Last Updated:
hyd news
సొంతింటి కోసం ఎదురుచూస్తున్న పేద కుటుంబాలకు కేంద్రం నుంచి భారీ శుభవార్త వచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు కలిపి ఒకేసారి పెద్ద సంఖ్యలో ఇళ్లను మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో సొంత గూడు లేని అర్హులైన కుటుంబాలకు ఈ పథకం ద్వారా కొత్తగా అవకాశం దక్కనుంది. గతంలో మంజూరైన ఇళ్లకు అదనంగా ఈ కేటాయింపులు ఉంటాయని మంత్రి స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌కు 2019 నుంచి 2024 వరకు 1.78 లక్షల ఇళ్లను కేటాయించినప్పటికీ.. అందులో సుమారు 42 వేల ఇళ్ల నిర్మాణం మాత్రమే పూర్తయిందని పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. 2024 తర్వాత ఏపీకి గృహాల కేటాయింపును గణనీయంగా పెంచినట్లు చెప్పారు. గతంలో మధ్యలో ఆగిపోయిన ఇళ్లతో పాటు తాజాగా మంజూరైన గృహాలను కూడా వేగంగా పూర్తి చేయడంపై దృష్టి పెట్టినట్లు వెల్లడించారు.
ఇక తెలంగాణ విషయానికి వస్తే.. 2019-24 మధ్య ప్రధాని ఆవాస్ యోజన-గ్రామీణ పథకంలో రాష్ట్రం భాగస్వామిగా లేదని మంత్రి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి కేంద్రాన్ని ఇళ్ల కేటాయింపుల కోసం పలుమార్లు కోరినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అడిగిన సంఖ్య కంటే ఎక్కువగా ఇళ్లను కేటాయించినట్లు వెల్లడించారు. తాజా జాబితాలో తెలంగాణకు ఏకంగా 2 లక్షల ఇళ్లు మంజూరయ్యాయని తెలిపారు.
పీఎంఏవై-గ్రామీణ పథకంలో భాగంగా ఒక్కో ఇంటి నిర్మాణానికి కేంద్రం నుంచి రూ.1.20 లక్షల వరకు ఆర్థిక సాయం అందుతుంది. ఇతర ప్రభుత్వ పథకాల సహాయాన్ని కూడా కలిపితే లబ్ధిదారుడికి మొత్తం దాదాపు రూ.1.80 లక్షల వరకు ప్రయోజనం అందే అవకాశం ఉంది. మరుగుదొడ్డి నిర్మాణానికి స్వచ్ఛ భారత్ కింద మరో రూ.12 వేల సాయం లభిస్తుంది. దీంతో ఇల్లు నిర్మించుకునే పేద కుటుంబాలకు ప్రభుత్వ సహకారం మరింత ఉపయోగపడనుంది.
లబ్ధిదారుల ఎంపికలో అక్రమాలకు, పక్షపాతానికి అవకాశం లేకుండా సాంకేతికతను ఉపయోగించనున్నట్లు మంత్రి తెలిపారు. ఆవాస్ ప్లస్ యాప్ ద్వారా వివరాలను నమోదు చేయడంతో పాటు జియో ట్యాగింగ్ చేపడతారు. అర్హత ఉన్న కుటుంబాలు తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకునేలా సెల్ఫ్ సర్వే సదుపాయం కూడా ఉంది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో సొంత ఇల్లు లేని అర్హులైన కుటుంబాలను గుర్తించడం మరింత సులభం కానుంది.
ఇదిలా ఉంటే.. పథకానికి సంబంధించిన అర్హతల్లోనూ కేంద్రం కీలక మార్పులు చేసింది. కుటుంబ నెలవారీ ఆదాయ పరిమితిని రూ.10 వేల నుంచి రూ.15 వేలకు పెంచింది. అలాగే ఇంట్లో మోటార్ బైక్ లేదా ఫ్రిజ్ ఉందనే కారణంతోనే పథకం నుంచి తొలగించకుండా నిబంధనలను సడలించింది. ఇప్పటికే మంజూరైన ఇళ్లు, తాజాగా కేటాయించిన గృహాలను రెండు నుంచి మూడేళ్లలోపు పూర్తి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. రాజకీయాలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి అవకాశం కల్పిస్తామని మంత్రి స్పష్టం చేశారు.














