Last Updated:
ముఠా సూత్రధారితో సహా ముగ్గురు పాత నేరస్థులను పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి రూ. 2,25,000 నగదుతో పాటు రెండు సెల్‌ఫోన్లు, ఒక బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.
Hyderabad: నగరంలో వరుస దోపిడీలు, ఆస్తి నేరాలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న అంతర్రాష్ట్ర మోస్ట్ వాంటెడ్ ‘బ్రూస్ లీ’ గ్యాంగ్‌ను చిలకలగూడ పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. ముఠా సూత్రధారితో సహా ముగ్గురు పాత నేరస్థులను పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి రూ. 2,25,000 నగదుతో పాటు రెండు సెల్‌ఫోన్లు, ఒక బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. జైలు నుంచి విడుదలైన కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే ఈ గ్యాంగ్ మళ్లీ దొంగతనాలకు పాల్పడి పోలీసులకు చిక్కడం గమనార్హం.
చిలకలగూడ ఏసీపీ శ్యాంప్రసాద్ రెడ్డి, ఇన్‌స్పెక్టర్ జరీశెట్టి రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం హుబ్లీకి చెందిన ఇల్లా నెహెమ్యా అలియాస్ బ్రూస్‌లీ (30) సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పరిసరాల్లో కాలిబాటపై నివసిస్తున్నాడు. జూదాలకు అలవాటుపడిన ఇతను డబ్బుల కోసం దొంగతనాలు చేస్తుంటాడు. గతంలో ఓ కేసులో జైలుకు వెళ్లిన బ్రూస్‌లీ, జూన్ 18న జైలు నుంచి విడుదలయ్యాడు.
ఆ తర్వాత జూన్ 22న తన ముఠా సభ్యులైన బాలానగర్‌కు చెందిన చేగూ ప్రశాంత్ అలియాస్ బుజ్జి (22), మెట్టుగూడకు చెందిన తాటి అశ్వంత్ (28) మరియు ఒక జువైనల్ బాలుడితో కలిసి ముషీరాబాద్‌కు చెందిన రాజ్‌కుమార్ అనే వ్యక్తిని బోయిగూడలోని ఒక హోటల్ వద్ద అడ్డుకున్నారు. అతడిని బలవంతంగా బైక్‌పై పద్మారావునగర్ వైపు తీసుకెళ్లి తీవ్రంగా కొట్టి, రూ. 6 వేల నగదు, సెల్‌ఫోన్ లాక్కున్నారు. ఆపై ఆలుగడ్డబావి ఆర్‌ఓబీ సమీపంలో వదిలిపెట్టి బెదిరించారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా మెట్టుగూడ శ్మశానవాటికలో దాక్కున్న నిందితులను మంగళవారం అరెస్ట్ చేశారు.
నిందితుడు బ్రూస్‌లీకి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు విచారణలో వెలుగుచూశాయి. 15 ఏళ్ల వయసులోనే ఇల్లు వదిలి పారిపోయి నగరానికి వచ్చిన ఇతను, 20 ఏళ్ల వయసు నుండి చోరీలకు అలవాటుపడ్డాడు. జైల్లో ఉన్నప్పుడు తోటి ఖైదీలు “నువ్వు బ్రూస్‌లీలా ఉన్నావు” అని పొగడటంతో తన పేరును బ్రూస్‌లీగా మార్చుకున్నాడు. అంతేకాదు, జైలుకు వెళ్లిన ప్రతిసారీ అక్కడ పరిచయమైన పాత నేరస్థులకు సులభంగా డబ్బు సంపాదించవచ్చని ఆశ చూపి తన గ్యాంగ్‌లోకి రిక్రూట్ చేసుకోవడం ఇతనికి అలవాటు.
జూన్ 22న బోయిగూడలో దోపిడీకి పాల్పడిన బ్రూస్‌లీ గ్యాంగ్, జూన్ 23 తెల్లవారుజామున ఆల్వాల్‌లో ఒక ఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనానికి ప్రయత్నించింది. అదే రోజు మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఇంట్లోకి చొరబడి భారీగా నగదు, ఆభరణాలను అపహరించింది. ఈ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌పై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో కలిపి మొత్తం 65 కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
నిందితుల నుంచి మీర్‌పేట చోరీకి సంబంధించిన రూ. 2.25 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో ఉన్న మైనర్ బాలుడిని జువైనల్ హోంకు తరలించారు.
Hyderabad,Telangana













