Last Updated:
దగ్గు మందులు, ఇతర ఔషధ సిరప్‌ల విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కఫ్ సిరప్ కొనుగోలు చేయాలంటే తప్పనిసరిగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ చూపించాల్సి ఉంటుంది. ఔషధాల దుర్వినియోగాన్ని అరికట్టడం, ప్రజారోగ్య భద్రతను మెరుగుపరచడం లక్ష్యంగా ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి.
దేశవ్యాప్తంగా కఫ్ సిరప్లు (దగ్గు మందు) ఇతర ఔషధ సిరప్‌ల విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు తీసుకొచ్చింది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఔషధ నియమాలు-1945 (Drugs Rules, 1945)లో సవరణలు చేస్తూ కొన్ని రకాల సిరప్ మందులను ఇకపై ఓవర్-ది-కౌంటర్ (OTC) విధానంలో విక్రయించకుండా నిర్ణయించింది. దీంతో ఇకపై కఫ్ సిరప్ కొనుగోలు చేయాలంటే తప్పనిసరిగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ చూపించాల్సి ఉంటుంది.
ఇప్పటి వరకు దగ్గు లేదా జలుబు వచ్చినప్పుడు చాలా మంది నేరుగా మెడికల్ షాపులకు వెళ్లి కఫ్ సిరప్ కొనుగోలు చేసేవారు. ఇందుకు వైద్యుడి చీటీ అవసరం ఉండేది కాదు. అయితే కొత్త నిబంధనల అమలుతో ఆస్పత్రి లేదా మెడికల్ స్టోర్‌లో డాక్టర్ సూచించిన ప్రిస్క్రిప్షన్ లేకుండా కఫ్ సిరప్ లభించదు.
Union Ministry of Health and Family Welfare issues notification which brings into effect that all ‘Syrups’, including cough syrups will no longer be available over the counter. A prescription by a doctor will be required for the purchase of ‘Syrups’. pic.twitter.com/k0jsP25EqJ
— ANI (@ANI) June 16, 2026
కేంద్ర ప్రభుత్వం ఔషధ నియమాల్లో చేసిన సవరణల ప్రకారం, వివిధ రకాల ఔషధ సిరప్‌లను కొనుగోలు చేయడానికి నమోదిత వైద్యుడు జారీ చేసిన ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి. ముఖ్యంగా కఫ్ సిరప్‌లను ఓటీసీ విక్రయాల జాబితా నుంచి తొలగిస్తూ కఠిన నియంత్రణలు అమలు చేయనుంది. ఇప్పటి వరకు కొన్ని పట్టణ ప్రాంతాల్లో అమలులో ఉన్న ఈ విధానం ఇకపై గ్రామీణ ప్రాంతాల్లో కూడా వర్తించనుంది.
ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, ఔషధాల దుర్వినియోగాన్ని అరికట్టడం, ప్రజల ఆరోగ్య భద్రతను మెరుగుపరచడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. కొత్త నిబంధనల ప్రకారం, లైసెన్స్ పొందిన మెడికల్ షాపులు లేదా ఫార్మసీల ద్వారానే సిరప్‌ల విక్రయాలు జరగాలి.
ఇక షెడ్యూల్-K (Schedule K)లో ఉన్న ప్రత్యేక మినహాయింపుల జాబితా నుంచి ‘సిరప్’ అనే పదాన్ని ప్రభుత్వం తొలగించింది. గతంలో 1,000 మందికంటే తక్కువ జనాభా ఉన్న చిన్న గ్రామాల్లో కొన్ని లైసెన్స్ నిబంధనల నుంచి మినహాయింపు ఉండేది. ఇప్పుడు ఆ మినహాయింపులు కూడా రద్దయ్యాయి. దీంతో గ్రామం నుంచి నగరం వరకు ఒకే విధమైన నిబంధనలు అమల్లోకి వచ్చాయి.
గత కొన్నేళ్లుగా కఫ్ సిరప్‌ల దుర్వినియోగంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో నాసిరకం లేదా తప్పుగా వినియోగించిన కఫ్ సిరప్‌ల కారణంగా తీవ్ర ఆరోగ్య సమస్యలు, మరణాలు కూడా చోటుచేసుకున్నాయి. ఈ సంఘటనల నేపథ్యంలో కఫ్ సిరప్‌ల విక్రయాలపై మరింత పర్యవేక్షణ అవసరమని ప్రభుత్వం భావించింది.
కఫ్ సిరప్ కొనుగోలుకు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి.
ఓటీసీ (OTC) విక్రయాలపై పరిమితులు అమలు.
లైసెన్స్ పొందిన మెడికల్ షాపుల ద్వారానే విక్రయాలు.
చిన్న గ్రామాల్లో కూడా ఇదే నిబంధనలు వర్తింపు.
ఔషధాల దుర్వినియోగాన్ని అరికట్టడం, ప్రజారోగ్య భద్రతను పెంపొందించడం ప్రధాన లక్ష్యం.
కఫ్ సిరప్ తయారీదారులు, పంపిణీదారులు, ఔషధ విక్రేతలు అన్ని నియంత్రణ నిబంధనలను కచ్చితంగా పాటించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana
Jun 16, 2026 12:08 PM IST













