సంగారెడ్డి జిల్లా సదాశివపేట రైతు సేవా కేంద్రాన్ని సందర్శించిన హరీష్ రావు, రైతుల సమస్యలపై ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. శనగ పంటను కొనుగోలు చేయకుండా ‘కోటా అయిపోయింది’ అని రైతులను వెనక్కి పంపడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఎప్పుడూ భూములు, కమీషన్లు, కాంట్రాక్టుల మీదనే రివ్యూలు చేస్తావా రేవంత్ రెడ్డి? రైతుల గురించి రివ్యూలు చేయడానికి నీకు తీరిక లేదా?” అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పంట కొనుగోళ్లు జరగడం లేదని ఇంటెలిజెన్స్ వ్యవస్థ చెప్పడం లేదా అని నిలదీశారు. రైతులకు సరిగా కరెంట్ అందడం లేదని, రైతుబంధు, బోనస్ ఇవ్వకుండా ఈ ప్రభుత్వం రైతులను వంచిస్తోందని హరీష్ రావు విమర్శించారు. కనీసం మద్దతు ధరకు పంట కొనలేని ఈ ప్రభుత్వం పూర్తిగా అసమర్థమైందని ఆయన మండిపడ్డారు.












