Last Updated:
జలుబు, జ్వరం రాగానే సొంత వైద్యంతో యాంటీబయోటిక్స్, పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారా? అయితే వెంటనే ఆ అలవాటు మానుకోండి. ఇష్టం వచ్చినట్లు మందులు వాడితే కిడ్నీలు పాడవుతాయని కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ (CDSCO) తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.
చిన్నపాటి తలనొప్పి, జ్వరం, ఒళ్లు నొప్పులు రాగానే వెంటనే మెడికల్ షాపుకు వెళ్లి పెయిన్ కిల్లర్స్ లేదా యాంటీబయోటిక్స్ తెచ్చుకుని వేసుకోవడం మన ఇళ్లలో సర్వసాధారణం. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే ఈ మందులను ఇష్టానుసారంగా వాడేస్తుంటారు. అయితే ఇలా సొంత వైద్యం చేసుకునే వారికి కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ (CDSCO) గట్టి షాక్ ఇచ్చింది. పెయిన్ కిల్లర్స్ (NSAIDs), యాంటీబయోటిక్స్ మితిమీరి వాడితే క్రానిక్ కిడ్నీ వ్యాధులు.. అంటే మూత్రపిండాల వైఫల్యం వచ్చే ప్రమాదం ఉందని తీవ్రంగా హెచ్చరించినట్లు న్యూస్18 ఇంగ్లీష్ కథనం పేర్కొంది. ఈ మేరకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) డాక్టర్ రాజీవ్ సింగ్ రఘువంశీ సెప్టెంబర్ 21న డాక్టర్లు, ఫార్మసిస్టులు, ఆస్పత్రులు, ప్రజలను అప్రమత్తం చేస్తూ ఓ కీలక సర్క్యులర్ జారీ చేశారు.
డాక్టర్ సలహా లేకుండా వీటిని ఎక్కువ కాలం పాటు పదేపదే వాడొద్దని స్పష్టం చేశారు. ముఖ్యంగా సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్లకు యాంటీబయోటిక్స్ వాడటం తక్షణమే ఆపాలని సూచించారు.
ముందు నుంచే మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు పెయిన్ కిల్లర్స్ వేసుకునే ముందు కచ్చితంగా డాక్టర్‌కు ఆ విషయం చెప్పాలని సర్క్యులర్‌లో స్పష్టం చేశారు. పదేపదే జ్వరం, నొప్పులు వస్తుంటే మందులు వేసుకుంటూ కాలక్షేపం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఈ నిర్ణయాన్ని అపోలో ఆస్పత్రి న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ స్వాగతించారు. ఈ మందులను డాక్టర్ రాసిస్తేనే అమ్మాలన్న నిబంధనను పకడ్బందీగా అమలు చేయడం మంచి పరిణామం అన్నారు. ఆరోగ్యకరమైన కిడ్నీలు, లివర్ ఉన్నవారికి కూడా సొంత వైద్యం వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆయన హెచ్చరించారు.
మందులు రాసే వైద్యులకు కూడా CDSCO కీలక సూచనలు చేసింది. రోగి వయసు, ఆరోగ్య పరిస్థితి, ఇతర జబ్బులను బేరీజు వేసుకున్న తర్వాతే అత్యవసరమైతేనే యాంటీబయోటిక్స్, పెయిన్ కిల్లర్స్ సూచించాలని స్పష్టం చేసింది. ముఖ్యంగా కిడ్నీ సమస్యలు వచ్చే ప్రమాదం ఉన్నవారికి సాధ్యమైనంత తక్కువ డోస్‌ను, తక్కువ కాలానికి మాత్రమే రాయాలని సూచించింది. అనవసరంగా కాంబినేషన్ మందులు రాయడం, తప్పు డోసేజ్ ఇవ్వడం లాంటివి చేయొద్దని హెచ్చరించింది. సరైన మందులను ఎంచుకోవడంలో యాంటీమైక్రోబయాల్ స్టీవార్డ్‌షిప్ సూత్రాలను కచ్చితంగా పాటించాలని ఆదేశించింది.
మెడికల్ షాపుల నిర్వాహకులు, డిస్ట్రిబ్యూటర్లకు సైతం కేంద్రం గట్టి వార్నింగ్ ఇచ్చింది. చాలావరకు పెయిన్ కిల్లర్స్ డ్రగ్ రూల్స్-1945 కింద షెడ్యూల్ హెచ్ జాబితాలో, యాంటీబయోటిక్స్ షెడ్యూల్ హెచ్1 జాబితాలో ఉంటాయి. రిజిస్టర్డ్ డాక్టర్ రాసిస్తే తప్ప వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ విక్రయించకూడదు. రోగులు సొంత వైద్యం చేసుకునేలా కెమిస్ట్‌లు ప్రోత్సహించకూడదని సర్క్యులర్ తేల్చిచెప్పింది. వైద్యుల సలహా లేకుండా ఈ మందులు వాడటం ప్రమాదకరం అనే హెచ్చరికను కచ్చితంగా వాటిపై ముద్రించాలని గుర్తుచేసింది.
ఆస్పత్రులు, వైద్య సంస్థలు తమ అంతర్గత వ్యవస్థలను మరింత బలోపేతం చేసుకోవాలని, డాక్టర్లు రాసే ప్రిస్క్రిప్షన్లను ఎప్పటికప్పుడు సమీక్షించాలని CDSCO సూచించింది. దీనిపై రోగులకు సరైన అవగాహన కల్పించాలి. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల డ్రగ్ కంట్రోల్ అధికారులు.. డాక్టర్లు, మెడికల్ షాపుల యజమానులు, ప్రజల్లో ఈ మందుల వాడకం వల్ల కలిగే దుష్ప్రభావాలపై విస్తృత ప్రచారం కల్పించాలని ఆదేశించింది. పెయిన్ కిల్లర్స్, యాంటీబయోటిక్స్‌ను సురక్షితంగా, బాధ్యతాయుతంగా వాడేలా అన్ని వర్గాలు చొరవ తీసుకుంటే.. కిడ్నీలు పాడవకుండా కాపాడుకోవచ్చని సూచించింది. దేశంలో యాంటీమైక్రోబయాల్ రెసిస్టెన్స్ (AMR) పెరిగిపోతున్న తరుణంలో ఈ చర్యలు ఎంతో కీలకం.














