Last Updated:
Hyderabad: హైదరాబాద్‌లోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది.
పండుగ పూట బిడ్డకు బంగారు ఆభరణాలు కొనుగోలు చేద్దామని ముచ్చటపడి వెళ్లిన ఆ తల్లిదండ్రులకు దుకాణ నిర్వాహకుల నిర్లక్ష్యం తీరని గర్భశోకాన్ని మిగిల్చింది. బంగారం మెరుగుపెట్టేందుకు వినియోగించే అత్యంత ప్రమాదకరమైన ‘సైనేడ్’ రసాయనాన్ని తినుబండారంగా భావించి నోట్లో పెట్టుకోవడంతో రెండేళ్ల చిన్నారి నిమిషాల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయింది. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసుల ప్రాథమిక వివరాల ప్రకారం.. శ్రీనివాస్‌నగర్ ప్రాంతానికి చెందిన గోపి, జానకి దంపతులకు రెండేళ్ల కుమార్తె ‘మిషా’ ఉంది. బతుకమ్మ పండుగ సందర్భంగా చిన్నారికి చెవికమ్మలు కొనుగోలు చేయాలని ఆ దంపతులు భావించారు. ఇందుకోసం బుధవారం సాయంత్రం పాపను తీసుకుని చింతల్ పరిధిలోని ‘విష్ణు జ్యుయలరీ’ దుకాణానికి వెళ్లారు. తల్లిదండ్రులు ఆభరణాల డిజైన్లను పరిశీలిస్తున్న సమయంలో, ఆడుకుంటూ తిరుగుతున్న చిన్నారి దుకాణంలోని టేబుల్‌పై అజాగ్రత్తగా ఉంచిన సైనేడ్ రసాయనాన్ని గమనించింది. దాన్ని ఏదో ఆహార పదార్థంగా భావించి వెంటనే నోట్లో వేసుకుంది.
క్షణాల వ్యవధిలోనే చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లి కింద పడిపోయింది. దీంతో భయభ్రాంతులకు గురైన తల్లిదండ్రులు, దుకాణ సిబ్బంది హుటాహుటిన సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆసుపత్రికి చేరేలోపే విషం శరీరమంతా వ్యాపించడంతో చిన్నారి అప్పటికే మరణించిందని వైద్యులు ధ్రువీకరించారు. చేతికి అందివచ్చిన పసికందు కళ్లెదుటే విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.
ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ చిన్నారి కుటుంబ సభ్యులు, బంధువులు శనివారం జ్యుయలరీ దుకాణం ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. మానవ ప్రాణాలను హరించే ఇంతటి తీవ్రమైన రసాయనాన్ని సాధారణ కస్టమర్లు, పిల్లలు తిరిగే ప్రాంతంలో టేబుల్‌పై ఎలా నిర్లక్ష్యంగా ఉంచుతారని వారు ప్రశ్నించారు. దుకాణ యజమాని తీవ్ర నిర్లక్ష్యమే తమ బిడ్డ ప్రాణాన్ని బలితీసుకుందని మండిపడ్డారు. అనంతరం బాధిత కుటుంబం స్థానిక జీడిమెట్ల పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దుకాణంలో సైనేడ్ వంటి ప్రమాదకర రసాయనాల నిల్వ, భద్రతా నిబంధనల ఉల్లంఘనలపై సమగ్ర విచారణ జరుపుతామని అధికారులు వెల్లడించారు. ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.














