూర్ కోర్టు అతనికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది.
ఇదే సందర్భంగా, మరో సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానంలో 20 ఏళ్ల భారతీయ యువకుడు కూడా ఓ ఫ్లైట్ అటెండెంట్‌ను వేధించిన మరో కేసును ది ఇండిపెండెంట్ ప్రస్తావించింది.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana













