Space War: స్పేస్ వార్‌కు సిద్ధం.. చైనా, రష్యాలకు షాక్ ఇచ్చిన అమెరికా! | | ACTPnews

ప్రతీకాత్మక చిత్రం


Last Updated:

Space War: అంతరిక్షాన్ని రణరంగంగా మార్చే సరికొత్త ఆయుధ పోటీని ధ్రువీకరిస్తూ అమెరికా సంచలన ప్రకటన చేసింది. భూ కక్ష్యలో తమ ఆయుధాలు ఇప్పటికే మోహరించి ఉన్నాయని అమెరికా తొలిసారిగా అధికారికంగా వెల్లడించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

తమ దేశంతో పాటు మిత్రదేశాల బలగాలను శత్రుదేశాల ముప్పు నుంచి రక్షించేందుకే ఈ ఆయుధ వ్యవస్థలను సిద్ధం చేసినట్లు యూఎస్ స్పేస్ ఫోర్స్ స్పష్టం చేసింది. న్యూస్18 ఇంగ్లీష్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఈ విషయమై స్పేస్ ఫోర్స్ ప్రతినిధి మాట్లాడుతూ.. శత్రువుల నుంచి ఎదురయ్యే వ్యతిరేక చర్యల నుంచి తమ దళాలను కాపాడేందుకు అంతరిక్ష నియంత్రణ ఆయుధాలు కక్ష్యలో సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ప్రత్యర్థులపై ప్రభావం చూపేందుకు ఇవి ‘కైనెటిక్’, ‘నాన్-కైనెటిక్’ విధానాల్లో పనిచేస్తాయని, వీటిని రక్షణకే కాకుండా దాడికి కూడా ఉపయోగించే సామర్థ్యం ఉందని పేర్కొన్నారు. అయితే, కక్ష్యలో ఉంచిన ఆయుధ వ్యవస్థల వివరాలను మాత్రం గోప్యంగా ఉంచారు.

‘ఎయిర్, స్పేస్, సైబర్’ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న యూఎస్ ఎయిర్‌ఫోర్స్ కార్యదర్శి ట్రాయ్ మింక్ కూడా ఈ ఆయుధాల మోహరింపును ధ్రువీకరించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఎదురయ్యే సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు తాము నిరంతరం సిద్ధంగా ఉంటామని ఆయన చెప్పారు. అందుకే శత్రువులను నిలువరించేందుకు స్పేస్ కంట్రోల్ ఆయుధాలను కక్ష్యలో ఉంచినట్లు తెలిపారు. ఆయుధాల సంఖ్య, వాటి రకాలు, అవి కక్ష్యలో ఎక్కడ ఉన్నాయనే వివరాలను ఆయన వెల్లడించనప్పటికీ, ఆధునిక యుద్ధాల్లో అంతరిక్షం కీలక పాత్ర పోషిస్తున్న తరుణంలో అగ్రరాజ్యం చేసిన ఈ బహిరంగ ప్రకటన అంతర్జాతీయంగా తీవ్ర ప్రాధాన్యం సంతరించుకుంది.

చైనా, రష్యాల నుంచే ముప్పు

అంతరిక్షంలో అమెరికా ప్రయోజనాలకు చైనా, రష్యాల నుంచే ప్రధాన ముప్పు పొంచి ఉందని స్పేస్ ఫోర్స్ పేర్కొంది. తమ సైనిక ఆధునీకరణలో భాగంగా చైనా స్పేస్, కౌంటర్-స్పేస్ వ్యవస్థలను అభివృద్ధి చేస్తోందని, రష్యా సైతం అంతరిక్షాన్ని ఒక “యుద్ధ క్షేత్రం”గా భావిస్తూ భవిష్యత్ ఘర్షణల్లో పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది.

వాస్తవానికి ప్రచ్ఛన్న యుద్ధం నాటి నుంచే అంతరిక్ష సైనికీకరణ బీజాలు పడ్డాయి. 1957లో సోవియట్ యూనియన్ ‘స్పుత్నిక్’ ప్రయోగించిన తర్వాత నుంచే ఉపగ్రహాలను కాపాడుకోవడం, ప్రత్యర్థుల ఉపగ్రహాలను నిర్వీర్యం చేయడంపై అమెరికా, రష్యాలు దృష్టి సారించాయి. 1967 నాటి ‘ఔటర్ స్పేస్ ట్రీటీ’ అంతరిక్షంలో భారీ వినాశకర ఆయుధాల (న్యూక్లియర్ వంటివి) మోహరింపును నిషేధించినప్పటికీ, సంప్రదాయ సైనిక వ్యవస్థలపై ఎలాంటి పూర్తి స్థాయి నిషేధం విధించలేదు. ఆనాటి నుంచి నేటి వరకు అమెరికా, రష్యా, చైనాలతో పాటు భారత్ కూడా సైనిక సమాచార వ్యవస్థలు, నిఘా, నావిగేషన్‌కు అత్యంత కీలకమైన ఉపగ్రహాలను లక్ష్యంగా చేసుకోగల వ్యవస్థలను అభివృద్ధి చేశాయి. తాజాగా అమెరికా ప్రకటనతో అంతరిక్షంలో ఆధిపత్య పోరు మరో కీలక మలుపు తిరిగింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *