Last Updated:
హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ బాబ్రీహిల్స్‌కు చెందిన నవాబ్ సయ్యద్ జుమైద్ మొహియుద్దీన్ హుస్సేనీ(30) ఒక వ్యాపారవేత్త. ఆయనకు మొయినాబాద్ పరిధిలో ఒక సొంత ఫామ్‌హౌస్ ఉంది.
Hyderabad: సరదాగా చేసిన ఒక చిన్న నిర్లక్ష్యం ఒక యువ వ్యాపారవేత్త ప్రాణాల మీదకు తెచ్చింది. “చిన్న పామే కదా.. ఏం చేస్తుందిలే” అని నిర్లక్ష్యంగా ఆటాడటం, స్నేహితులను భయపెట్టే ప్రయత్నం చేయడం చివరకు అతని మృతికి కారణమైంది. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ శివార్లలోని మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
స్థానికులు మరియు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ బాబ్రీహిల్స్‌కు చెందిన నవాబ్ సయ్యద్ జుమైద్ మొహియుద్దీన్ హుస్సేనీ(30) ఒక వ్యాపారవేత్త. ఆయనకు మొయినాబాద్ పరిధిలో ఒక సొంత ఫామ్‌హౌస్ ఉంది. ఈ నెల 17వ తేదీ రాత్రి ఆయన తన స్నేహితులతో కలిసి వీకెండ్ గడపడానికి ఆ ఫామ్‌హౌస్‌కు వెళ్లారు. అందరూ కలిసి సరదాగా గడుపుతుండగా.. 18వ తేదీ తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో ఫామ్‌హౌస్‌లోకి ఒక చిన్న కట్లపాము (Krait Snake) వచ్చింది.
పాము చాలా చిన్నదిగా ఉండటంతో మొహియుద్దీన్ భయపడకుండా దాన్ని చేతితో పట్టుకున్నారు. అంతటితో ఆగకుండా ఆ పామును చేతిలో పట్టుకుని అక్కడున్న స్నేహితులను సరదాగా భయపెట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆ విషసర్పం ఒక్కసారిగా ఆయన కుడి చేతి బొటనవేలును తన నోటితో గట్టిగా పట్టుకుని కాటేసింది. “పాము కరుస్తోంది” అని అంటూనే ఆయన దాన్ని మరో చేతితో లాగి అవతలకు విసిరేశారు.
పాము కరిచిన వెంటనే అక్కడున్న స్నేహితులు తీవ్ర ఆందోళనకు గురై ఆసుపత్రికి వెళ్దామని పట్టుబట్టారు. అయితే, చిన్న పామే కదా తనకు ఏమీ కాదంటూ మొహియుద్దీన్ వారిని వారించారు. అలా దాదాపు ఒక గంట సమయం గడిచిపోయింది. ఆ తర్వాత శరీరంలో విషప్రభావం మొదలై మార్పులు రావడంతో వెంటనే ఆయనను మెహదీపట్నంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
అక్కడ ప్రాథమిక చికిత్స అందించి ఇంజెక్షన్ ఇచ్చినప్పటికీ.. మరో రెండు గంటల తర్వాత ఆయన పరిస్థితి మరింత విషమించింది. దీంతో మెరుగైన చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే దురదృష్టవశాత్తూ ఆసుపత్రికి చేరుకున్న కొద్దిసేపటికే మొహియుద్దీన్ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఒక చిన్న నిర్లక్ష్యం ముగ్గురు పిల్లలను అనాథలను చేయడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
Hyderabad,Telangana













